కేంద్రీకరణను, కాషాయీకరణను ప్రభుత్వం తిరస్కరించాలి 

Government should reject centralization and red tape– టీపీటీఎఫ్ ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు ఎం.రామాచారి, జోగా రాంబాబు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
కార్పోరేటీకరణను, కేంద్రీకరణను, కాషాయీకరణను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని టీపీటీఎఫ్ ఉపాద్యాయ దర్శిని సంపాదకులు ఎం.రామాచారి, ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జోగా రాంబాబు అన్నారు. మంగళవారం మండలంలోని అనంతోగు గ్రామం ఆశ్రమ పాఠశాలలో టీపీటీఎఫ్ మండల జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం.రామాచారి, జోగా రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడుతూ.. పాఠశాల విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే 5+3+3+4 విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో వరుసగా కనీసం 10 శాతం, 20 శాతం నిధులు విద్యకు కేటాయించాలని చెప్పారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 30 వేల పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ఒకటి నుంచి మూడు తరగతులను అంగన్వాడీలలో కలిపే ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అశాస్త్రీయమైన ఉపాద్యాయుల సర్దుబాటు జీ.ఓ నెంబర్ 25ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన ఆళ్ళపల్లి టీపీటీఎఫ్ నూతన కమిటీలో ఎన్నికలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బానోత్ భోజ్యా, ఈసం ముత్తయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కె.లక్ష్మినారాయణ, జి.కుమార్ రాజు, ఎన్.రామకృష్ణ, ఎ.నాగమణిలు ఎన్నిక కాగా కార్యదర్శులుగా కె.రామయ్య, నెహ్రూ, బి.బధ్రు, బి.రవిలు ఎన్నిక అయ్యారు. అదేవిధంగా జిల్లా కౌన్సిలర్లుగా సీ.హెచ్.భద్రమయ్య, టి.బిక్షమయ్య, కె.లాలయ్య ఎన్నిక కాగా ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి.శ్రీను, సభ్యులుగా డి.నాగేశ్వర్రావు, ఎల్.నీలావతిలను ఎన్నుకున్నారని చెప్పారు. చివరగా రాష్ట్ర బాధ్యులు నూతన టీపీటీఎఫ్ మండల కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ గుమ్మడి సమ్మయ్య, జిల్లా కార్యదర్శి బి.బాలు, నాయకులు చాట్ల శ్రీనివాసరావు, బిక్షమయ్య, కొమరం లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.