
నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు మానవతా దృక్పథంతో ప్రతి నెల రూ.10 వేలు జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్వయంకృషి ఆటో యూనియన్ భువనగిరి కొత్త బస్టాండ్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) సభ్యుల సమావేశం అధ్యక్షులు ఎడ్ల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఇమ్రాన్ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ భువనగిరి కొత్త బస్టాండ్ లో ఆటోలకు స్టాండ్ కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగం లో సుమారుగా 15 లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని, పరోక్షంగా 40 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు వారిపై ఆధార పడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆదుకోక పోతే వాహన రంగంపై ఆధారపడిన ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ప్రయాణికులు ఆటోలు ఎక్కకపోవడంతో ప్రస్తుతం రోజుకు రూ. 200 నుండి 300 మాత్రమే సంపాదించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనివలన ప్రతినెలా ఫైనాన్స్ కట్టలేక మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫైనాన్స్ కట్టలేక ఆటోలను కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10 వేలు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
లేనిపక్షంలో ఆటో డ్రైవర్ల బతుకుల కోసం పోరాటం చేయవలసి వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విదంగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రం భువనగిరి లో పార్కింగ్ స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామల భాస్కర్ పాల్గొన్నారు.
అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎడ్ల నరేష్, ఉపాధ్యక్షులుగా సిద్ధంకి శ్రీనివాస్, మర్రి శివ, ప్రధాన కార్యదర్శిగా తారాల ఉపేందర్, సహాయ కార్యదర్శులుగాబోడ స్వామి, మాటూరి సతీష్ కోశాధికారిగా బండారి సుమన్, కార్యవర్గ సభ్యులు:- ఏర్పులే ఎల్లయ్య, మాటూరి శీను, మిర్యాల స్వామి, మిర్యాల సత్యనారాయణ, బీర రవి, ఆకుల రాజు, ఇట్టబోయిన గణేష్ ఎన్నుకున్నారు.