తెలంగాణ పండుగలు అనంగానే మనకు గుర్తొచ్చేవి బతుకమ్మ, బోనాలు. పూలను పూజించే సంప్రదాయం తెలంగాణ ప్రజలది. ఊర్లల్లో దేవతలను నిలుపుకోవడం కూడా ఇక్కడి ప్రజల నమ్మకం. ఇళ్ళల్లో కూడా ఉప్పలమ్మలను పెట్టుకునే ఆచారం కొన్ని కుటుంబాల్లో ఉంది. బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పండుగ. ఒక్కోరోజును ఒక్కో పేరుతో పిలుస్తాం. అవి వరుసగా ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఆడపిల్లలకు మహా ఇష్టమైన పండుగ. ఆటపాటలతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్ళతో హాయిగా వాళ్ళు గడిపే పండుగ ఇదొక్కటే. అలాంటి బతుకమ్మ పండుగ నేపథ్యంలో వచ్చిన కవితలలో కొన్నింటిని పరిశీలిద్దాం.
బతుకమ్మ పండుగ కవిత్వంలోకి వెళ్ళేముందు డా.ఎన్.గోపి తొలివచన కవిత ‘తంగేడు పూలు’ను గుర్తు చేసుకోవాలి. ‘తంగేడు పూలంటే ఒప్పుకోను.. అవి బంగారు పూలు’ అన్నారంటే తెలంగాణ ప్రజల జీవితంతో తంగేడు ఎంత మమేకమయి పోయిందో అర్థం చేసుకోవచ్చు. బతుకమ్మను పేర్చటానికి ముఖ్యంగా ఉపయోగించేది తంగేడు పువ్వునే. ఆ పూలతో కూడిన బతుకమ్మ సోయగమే వేరు.
అన్నవరం దేవేందర్ తంగేడు పూలలోని స్వచ్ఛతను తెలియజేస్తూ రాసిన కవిత ‘తంగేడు పూలు’.
పండుగ ఎలా జరుపుకుంటారు, కుటుంబ సభ్యులంతా ఎక్కడ కలుసుకుంటారు, పల్లెటూరు మనుషుల మనసు ఎలా ఉంటది అని తెలియజేస్తూ తంగేడు పూలను ప్రతీకగా చేసుకొని ఈ వాక్యాలను అల్లాడు. ఇక్కడి పూలకు పట్నం వాసన తగలదు అని చెప్పటంలో ఆంతర్యమేమిటంటే పల్లెటూరు అన్ని విషయాల్లో మెరుగైనదని. మనుషుల దగ్గర నుంచి, బంధాల దగ్గర్నుంచి, స్నేహం దగ్గరనుంచి అన్ని విషయాల్లో ఏ స్వార్థం ఇక్కడ కనబడదని చెప్పటం.
”తంగేడుపూలంటే పేదలపూలు
తంగేడుపూలంటే పచ్చి పల్లెటూళ్ళపూలు
పట్నం వాసన పొసగని పూలు
ఊరి సొగసుల సోయగాలుల పూలు
తంగేడు చెట్లు ఊరికి తండ్రి లాంటివి”
మరో కవి బండారి రాజ్ కుమార్ బతుకమ్మ పండుగ నేపథ్యంలో రాసిన కవిత ‘బతుకమ్మ’. ఈ కవితలో పూల అందంతో పాటు, బతుకమ్మను పేర్చటం దగ్గర నుంచి ప్రసాదాలు పంచటం, బతుకమ్మను సాగనంపే వరకు ఒక్కొక్క అంశాన్ని ఒడుపుగా రాసి అర్థం చేయించాడు. బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన తాంబాలం, పేర్చడానికి ఉపయోగించే పూలు వాటి పేర్లు ఈ కవితలో చదివితే పాతకాలపు రోజులు గుర్తుకు వస్తాయి. ఇప్పటి బతుకమ్మల్లో కత్రిమత ఎక్కువ కనబడుతుంది. కారణం అప్పటి పూలు ఇప్పుడు దొరకకపోవటమే.
