టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరు భారత్, జర్మనీల మధ్య హోరాహోరీగా జరుగుతోంది. ఇరు జట్లు పోటిపడి చేస్తున్న గోల్స్ వర్షానికి మైదానం తడిసి ముద్దవుతోంది. అయితే భారత్ అనవసర తప్పిదాల కారణంగా జర్మనీకి పెనాల్టీ కార్నర్‌లు అధికంగా లభించాయి. ఏకంగా జర్మనీకి 13సార్లు పెనాల్టీ కార్నర్ ఛాన్స్ వచ్చింది. అయితే జర్మనీ ఆ 13లో కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే గోల్ చేయగలిగింది. భారత్ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ గోల్ పోస్టుకు అడ్డుగోడగా నిలబడ్డాడు. జర్మనీ ఆటగాళ్లను తలపట్టుకునేలా చేశాడు. శ్రీజేష్ అద్భుత ప్రదర్శనతో నాడు భారత్ 5-4 తేడాతో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 1980 తర్వాత భారత్ హాకీకి ఒలింపిక్స్‌లో మెడల్ రావడం అదే తొలిసారి. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆనందంతో శ్రీజేష్ గోల్ పోస్టు పైకి ఎక్కి కూర్చున్న దృశ్యాలను భారత్ క్రీడాప్రేమికులు ఇప్పటికీ మర్చిపోలేదు..
శ్రీజేష్ గోల్‌పోస్ట్‌కు అడ్డుగా ఉన్నాడంటే.. ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే. గోల్‌పోస్ట్‌పై దాడులు చేసీచేసీ ప్రత్యర్థులు అసలిపోవాల్సిందే గానీ.. వారికి మాత్రం గోల్ కొట్టే ఛాన్స్ ఇవ్వడు. ఇలాంటి సంఘటనలు అతడి కెరీర్‌లో కోకొల్లలు. ఎన్నోసార్లు బెస్ట్ గోల్‌కీపర్‌గా అవార్డులు అందుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. అందుకే అభిమానులు ముద్దుగా ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ హాకీ అంటు పిలుచుకుంటారు.
సెమీస్‌లోకి ఎంట్రీ:
సీన్ కట్ చేస్తే 2024 పారిస్ ఒలింపిక్స్.. వేదిక మారిందే కానీ శ్రీజేష్‌లోని ఆ పట్టుదల మాత్రం అణువంతైనా చెక్కుచెదరలేదు. బ్రిటన్‌పై జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. మ్యాచ్ ముగిసే సమయానికి 1-1తో ఇరు జట్లు చేరి సమానంగా నిలిచాయి. నాకౌట్ మ్యాచ్ కావడంతో షూటౌట్ పద్ధతిలో విన్నర్‌ను నిర్ణయించాల్సి వచ్చింది. మొత్తంగా 5 సార్లు ఇరు జట్లకు ఛాన్స్ ఇస్తారు. తొలి రెండు సార్లు అటు భారత్ ఇటు బ్రిటన్ గోల్ చేశాయి. అయితే మూడో, నాలుగో ఛాన్స్‌లో బ్రిటన్‌ను బోల్తా కొట్టించాడు కీపర్ శ్రీజేష్. అదే సమయంలో భారత్ ఆటగాళ్లు మరో రెండు గోల్స్ చేయడంతో షూటౌట్‌లో టీమిండియా 4-2తో గెలిచి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విక్టరీతో మరోసారి ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీగా శ్రీజేష్ అభిమానుల చేత జేజేలు అందుకుంటున్నాడు.
