ఘనంగా తంగలాన్‌ టీజర్‌ లాంచ్‌

The grand launch of the teaser of Tangalanవిక్రమ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘తంగలాన్‌’. దర్శకుడు పా రంజిత్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పార్వతీ, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్‌ నీలమ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను జనవరి 26న రిలీజ్‌ చేయనున్నారు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బుధవారం హైదరాబాద్‌ ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌, దర్శక,నిర్మాత పా.రంజిత్‌, నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా, నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి, హీరో సత్యదేవ్‌, డైరెక్టర్స్‌ బాబి, సురేందర్‌ రెడ్డి, కరుణ కుమార్‌, వేణు ఊడుగుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ, ‘నాకు సినిమాల మీదున్న ప్రేమ, మీకు సినిమాల మీదున్న ప్రేమ ఒక్కటే. మీరు సినిమా బాగుంటే ఏ భాషా చిత్రాన్నైనా చూస్తారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తే ప్రపంచంలో బెస్ట్‌ మూవీస్‌ మనమే చేయగలం. ఈ మూవీతో ఫస్ట్‌ టైమ్‌ విక్రమ్‌ మా స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో నటించడం హ్యాపీగా ఉంది. ఆయన లాంటి గొప్ప నటుడితో సినిమా నిర్మించినందుకు గర్వపడుతున్నా. డైరెక్టర్‌ పా.రంజిత్‌ తన టీమ్‌తో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. జనవరి 26న మన సినిమా లవర్స్‌ అంతా ఈ సినిమాను థియేటర్స్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటాం’ అని అన్నారు.
‘సినిమా మీద తెలుగు ఆడియెన్స్‌ చూపించే ప్రేమ స్వచ్ఛమైనది. ఈ టీజర్‌లో మేము చూపించిన కంటెంట్‌ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సినిమా కూడా మీకు నచ్చేలా ఉంటుంది. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్‌ సినిమా అనుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దక్షిణాది సినిమాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విక్రమ్‌తో వర్క్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ అవకాశం దక్కింది. ఆయనతో ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’ అని దర్శక, నిర్మాత పా.రంజిత్‌ చెప్పారు.
హీరో విక్రమ్‌ మాట్లాడుతూ, ‘ఫస్ట్‌ టైమ్‌ యంగ్‌ టీమ్‌తో సినిమా చేశాను. ఇదొక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ‘తంగలాన్‌’లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి అరుదైన సినిమాలో నటించే అవకాశం రావడం చాలా గౌరవంగా భావిస్తున్నా. మా టీజర్‌ మీకు నచ్చిందని భావిస్తున్నా. నన్ను నమ్మి ఈ సినిమా చేసిన మేకర్స్‌కి థ్యాంక్స్‌’ అని అన్నారు.