నా అరెస్టులో గవర్నర్‌ ప్రమేయం

The governor was involved in my arrestజార్ఖండ్‌ శాసనసభలో హేమంత్‌ సోరెన్‌ ఆరోపణ…జనవరి 31 చీకటి రోజని వ్యాఖ్య
– ఆరోపణలు నిరూపించాలని ఈడీకి సవాల్‌
– అడవి బిడ్డలంటే చులకన ఎందుకని నిలదీత

– తల వంచడం తనకు తెలీదని వ్యాఖ్య
– సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపు

రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ బీజేపీ పైన, రాష్ట్ర గవర్నర్‌ పైన విరుచుకుపడ్డారు. నూతన ముఖ్యమంత్రి చంపయి సోరెన్‌ సోమవారం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా హేమంత్‌ ప్రసంగించారు. కోర్టు అనుమతితో విశ్వాస పరీక్షలో ఓటేసేందుకు ఆయన సభకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గత నెల 31న జరిగిన తన అరెస్టు వెనుక గవర్నర్‌ ప్రమేయం ఉన్నదని ఆరోపించారు. ‘జనవరి 31వ తేదీ రాత్రి దేశ చరిత్రలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేశారు. ఈ ఉదంతం వెనుక రాజ్‌భవన్‌ ప్రమేయం ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆ రోజు దేశ చరిత్రలో చీకటి రోజు’ అని అన్నారు.
భూ కుంభకోణం కేసులో ఈడీ తనపై మోపిన ఆరోపణలన్నింటినీ హేమంత్‌ తోసిపుచ్చారు. తనపై మోపిన ఆరోపణల్లో ఏ ఒక్క దానినైనా ఈడీ నిరూపిస్తే రాజకీయ జీవితానికి స్వస్తి చెబుతానని అన్నారు. ‘హేమంత్‌ సోరెన్‌ పేరిట భూమి ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు. ఆరోపణలు నిరూపించాల్సిందిగా ఈడీని సవాలు చేశారు. ‘నేను కన్నీరు కార్చను. సమయం వచ్చే వరకూ దానిని అలాగే దాచుకుంటాను. ఆదివాసీల కష్టాలు, కన్నీరు మీకు పట్టదు. జార్ఖండ్‌లో ఓ గిరిజన ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల పూర్తి కాలం పదవిలో కొనసాగడం బీజేపీకి ఇష్టం లేదు. తన హయాంలో అందుకు అనుమతించదు’ అని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ఆదివాసీలు, దళితులను బీజేపీ గౌరవించదని హేమంత్‌ ఆరోపించారు. హుందాగా జీవించేందుకు వారికి ఉన్న హక్కును నిరాకరిస్తోందని అన్నారు. ‘వీరందరూ అడవి నుండే వచ్చారు…అడవిలోనే ఉండాలి అని చెప్పేందుకు బీజేపీ నేతలు సిగ్గు పడరు. మేము అడవి నుండే వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాము. అయితే వారు మమ్మల్ని అంటరానివారుగా చూస్తారు. ఈ అభిప్రాయాన్ని రూపుమాపేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఈ సమూహాలను అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుంది’ అని చెప్పారు.
భీరువుగా పారిపోయే ప్రశ్నే లేదని హేమంత్‌ స్పష్టం చేశారు. తనను జైలులో పెడితే విజయం సాధించగలనని బీజేపీ అనుకున్నదని, కానీ ఇది జార్ఖండ్‌ అని అన్నారు. ఈ రాష్ట్రంలోని ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వారు తమ సమాజాల కోసం జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న వారు గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల వారిని అణచివేసేందుకు ప్రయత్నించారని అంటూ పూర్తి కాలం పదవిలో ఉండనివ్వబోరన్న విషయం తనకు ముందే తెలుసునని చెప్పారు. తన వంటి వారు ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు కావడం వారు చూడలేరని వ్యాఖ్యానించారు. తల వంచి నడవడం తనకు తెలియదని అన్నారు. ‘నేను అధికారంలోకి వచ్చినప్పటి నుండి నన్ను హేళన చేస్తూనే ఉన్నారు. ఎద్దేవా చేస్తూనే ఉన్నారు. నన్ను చూసి నవ్వుతూనే ఉన్నారు. నేను విమానంలో ప్రయాణించినా, హోటల్‌లో ఉన్నా, కారు నడుపుతున్నా ఇదే తీరు’ అని చెప్పారు.
ఇది దీర్ఘకాలిక పోరాటమని హేమంత్‌ తెలిపారు. ‘రామరాజ్యం వచ్చేసిందని జనవరి 22న చెప్పారు. అందులో తొలి అడుగు బీహార్‌. రెండో అడుగు జార్ఖండ్‌. జరిగిన దానికి నేనేమీ చింతించడం లేదు. నేను ఎన్నికల్లో పోటీ చేయలేనని ఇప్పుడు వారు చెప్పుకోవచ్చు. అయితే జేఎంఎం ఎప్పుడూ రాష్ట్ర గౌరవం, హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుంది. ఎన్నికల్లో అయినా, న్యాయస్థానంలో అయినా, లేక ఇతర రూపంలో అయినా పోరాటం మాత్రం ఆగదు. ఇప్పుడూ అంతే. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు’ అని స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడకూదదని కోర్టు, శాసనసభలో మాట్లాడకూడదని ఈడీ చెప్పిందని అంటూ ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామని ప్రశ్నించారు. దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలని హేమంత్‌ ఆదివాసీలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ పని చేయకపోతే భవిష్యత్‌ తరాలు మనల్ని క్షమించబోవని హెచ్చరించారు.