బడుగులను అణచివేసిన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి 

– మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాసూరి విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి: బడుగు బలహీన వర్గాల ప్రజలను అణిచివేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాసూరి మల్లికార్జున్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండల పరిధిలోని వడ్లూర్ గ్రామంలో ఏర్పాటు. చేసిన సమావేశంలో రాసూరి మల్లికార్జున్ మాట్లాడారు. పదేండ్లు పరిపాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, జాతీయ ఉపాధి హామీ నిధులను దారిమళ్లించి అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి పాల్పడి మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలకు కేటాయించి బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధిని అణిచివేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన దళితులందరికి కేటాయించాల్సిన దళిత బందు పథకాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు తమ అనుచరులకు, కార్యకర్తలకు కేటాయించడం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసమర్థతకు,నిరుపేద దళిత సామాజిక వర్గాలపై చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.