ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి

నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ శిల్పారెడ్డి అన్నారు. మంగళ వారం కోఠి డిఎంహెచ్‌ఎస్‌ ప్రాంగణంలో ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో డాక్టర్‌ శిల్పారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని 26వేెలమంది ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆశా వర్కర్ల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల అనంతరం ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు మూడు దశాబ్దాలకు పైగా పని చేస్తున్నారన్నారు. వారు రిజిస్టర్లు రాయడం, సర్వేలు నిర్వ హించడం, ఆన్‌లైన్‌లో పనిచేయడం, బీపీ, షుగర్‌, థైరాయిడ్‌ వంటి అన్ని రకాల వ్యాధులను గుర్తించడంతో పాటు ప్రభుత్వం ద్వారా అనేక శిక్షణలు పొందారు. గర్భిణీ స్త్రీలు, శిశువులు, చిన్న పిల్లలు ఇతర వ్యక్తులకు ఆరోగ్య సేవలు. కరోనా మహమ్మారి సమయంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆశా వర్కర్లకు ఆరోగ్యంలో గ్లోబల్‌ లీడర్‌లుగా అవార్డును ప్రకటించింది అని గుర్తు చేశారు. ఇంత అనుభవం ఉన్న ఆశా వర్కర్లను పరీక్షలు రాయమని అడగడం సమంజసం కాదన్నారు. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆశాలకు కొత్త సమస్యలు తీసుకురావడం సరికాదన్నారు. ఆశలకు ఇచ్చే పారితోషికాన్ని ప్రస్తుత ప్రభుత్వం రూ. 18 వేలు పెంచి అమలు చేయాలన్నారు. ప్రతి నెల 2న వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మండల, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల్లో ఆశా వర్కర్లం దరూ మహిళలే కావడంతో ఆశాలకు తక్షణమే విశ్రాంతి గదులు లేవని వాటిని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ప్రసూతి సెలవులు కల్పిస్తూ సర్క్యులర్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. గన్‌ ఫౌండ్రి డివిజన్‌ కార్పొరేటర్‌ డాక్టర్‌ సురేఖ ఓం ప్రకాష్‌ మద్దతు తెలిపారు. అనంతరం వారు కుటుం బ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు వారిని సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు గేటు ముందు బైఠాయించారు. ఆశా వర్కర్ల సమస్యలపై స్పష్టత వచ్చేవరకు ఆందోళన విరమించే లేదని స్పష్టం చేశారు దీంతో మెటర్నల్‌ హెల్త్‌ న్యూట్రిషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మజ వారి వద్దకు వచ్చి ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో మహిళా మోర్చా నాయకులు గీతారెడ్డి, డాక్టర్‌ సమత, అనిత, జ్యోతి, భాగ్యలక్ష్మి, వాణి, మంజులారెడ్డి, పెద్ద ఎత్తున మహిళ నాయకులు పాల్గొన్నారు.