ఒలింపిక్స్ తన చివరి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అని పిఆర్ శ్రీజేష్ ప్రకటించగానే తన కోసం ప్రత్యేకంగా ఏదైనా చేస్తామని హామీ ఇస్తూ హాకీ టీమిండియా సారథి మన్‌ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాంస్య పతక మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించగానే మన్‌ప్రీత్.. శ్రీజేష్ కు తలవంచి నమస్రించాడు. కోచింగ్ సిబ్బంది సహా మిగతా ఆటగాళ్లలందరూ శ్రీజేష్‌ను ఇలానే గౌరవించారు. ఇది తోటి ఆటగాళ్లకు శ్రీజేష్ పై ఉన్న ప్రేమకు, గౌరవానికి చిన్న ఉదాహరణ మాత్రమే. రెండు దశాబ్దాల పాటు ఇండియా హాకీ జట్టుకు శ్రీజేష్ అందించిన సేవలు చిరస్మరణీయం. వరుసగా రెండు ఒలింపిక్ పతకాలతో ఆట నుంచి వైదొలుగుతున్న శ్రీజేష్ కెరీర్ పరిపూర్ణం అయింది. ఇండియా ఆటగాళ్లే కాదు హాకీని, ఆటలను అభిమానించే ప్రతి ఒక్కరూ అతనికి సలాం కొట్టాల్సిందే.
ప్రతిభను గుర్తించిన స్కూల్ టీచర్:
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కీళక్కంబళం గ్రామంలో 1988 మే 8న మలయాళీ రైతు కుటుంబంలో పుట్టాడు శ్రీజేష్. ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ కీపర్‌గా ఎదిగేందుకు శ్రీజేష్ పడిన కష్టాన్ని చూస్తే ఎవరైనా అతడిని మెచ్చుకోకుండా ఉండలేరు. శ్రీజేష్ తల్లి ఉష ఓ గహిణి, తండ్రి పి.వి. రవీంద్రన్ ఒక సాధారణ రైతు. సెయింట్ ఆంటోనీస్ లోయర్ ప్రైమరీ స్కూల్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, వి.రాజా స్పోర్ట్స్ స్కూల్‌లో శ్రీజేశ్ బాల్యం గడిచింది. రాజా స్పోర్ట్స్ స్కూల్ హాకీ కోచ్ జయకుమార్ శ్రీజేష్‌లోని టాలెంట్‌ను గుర్తించారు. ఆయన సలహా మేరకు శ్రీజేష్ హాకీ గోల్ కీపింగ్‌ను కెరీర్‌గా మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదే స్కూల్‌లో జై కుమార్‌తో పాటు రమేష్ కొల్లప్ప శ్రీజేష్‌కు కోచింగ్ ఇచ్చారు. ఇక కేరళలోని కొల్లాంలోని శ్రీ నారాయణ కళాశాల నుంచి హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రీజేష్ తర్వాత పూర్తిగా హాకీపైనే ఫోకస్ చేశాడు.
జూనియర్ స్థాయి నుంచే ‘బెస్ట్’:
2004లో పెర్త్‌లో జరిగిన జూనియర్ విభాగంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీజేష్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీజేష్ ప్రతిభ, ప్రదర్శనతో తక్కువ కాలంలోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కొలంబోలో జరిగిన 2006 దక్షిణాసియా క్రీడల్లో సీనియర్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2008లో హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఆసియా కప్‌లో భారత్ విజయంలో శ్రీజేష్ కీ రోల్ ప్లే చేశాడు. అతని అసాధారణ ఆటతో ‘బెస్ట్ గోల్‌కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గా ఎంపికయ్యాడు. మరోవైపు సీనియర్ జట్టులోనూ ఆడుతున్నా అతనికి మొదట్లో చాలా తక్కువ అవకాశాలు దక్కాయి. కొన్నిసార్లు జట్టుకు ఎంపిక కాలేదు. అయితే తన కీపింగ్‌లోని లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ వచ్చిన శ్రీజేష్ కెరీర్‌ను 2011 మలుపు తిప్పింది. చైనాలోని ఓర్డోస్ నగరంలో పాకిస్థాన్‌తో జరిగిన 2011 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు శ్రీజేష్. అప్పటి నుంచి భారత హాకీ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
ది ఇండియన్ హాకీ హీరో..:
2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ శ్రీజేష్ ఆడాడు. ఒక 2013లో మలేషియాలో జరిగిన ఆసియాకప్‌లో భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో శ్రీజేష్ ‘బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్ ‘అవార్డు అందుకున్నాడు. 2014 హాకీ ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమే చేశాడు. నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్‌తో సహా పలు కీలక సేవ్‌లతో శ్రీజేష్ తన అసలైన స్కిల్‌ను చూపెట్టాడు. శ్రీజేష్ అద్భుతమైన ఆట కారణంగా 16 ఏండ్ల తర్వాత ఆసియా కప్‌లో భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో శ్రీజేష్ అద్భుత ప్రదర్శనకు అతనికి ‘హీరో ఆఫ్ ఆసియన్ గేమ్స్’ బిరుదును సంపాదించి పెట్టింది. ఇది భారత హాకీలో అతని స్థాయిని పెంచింది.
