– ఏడాదైన ఉంటదా..?
– అంబేద్కర్ విగ్రహానికి దండేసి దండం పెట్టరా
– కేసీఆర్ కట్టిన గుడికెందుకు పోతుండ్రు.. ఆఫీస్‌లో ఎట్ల కూసుంటుండ్రు
– బోనస్ బోగసైంది.. రుణమాఫీ డోకా చేసిండ్రు
– హామీల్ని ఎగబెట్టిన కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి..?
– బీజేపీకి ఓటేస్తే మురికి కాల్వలేసినట్టే
– బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ప్రజల తరపున కొట్లాడుతం : సుల్తాన్‌పూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
”లిల్లీపుట్‌గాళ్లకు కూడా అధికారమొస్తది. మంచి పనులు చేస్తరని అధికారం ఇస్తరు. కానీ..! ఏం జరుగుతుంది. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 పుణ్యాన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. దేశం గర్వించేలా అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం. కానీ..! లిల్లీపుట్‌గాళ్ల ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహానికి దండేసి దండం పెట్టలే. దేశం నలుమూలల నుంచి అంబేద్కరిస్టులొస్తే చూడనీయకుండా తాళ మేసిండ్రు. ఇది అహంకారమా..? అజ్ఞానమా..? కండ కావరమా..? నేను పెట్టినానని అంబేద్కర్‌ను అవమాన పరుస్తరా..? మరి సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టినం. ఎందుకు సిగ్గులేకుండా అక్కడ కూర్చుంటున్నరు. యాగదిరిగుట్ట గుడి కట్టినం అక్కడెందుకు పూజలు చేస్తున్నరు. ఇచ్చిన హామీల్ని ఎగబెట్టిండ్రు. కడుపులో పెట్టి కాపాడుకున్న రైతుల్ని ఆగం చేస్తుండ్రు. బోనస్ ఇస్తమని చెప్పి బోగస్ చేసిండ్రు. కాంగ్రెస్ ఐదేండ్లు అధికారంలో ఉండాలి.. అప్పుడే మంచికి, చెడుకి మధ్య తేడా తెలుస్తుంది.. అయితే సీఎం పదవి కోసం ఎవరు ఎక్కడ జంప్ అవుతారో తెలియదు.. గిట్లాంటి లిల్లీపుట్‌గాళ్ల ప్రభుత్వం ఏడాదైనా ఉండనట్లుంది” అంటూ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరై మాట్లాడారు.
అంబేద్కర్‌కు అవమానం జరుగుతుంటే మనం నోరు మూసుకుని ఉంటామా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సీట్లెందుకు.. ఓట్లేందుకని కాంగ్రెసోళ్లు అంటున్నారని, తెలంగాణ హక్కుల్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ బిడ్డలు పార్లమెంట్‌లో ఉంటేనే కొట్లాడగలరని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక వరి కోతలు బందై కరెంట్ కోతలు షురూ అయ్యాయన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2500 సాయం, ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం, రైతు బంధు, పింఛన్ల పెంపు వంటి హామీల్ని అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లతో బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. వడ్లు, మక్కలకు బోనస్ ఇవ్వడానికి కోడ్ అడ్డు ఉండదన్నారు. వెంటనే రుణమాఫీ చేయాలన్నారు. ఎండిన పంటకు నష్టపరిహారం, రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్ కోసం బీఆర్‌ఎస్ పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టిందన్నారు. మెతుకు సీమ మెదక్ జిల్లాలో సింగూర్ జలాల్ని పంట పొలాలకు మల్పింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర లిప్టులు కట్టి జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ ప్రాంతంలో మూడు లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ వచ్చి ఆ లిప్టుల్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడూ పోలీసుల చేత దౌర్జన్యాలు చేయించింది లేదన్నారు. హామీలు అమలుచేయాలని అడిగితే బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులు రెచ్చిపోయి బీఆర్‌ఎస్ వాళ్లను అరెస్టు చేసి కేసులు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ‘మళ్లీ అధికారంలోకి వస్తాం.. తస్మా జాగ్రత్త’ అంటూ పోలీసుల్ని హెచ్చరించారు. మేథావులైన ఉద్యోగులు సైతం ఆలోచించి ఓట్లేయాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో మేలు చేసిందని గుర్తు చేశారు. అక్కరకు రాని చుట్టం.. మొక్కినా వరమివ్వని దేవుళ్లు ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నట్లుగా తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని అన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్లే అవుతుందన్నారు. సభలో మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మహబూబ్‌అలీ, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్యరావు, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపత్తి శ్రీనివాస్, మెదక్, జహీరాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామ్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, పట్నం మాణిక్యం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.