హైపవర్‌ కమిటీ నివేదికపై సమయం కోరిన ప్రభుత్వం

– జీవో 111 అమలు రద్దు వ్యవహారంపై హైకోర్టు విచారణ
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ లోని జంటజలాశయాలైన హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ పరీవాహక ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 ఎత్తివేతకు సంబంధించి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ నివేదికపై వివరణ ఇచ్చేందుకు మరింత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. హైపవర్‌ కమిటీ నివేదిక సమర్పించిందా ? లేదా ? ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 111ను రద్దు చేసి సదరు నిషేధిత ప్రాంతంలో పర్యావరణహితంగా అభివద్ధి చేస్తామని పేర్కొంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన జీవో 69ను జారీచేసింది. ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేసింది. జీవో 111 రద్దును వ్యతిరేకిస్తూ హైకోర్టులో అప్పటికే పెండింగ్లో ఉన్న విటిషన్లలో పిటిషనర్లతోపాటు కొత్త పిటిషన్లు దాఖలు కావడంతో హైపవర్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111 రద్దుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోమనీ, నిర్మాణాలకు సంబంధించి గతంలో ఉన్న ఆంక్షలు, నిషేధాలను సడలించబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. తాజాగా సోమవారం జీవో 111కు సంబంధించిన దాదాపు 12 పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిన్‌ అనిల్కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ వాదనలు వినిపిస్తూ కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో రద్దుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఇదే ధర్మాసనం ఆదేశించిందనీ, సదరు అదేశాల ప్రకారం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. జీవో 111 యథాతథంగా కొనసాగుతోందని నివేదించారు. అసలు కమిటీ నివేదిక ఇచ్చిందా? ప్రస్తుత పరిస్థితి. ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదికకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు నాలుగువారాల సమయం ఇవ్వాలని ఏఏజీ కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు నాలుగువారాలకు వాయిదా వేసింది.