గ్రామీణ భారత్ బంద్, సమ్మె విజయవంతం

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం, జరిగిన గ్రామీణ భారత్ బంద్, సమ్మె యాదగిరిగుట్ట పెద్ద కందుకూర్ లో ప్రజలందరూ పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేశారు. పెద్ద కందుకూరులో బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణ పురవీధుల గుండా ప్రదర్శన నిర్వహించి వీరవెల్లి మల్ల రెడ్డి స్మారక భవనం వద్ద  సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మంగ నరసింహులు  మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం చేయాలని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ను మంత్రివర్గం నుండి తొలగించి ఆయనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల రూపాయలు పెన్షన్ రూ.10000 రూపాయలు అందరికీ ఇవ్వాలని అన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నష్టం చేసే విధానాలు తీసుకొస్తుందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని విస్తరింపచేసి 200 రోజులకు పెంచాలని రోజుకు రూ.800 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బబ్బురి పోశెట్టి, నాయకులు కాలే స్వామి, మాజీ సర్పంచ్ భీమగాని రాములు గౌడ్, పత్తి నరసింహులు, జోగు శ్రీనివాస్, జమ్ము వెంకటేష్, పత్తి సత్యనారాయణ, జమ్ము శంకర్, శ్రీను, గవ్వల శంకరయ్య, జమ్ము సిద్ధులు, జాగిలాపురం కనకయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.