– డాక్టర్ జి.నిర్మల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జి నిర్మల డిమాండ్ చేశారు. పాత పెన్షన్ అమలు చేయాలనీ, 317 జీవో రద్దు చేయాలనీ, 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాన్ఫడరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరై ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ -2024 డైరీని ఆవిష్కరించారు. నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆరేండ్ల పాటు అసోసియేషన్ అధ్యక్షునిగా సేవలందించిన సంపత్ కుమార్ స్వామితో పాటు పూర్వ కోశాధికారి గడ్డం బాలస్వామిని ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సంపత్ కుమార్ స్వామి సీపీఎస్, 317 జీవో సమస్యలపై పోరాడాలని సూచించారు. మరియు నూతనంగా ఎన్నికైన సంఘం కార్యవర్గాన్ని అభినందించి, సత్కరించారు. సమావేశంలో స్టేట్ సెక్రటరీ జనరల్ సెక్రెటరీ యాకుబ్ పాషా, జాజుల రంజిత్ తదితర నాయకులు పాల్గొన్నారు.