గిరిజన చట్టాలను, జీవోలను, హక్కులను కాలరాస్తున్న కలెక్టర్ ను ప్రభుత్వం తక్షణమే బదిలీ చేయాలి

– ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్
నవతెలంగాణ -తాడ్వాయి
గిరిజన చట్టాలను జీవోలను హక్కులను కాలవస్తున్న ములుగు జిల్లా కలెక్టర్ ని ప్రభుత్వం తక్షణమే బదిలీ చేయాలని ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్నెబెల్లి గణేష్ అన్నారు. మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో   రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్ మాట్లాడుతూ ములుగు జిల్లా కలెక్టర్ ఆదివాసీల పట్ల, గిరిజనుల పట్ల ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, మేము మేడారం జాతర నుండి కలెక్టర్ గారి వ్యవహార శైలిని గమనిస్తున్నామని, జాతర విషయంలో కూడా ఎక్కడా పట్టింపు లేనట్లు వ్యవహరించారని, గిరిజనులు, గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు అంటే నే గౌరవం లేనట్లుగా ప్రవర్తించారని మండిపడ్డారు. అత్యధిక గిరిజనులు ఉండే ములుగు జిల్లాకు ఎందుకు కలెక్టర్ గా వచ్చారని ఆయన ప్రశ్నించారు ? భారత రాజ్యాంగము ఐదవ షెడ్యూలు భూభాగము గిరిజనుల అభివృద్ధి కోసం సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ను తీసుకొచ్చి ఐ.టీ.డీ.ఏ ను ఏర్పాటు చేస్తే, సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అధికారాలను కూడా, మీ(కలెక్టర్) చేతుల్లోకి లాక్కొని  మా ఐ.టీ.డీ.ఏ పరిపాలన అధికారిని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు ఎప్పుడైనా ఐ.టీ.డీ.ఏ. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ జీ.వో. 57 ను చదివారా? అని ఆయన ప్రశ్నించారు. మొన్నటికి మొన్న ములుగు జిల్లాకు సంబంధించిన స్టాఫ్, నర్స్ ల నియామకాలలో గిరిజనులకు అత్యంత అన్యాయం చేశారని, షెడ్యూల్ ఏరియాలో హెల్త్ విభాగంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ తప్ప మిగతా పోస్టులన్నీ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్ ప్రాజెక్ట్ అధికారి గారే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాల్సి ఉండగా, జిల్లా కలెక్టర్ మరియు వైద్యాధికారి ఎలా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తారని, అందులోనూ ఎన్.హెచ్. ఎం. గైడ్ లైన్స్ ప్రకారం షెడ్యూల్ ఏరియా పోస్టులలో లోకల్ షెడ్యూల్డ్ ట్రైబల్ తో భర్తీ చేయాలని స్పష్టంగా జీ.వో. 68 ను అమలుపరచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ గారు గైడ్ లైన్స్ జారీ చేసినా వాటిని తుంగలో తొక్కి గిరిజనుల హక్కులను కాల రాశారని ఆవేదన చెందారు. ఇదే నోటిఫికేషన్ ను కొమురం భీం ఆశిఫాబాద్, కరీంనగర్, మహబూబాబాద్ ఇతర జిల్లాలో ఇచ్చారని వాటిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్  కచ్చితంగా అమలు చేస్తూ ఎన్.హెచ్.ఎం గైడ్ లైన్స్ జీ.వో. 68 ప్రకారం  షెడ్యూల్డ్ ఏరియా పోస్టులలో లోకల్ షెడ్యూల్డ్ ట్రైబల్ తో భర్తీ చేయాలని ఇచ్చారని, కానీ ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధంగా నోటిఫికేషన్ జారీ చేశారని  తెలియజేశారు. జీ.వో. 68 అనేది ఐదవ షెడ్యూల్ ఏరియాను బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని దానిని తుంగలో తొక్కి గిరిజనులకు అన్యాయం చేసిన కలెక్టర్ గారిపై ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసులు నమోదు చేసి భర్తీ చేసిన షెడ్యూల్ ఏరియా పోస్టులను ఐ టి.డి.ఏ. ప్రాజెక్టు అధికారి గారి ద్వారా ” రీ నోటిఫికేషన్”ఇచ్చి భర్తీ చేయాలని, ఒక గిరిజన మంత్రి   గిరిజనులకు ములుగు నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉన్న కూడా గిరిజనులకు న్యాయం జరగకపోవడం అత్యంత  శోచనీయమని, బాధాకరమని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, మంత్రిగారు సంబంధిత కలెక్టర్, వైద్యాధికారి పై చర్యలు తీసుకొని వారిని బదిలీ చేయించి, షెడ్యూలు ఏరియా పోస్టులలో గిరిజను అభ్యర్థులను భర్తీ చేయుటకు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్ ఐ.టీ.డీ.ఏ ప్రాజెక్ట్ అధికారి గారికి ఆదేశాలు జారీ చేయించాలని, లేనిపక్షంలో ఆదివాసి విద్యార్థి సంఘం న్యాయ పోరాటాలతో పాటు దశలవారి నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమం లో అలం నగేష్, ఏఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం కళ్యాణ్, నవీన్, సురేందర్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.