అందరి ఆరోగ్యమే సర్కారు ధ్యేయం..

– అందరూ ఆరోగ్యంగా ఉండటమే నా లక్ష్యం..
– ప్రతి పల్లెకు సర్కారు దవాఖాన సేవలు
– స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవ తెలంగాణ – నసురుల్లా బాద్
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే తన లక్ష్యం అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బుదవారం బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్ లో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గతంలో ఆనాడు పేదోళ్లకు పెద్ద జబ్బు చేస్తే ప్రాణాలపై ఆశలు వదులుకునేవారు. గర్భిణులు ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికి వెళ్లడానికి జంకేవారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు ఖర్చయినా పరవాలేదు ప్రైవేటు  ఆస్పత్రులకు వెళదామనేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ రోగమొచ్చినా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళదామంటున్నారు. గర్భిణులు ప్రసవానికి ముందుగానే సర్కారు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. సుఖప్రసవాలు చేయించుకుంటున్నారు. కేసీఆర్‌ కిట్లు, నగదు సాయం అందుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ఆ బాధలోనూ ప్రభుత్వ ఆస్పత్రులకే పోదామంటున్నారు.. వీటన్నింటికీ కారణం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్యారోగ్య శాఖలో తెచ్చిన విప్లవాత్మక మార్పులన్నారు. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సర్కారు ఆస్పత్రులపై నమ్మకం కలిగేలా కార్పొరేట్‌ వైద్యానికి నాంది పలికారు. కిడ్నీ డయాలసిస్‌.. గుండె ఆపరేషన్లు.. ఐసీయూ, వెంటిలేషన్‌ వంటి సౌకర్యాలు కల్పించారు. పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజల ముంగిట్లోకి వైద్యాన్ని తీసుకొచ్చారు. తాజాగా బాన్సువాడ పట్టణంలో రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయించాం. అలాగే నేడు సాయంత్రం వర్ని లో రూ. 10.70 కోట్లతో నిర్మించే 30 పడకల ఆసుపత్రికి, కోటగిరిలో రూ.13 కోట్లతో నిర్మించే 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు.  ఈ సందర్భంగా కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లబ్దిదారులు, డయాలసిస్ పేషెంట్లు తమ అనుభవాలను, తాము ప్రభుత్వం నుండి పొందిన సేవలపై సభలో వివరించారు. సీఎం కేసీఆర్ కు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాదించిన ప్రగతి, వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో ప్రజలకు వివరించడానికి ఈ దశాబ్ధి ఉత్సవాలన్నారు. ఇందులో వైద్య, ఆరోగ్య శాఖ ప్రాముఖ్యమైనదన్నారు. ఏడాది ఏడాదికి ప్రవేటు ఆసుపత్రుల సంఖ్య పెరుగుతుందని, ఆసుపత్రులు పెరిగాయంటే పేషెంట్లు పెరుగుతున్నారని అర్ధం అన్నారు.ప్రవేటు ఆసుపత్రులలో వైద్యం ఖరీదైన వ్యవహారం. పేదలు ఆర్ధికంగా భరించలేరని అందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెల్లలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను విస్తరించి, ఆధునికీకరణ చేసి అధునాతన పరికరాలు అందుబాటులోకి తెచ్చి పేదలకు ఉచిత వైద్య సహాయం అందజేస్తున్నదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 11,000 కోట్లు కెటాయించారని తెలిపారు. దేశంలో 4000 పడకలు కలిగి ఉండే ఆసుపత్రి నిమ్స్ ఒక్కటే అవుతుందన్నారు. వరంగల్ లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో ఉన్నదన్నారు. గతంలో రాష్ట్రంలో 3 డయాలసిస్ కేంద్రాలు ఉంటే నేడు 26 కు పెరిగినయన్నారు. 2014 కు ముందు రాష్ట్ర ఆసుపత్రులలో బెడ్ల సంఖ్య 8 వేలు ప్రస్తుతం 27,700 బెడ్లలతో ఆసుపత్రిలు ఏర్పడినట్లు తెలిపారు. బాన్సువాడ లో రూ. 20 కోట్లతో 100 పడకల మాతా-శిశు ఆసుపత్రి నిర్మించాం. ప్రారంభించిన రెండు సంవత్సరాల లోపలనే బిడ్డకు తల్లి పాల ప్రోత్సాహంలో బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి జాతీయ అవార్డు వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విశిష్ట సేవలు అందించిన వైద్యులకు సన్మానించారు. ప్రతి మండల కేంద్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి  లక్ష్మణ్ సింగ్, ఆర్డీఓ రాజా గౌడ్, బాన్సువాడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాస ప్రసాద్, డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, బాన్సువాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు వివిధ మండల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.