మార్క్సిస్టు మహానేత.. కామ్రేడ్‌ జ్యోతిబసు

The great Marxist leader.. Comrade Jyoti Basuప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు ప్రధాని కాగల అవకాశం లభించినా, పార్టీ ఆదేశానికి కంకణ బద్దుడై, పీఎం అయ్యే అవకాశాన్ని వదులుకున్న సుశిక్షిత సైనికుడు, మార్క్సిస్టు మహానేత, ఇరవై మూడేండ్లకు పైగా ముఖ్యమంత్రిగా సేవలందించి The Longest Chief Minister of West Bengalగా పేరుగాంచిన కామ్రేడ్‌ జ్యోతిబసు పదిహేనవ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది.
జ్యోతిబసు 1914 జులై 8న కలకత్తాలోని బెంగాళీ కుటుంబమైన నిశికాంత్‌ బసు, హేమలతదేవి దంపతులకు జన్మించారు. తండ్రి ప్రముఖ వైద్యుడు. తల్లి గృహిణి. వీరి పూర్వికులు బంగ్లాదేశ్‌ ఢాకాలోని బర్దికి చెందినవారు. జ్యోతిబసు ప్రాథమిక విద్యాభ్యాసం కలకత్తాలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లోనూ, కాలేజీ విద్యాభ్యాసం ప్రెడిడెన్సీలోనూ కొనసాగింది. అక్కడే పట్టభద్రుడయ్యారు. 1935లో ఇంగ్లాండ్‌ వెళ్లి యూనివర్సిటీ ఆఫ్‌ కాలేజ్‌ లండన్‌లో న్యాయశాస్త్రం చదివాడు. 1940లో మిడిల్‌టెంపుల్‌లో బారిస్టరయ్యాడు. లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన మీద రాజకీయ సిద్ధాంతకర్త, లెక్చరర్‌ అయిన హెరాల్డ్‌ లస్కి ప్రభావం తీవ్రంగా పడింది. దాంతో ఆయనలో కమ్యూనిజం భావాలకు ఆలోచనల్లో బీజాలు పడ్డాయి. దీంతో లండన్‌ నుండి 1940లో ఇండియాకు తిరిగిరాగానే భారత కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తగా చేరారు. బ్రిటీష్‌ వలసరాజ్యాల శకం ముగిసే సమయానికి రైల్వే కార్మికుల ఉద్యమంలో బసుది కీలకపాత్ర. తేబాగ పోరాటంలోనూ పాల్గొన్నారు. అయితే 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ చీలి సీపీఐ(ఎం)గా ఆవిర్భవించింది. ఆ పార్టీ వ్యవస్థాపకు(నవరత్నాలు)ల్లో కామ్రేడ్‌ జ్యోతిబసు కూడా ఒకరు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా 1964 నుండి 2008 వరకు ఉక్కు క్రమశిక్షణతో నిలబడ్డారు. ప్రజల మన్ననలు పొందిన సీపీఐ(ఎం) అభ్యర్థిగా పశ్చిమబెంగాల్‌ శాసనసభకు ఎన్నికవ్వడమే గాక 1967, 1969 సంవత్సరాల్లో అజరు ముఖోపాధ్యాయ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. ఆ తర్వాత 1977 జూన్‌ 21 నుండి 2000 నవంబర్‌ 6 వరకు 23 సంవత్సరాలకు పైగా పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా దేశంలో చరిత్ర సృష్టించారు.