2014లో శ్రీజేష్ ఉత్తమ గోల్ కీపర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో వైస్ కెప్టెన్‌గా భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 2018 ఛాంపియన్స్ ట్రోఫీలో అదిరే ప్రదర్శనకుగానూ మరోసారి బెస్ట్ గోల్ కీపర్ అవార్డు అందుకున్నాడు. 2018లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన జట్టులో శ్రీజేష్ కూడా సభ్యుడు. ఆ తర్వాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం గెలుచుకోవడంలో శ్రీజేష్‌దే కీ రోల్. ఇక ఈ సారి పారిస్ ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌లో శ్రీజేష్ ఆట మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణమైంది. తన కెరీర్‌లో ఇదే చివరి టోర్నీ అని చెప్పిన శ్రీజేష్ పతకంతో ఆటను ముగింాలని పట్టుదలగా ఉండగా.. రెండు దశాబ్దాలుగా జట్టుకు వెన్నెముకగా ఉన్న అతనికి విజయంతో వీడ్కోలు పలకాలని ఆటగాళ్లూ కసిగా, కలిసి కట్టుగా ముందుకు సాగారు. ఇండియా హాకీ జట్టు ‘కలల రక్షకుడి’గా పేరొందిన శ్రీజేష్ తన అనుభవాన్ని రంగరించి ఈ మెగా ఈవెంట్‌లో అనేక క్లిష్ట సందర్భాల్లో జట్టును రక్షించాడు.
ఇండియా నుంచి నాలుగు ఒలింపిక్స్ ఆడిన ఏకైక గోల్ కీపర్ అయిన శ్రీ ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థులకు అడ్డుగోడగా నిలిచాడు. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్‌లో మెరుపువేగంతో కదులుతూ ఆ జట్టు గోల్ కొట్టకుండా అడ్డుకున్న అతను.. తాజాగా స్పెయిన్‌తో పోరులో చివరి నిమిషంలోనూ మార్క్ మిరాలెస్ గ్రాగ్‌ఫ్లిక్‌ను తన కుడికాలుతో అడ్డుకొని ఇండియా కాంస్య పతకం నిలబెట్టుకునేలా చేశాడు. బెల్జియంతో క్వార్టర్ ఫైనల్లో అయితే తను ఒంటి చేత్తో జట్టును గెలిపించాడని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు 18 ఏండ్ల టీనేజర్‌గా 2006 ఇండియా టీమ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఈ కేరళ యోధుడు చేస్తున్న పని అదే. ఎన్నో మ్యాచ్‌ల్లో తన ప్రతిభతో జట్టును గెలిపించాడు.
ఇండియా అందుకున్న ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో తనూ భాగం అయ్యాడు. 18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో దేశానికి 336 మ్యాచ్‌లు ఆడిన శ్రీజేష్ రెండేసి ఒలింపిక్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ మెడల్స్, నాలుగుసార్లు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీ, ఒకసారి ఆసియా కప్ కూడా అందుకున్నాడు. 2021, 2022లో వరుసగా రెండుసార్లు ఎఫ్‌ఐహెచ్ బెస్ట్ గోల్ కీపర్ అవార్డులు గెలవడం అతని ప్రతిభకు నిదర్శనం. శ్రీజేష్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్ కీపర్ అనడంలో సందేహం లేదు. ఈ తరంలో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ, ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రికి ఏమాత్రం తీసిపోని స్థాయి అతనిది. హాకీ ఇష్టపడే చిన్నారులు తాము పిఆర్‌శ్రీజేష్ లాంటి గోల్ కీపర్ అవుతామని చెప్పేలా చేసిన సూపర్ హీరో ఇతను. ఇంతకంటే గొప్ప కెరీర్ ఎవరికి ఉంటుంది.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417