అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెపైన ప్రభుత్వం నిర్బంధాన్ని తక్షణమే ఆపాలి

– సమ్మెలో వున్న సంఘాలతో చర్చలు జరిపి, సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలి
– వామపక్షాలు కార్మిక, ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్
అంగన్వాడి ఉద్యోగుల సమ్మె పైన ప్రభుత్వం నిర్బంధాన్ని తక్షణమే ఆపాలని, సమ్మెలో ఉన్న సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని వామపక్షాల కార్మిక ఉద్యోగ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంచాలని,టే ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. 1926 చట్టం ప్రకారం 14 రోజుల ముందే ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు సమ్మె నోటీస్ అందజేశారు. చట్టబద్ధంగా, న్యాయంగా, శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్బందాన్ని ప్రయోగిస్తున్నది. బెదిరింపులకు పాల్పడుతున్నది. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చేస్తున్నది. సమ్మెలో ఉన్న సంఘాలను చర్చలకు పిలవకుండా అప్రజాస్వామిక వైఖరితో ప్రభుత్వం ముందుకు పోతున్నది. సమ్మెపైన ప్రభుత్వం నిర్బందాన్ని తక్షణమే ఆపాలని, సమ్మెలో వున్న సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణ  రాష్ట్రంలో సుమారు 70వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. గత 45 సంవత్సరాలకు పైగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్నారు. అయినా వీరికి కనీస వేతనం, పెన్షన్, ఇ.ఎస్.ఐ., ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడు, కర్నాటక లో హెల్త్ కార్డులు ఇచ్చారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాలలో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్, వెల్ఫేర్ బోర్డు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్ గా మార్చారు. కానీ టీచర్లతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. గతంలో అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వం పి.ఆర్.సి. లో కలిపింది. అయిదే పేస్కేల్ లేకపోవడం, బేసిక్ వేతనం నిర్ణయం చేయకపోవడం వలన అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎ, గ్రామ పంచాయితీ సెక్రటరీలను, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరిలాగే మమ్మల్ని కూడా పర్మినెంట్ చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలోకి వెళ్ళాలని ఆగస్టు 13న జెఎసి నిర్ణయం చేసింది. ఇదే సమయంలో ఐసిడిఎస్ మంత్రి సత్యవతి రాథోడ్  ఆగస్టు 18న అంగన్వాడీ సంఘాలతో జాయింట్ సమావేశం నిర్వహించారు. అన్ని అంశాలు చర్చించిన తర్వాత కొన్నింటిపైన నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. గతం కంటే ఎక్కువ వేతనాలు పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు లక్ష ఇస్తామని, 2 లక్షల ప్రమాద బీమా తదితర 13 అంశాలపైన హామీలు ఇచ్చారు. దీంతో జెఎసి అనుకున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశాము. కానీ ఆగస్టు 25న ఇచ్చిన హామీలకు భిన్నంగా అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు లక్ష, హెల్పర్లకు 50వేలు ప్రకటించటంతో పాటు వేతనాల పెంపు, ఇతర సమస్యలపైన ప్రకటన రానందున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల నుండి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితిలో మరో గత్యంతరం లేక జెఎసి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందజేశాము.సమ్మె ప్రారంభమై నేటికి 14 రోజులు అవుతుంది. ప్రారంభం నుండి కూడా ప్రభుత్వం సమ్మె పరిష్కారం కోసం ఆలోచించడం లేదు. నిర్భందంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నది. సమ్మెలో వున్న సంఘాలను కాకుండా పోరాటంలో లేని సంఘాలను 12న హైదరాబాద్ ఐసిడిఎస్ మంత్రి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేయకపోగా కేవలం చనిపోతే మట్టిఖర్చులు నిర్ణయం చేసింది. చావులో కూడా టీచర్లకు, హెల్పర్లకు వ్యత్యాసం చూపించింది. ఈ నిర్ణయం అంగన్వాడీ ఉ. ద్యోగుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఇలాంటి చర్యలు ప్రభుత్వం తక్షణమే ఆపాలని, సమ్మెలో వున్న సంఘాలను పిలిచి సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
   ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వామపక్ష నాయకులు సిపిఐఎం జిల్లా ఏ రమేష్ బాబు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కంజరి భూమయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నర్సింగ్ రావు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సుధాకర్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య,, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు వరదయ్య, టెన్షనర్ సంగం రాష్ట్ర నాయకులు రామ్మోహన్ రావు , ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ , అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి శిల్ప లింగం, రైతు సంఘం జిల్లా నాయకులు దేవేందర్ సింగ్, ఈ సమావేశానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.