– బీఆర్‌ఎస్ వైఫల్యాలపై దాడి..
– కాంగ్రెస్ కొత్త స్కీముల ఏకరువు…
– అసెంబ్లీలో ఘన స్వాగతం పలికిన సీఎం, స్పీకర్, సీఎస్, డీజీపీ తదితరులు
– కాళన్న పలుకులతో ప్రసంగం ప్రారంభం..దాశరథి పలుకులతో ముగింపు
– 20 నిమిషాల్లో పూర్తి
– సభ శనివారానికి వాయిదా
– గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం చేసిన ప్రసంగం ఆద్యంతం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింది. ఆ సర్కార్ చేసిన అప్పుల్ని.. అప్పటి తప్పుల్ని ఏకరువు పెడుతూ ఆమె మాట్లాడారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిర్దిష్ట సమయంలో అమలు చేస్తుందంటూ హామీనిచ్చారు. శాసనసభ, మండలి సభ్యులనుద్దేశించి ప్రసంగించేందుకు అసెంబ్లీకి విచ్చేసిన గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆమెను సీఎం, స్పీకర్, మండలి చైర్మెన్ లోపలికి తోడ్కొని వెళ్లారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ… బీఆర్‌ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాయంటూ తూర్పారబట్టారు. ముఖ్యంగా విద్యుత్, పౌర సరఫరాల శాఖల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల గురించి ప్రస్తావించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలనూ గుర్తు చేశారు. ‘దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచటం నా ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్’ అంటూ ఆమె భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేయటం కొసమెరుపు. నియంతృత్వ పాలన, నిర్బంధంలాంటి పదాలు గవర్నర్ ప్రసంగంలో చోటు చేసుకోవటం గమనార్హం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఒకరకంగా చెప్పాలంటే పదేండ్ల తర్వాత కొలువుదీరిన ‘కాంగ్రెస్ సర్కార్ ఆత్మ’ను గవర్నర్ తన ప్రసంగం ద్వారా ప్రజల ముందుంచారు. ఆమె స్పీచ్ ఇటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు పలుకులతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. మహాకవి దాశరథి పలుకులతో ముగించారు. ఉదయం 11.33 గంటలకు ప్రారంభమైన ఆమె ప్రసంగం.. 20 నిమిషాలపాటు కొనసాగి 11.53 గంటలకు ముగిసింది. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో శనివారం చర్చ జరగనుంది.