ముఖ్యమంత్రిగా జ్యోతిబసు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అందులో, పేద రైతులకు భూముల పంపకం, పల్లె ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, గ్రామగ్రామాన నిరక్షరాస్య నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేశారు. ముఖ్య ంగా రాష్ట్రంలో మత సామరస్యాన్ని సాధించారు. సిద్ధాంత రీత్యా జ్యోతిబసు నాస్తికుడైనప్పటికీ ఆస్తికులను కూడా గౌరవించేవారు. సేవామూర్తి మదర్‌ థెరిసా అంటే ఆయనకు ఎనలేని గౌరవం. ఓ సారి ”మీరు కమ్యూనిస్టు -దేవుణ్ణి నమ్మరు. మరి మదర్‌ థెరిసా ఒక కాథెలిక్‌, ఆమెకు దేవుడంటే అచంచెలమైన విశ్వాసం. అటువంటప్పుడు మీరిద్దరూ పరస్పర గౌరవాన్ని ఎలా సాధించగలిగారు?” అని మదర్‌థెరిసా గ్రంథకర్త నవీన్‌ బి.చావ్ల జ్యోతిబసును ప్రశ్నించారట. దీంతో ఆయన చిరునవ్వుతో ‘అవును- మా ఇద్దరివి విభిన్న ధృవాలే. అయితేనేమి? నేను పేదలను ప్రేమించి, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తాను. ఆమె కూడా పేదలను ప్రేమిస్తూ వారికోసం నిరంతరం శ్రమిస్తుంది.మా ఇద్దరిలోనున్న ఈ సారూప్యత వల్లనే మాకు పరస్పర గౌరవం ఏర్పడింది” అంటూ చెప్పారట. ఇది నిజంగా ఎంతో ఆదర్శమైన సాన్నిహిత్యం. అంతేకాదు, ఒకానొక సందర్భంలో మదర్‌థెరిసాకు ముఖ్యమంత్రి జ్యోతిబసును అత్యవసరంగా కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆ సమయంలో ఆయన కేబినేట్‌ మీటింగ్‌లో ఉన్నారు. మదర్‌ ఆయన కోసం వేచి చూస్తున్నదని తెలియగానే జ్యోతిబసు మీటింగ్‌ నుండి బయటకొచ్చి ఆమెను కలిశారు. ఇది, కమ్యూనిస్టు ప్రభుత్వాలకు, ‘కార్పొరేట్‌’ సర్కార్లకు మధ్య ఉన్న తేడా.
సుమారు ఏడు దశాబ్దాలు పేదల అభ్యున్నతికై రాజకీయ రంగస్థలం మీద నిరంతరం శ్రమించిన జ్యోతిబసు తన 96 ఏండ్ల వయ సులో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన్ను కలకత్తా సాల్ట్‌-లేక్‌ ప్రాంతం ఏఎంఆర్‌ఐ హాస్పిటల్‌లో చేర్పించగా వైద్యులు పరిశీలించి న్యుమోనియాగా నిర్ధారించారు. పదిహేడు రోజులు మృత్యువుతో పోరాడినన ఆయన 2010 జనవరి 17న తుదిశ్వాస విడిచారు. అంతకు ముందే తన కండ్లను, శరీరాన్ని కలకత్తాలోని ప్రభుత్వ వైద్యశాల ఎస్‌ఎస్‌కెఎంకు పరిశోధన నిమిత్తం దానం చేశారు. జ్యోతిబసు అంతిమయాత్ర మిలిటరీ, రాష్ట్ఱ ప్రభుత్వ, అధికార లాంచనాలతో గౌరవంగా నిర్వహించారు. కలకత్తా సాయుధ పోలీస్‌ దళం 21గన్‌ సెల్యూట్‌తో గౌరవ వందనం చేసింది. అంతేకాదు, ఆయన అంతిమయాత్ర వేలాది మంది అశ్రునయనాల మధ్య సాగింది. పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించడం జ్యోతిబసుపై గౌరవభావాన్ని రెట్టింపు చేశాయి. జ్యోతిబసు మరణంతో సీపీఐ(ఎం) ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. అంతేకాదు, దేశం కూడా ఒక గొప్ప దార్శనిక నేతను కోల్పోయింది. ఆ సమయంలో భారత ప్రజలతో పాటు యావత్‌ ప్రపంచ శ్రామికవర్గం బరువెక్కిన గుండెతో జ్యోతిబసుకు జోహార్లు అర్పించింది. పేద ప్రజలకోసం జ్యోతిబసు చేసిన కృషిని కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు కామ్రేడ్‌ జ్యోతిబసు వర్థంతి)
– బసవరాజు నరేందర్‌రావు, 99085 16549