”కట్లపూల సోయగం
గుమ్మడిపూల రాజసం
తలపై వజ్రం మెరిసింది
బతుకమ్మ గోపురం వెలిగింది”
గోపగాని రవిందర్ ఇంకో కోణంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అస్తిత్వాన్ని చాటిచెప్పిన బతుకమ్మను కవిత్వంలోకి తీసుకువచ్చాడు. ఇక్కడి సంస్కతి, వలసవాదుల సంస్కతికి ఎలా భిన్నమైనదో చెప్పే ప్రయత్నమంతా ఈ కవితలో కనబడుతుంది. పండుగకు పుట్టినిల్లు చేరే ఆడబిడ్డలకు ఈ పండుగ ఎంత ప్రత్యేకమైనదో తెలియజేస్తున్నాడు.
”ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమ ప్రతీక
పీడనను ఎదురించిన చైతన్య జ్వాల
ఆడపడుచుల ఆనందాల హరివిల్లు
తంగేడు పూలతో పేర్చిన బతుకమ్మ”
మరో కవి పసునూరి రవీందర్ తెలంగాణ ప్రజల వీరత్వాన్ని, ప్రకతి ఆరాధన తత్వాన్ని కవిత్వంలోకి పట్టుకొచ్చి రాసిన కవిత ‘పేగు బంధం’. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. చరిత్రలో, ప్రపంచ దేశాలలో ఎక్కడ పరిశీలించి చూసినా ఇంత గొప్ప త్యాగం ఈ నేల మీదనే సాధ్యపడింది. మాట కోసం నిలబడే మనుషులున్న నేల అని చెప్పిన కవి మాటలు తెలంగాణ ఉద్యమాన్ని చిత్రిక పట్టాయి.
”పూలను మొక్కి పూలను పూజించే నేల
ఆడినమాటలకు అసువులు బాసే నేల”
మరొక కవి ఆనందాచారిహొ ‘సమరాంగనవై బతుకమ్మా’ అనే కవితలో బతుకమ్మను ఆడబిడ్డకు ప్రతీకగా చేసి నేటి సమాజంలో తాను ఎలా ముందుకు వెళ్ళాలో చెబుతున్నారు. జరుగుతున్న అత్యాచారాలను రూపుమాపడానికి తననే యుద్ధరంగంలోకి దూకమంటున్నారు. అబలగా కాకుండా సబలగా ఉంటూ ఈ బతుకును బతకాలని హితవు పలుకుతున్నారు. తంగేడు పూలలాంటి సౌందర్యమే కాదు కలిసికట్టుగా ఉన్న ఆ పూలలా మనసును ధడ పరుచుకోమంటున్నాడు. బతుకమ్మ పాటలు పాడుతున్న గొంతులన్ని ఒక్కటి కావాలని, బతుకమ్మ ఆడే చేతులన్ని పిడికిళ్ళుగా మారాలని కాంక్షిస్తున్నారు. తమ కవితావాక్యాలతో పండుగ సారాన్ని చెబుతూనే కర్తవ్యాన్ని కూడా బోధిస్తున్నారు.
”తంగెడు పూలు పేర్చే రీతిగ
మనసున బలాన్ని పేర్చాలి
పాటలు పాడే గొంతే ప్రశ్నయి
ఆటల చేతులే పిడికిళ్లయి
సమరాంగనవై బతకాలీ
బతకాలీ – బతకమ్మా!”
బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలు జరుపుకునే ప్రత్యేక పండుగ. ఈ పండుగ విశిష్టతను తెలిపుతూ ఆవిష్కరించబడిన కవితల సంకలనం ‘తంగేడువనం’. ఇది తెలంగాణ భాష సాంస్కతిక శాఖ నుండి మామిడి హరికష్ణ గారి సారథ్యంలో వెలువడింది. ఇందులో 166 మంది కవులు బతుకమ్మ విశిష్టతను తెలుపుతూ కవిత్వం రాశారు. ఈ కాలమ్‌లో నా దష్టికి వచ్చిన కవితలను మాత్రమే కోట్ చేశాను. చాలా మంది కవులు బతుకమ్మ మీద కవితలు రాశారు. ఇలా బతుకమ్మ పండుగకు సంబంధించిన కవితల సారాన్ని గుర్తుచేసుకోవటం నేటి కాలానికి అవసరం. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. సంస్కతిని మరిచిపోవటమంటే ఒకరకంగా తల్లిని మరిచిపోవటమే. డిజేల ప్రభావంతో పాడటం కన్నా ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏది ఏమైనా బతుకమ్మ కలకాలం వర్థిల్లాలి. రాబోయే తరాలకు కూడా ఈ పండుగను చేరవేయాలి. కుటుంబ బాంధవ్యాలు ఇలాగే కొనసాగాలంటే పండుగలు అవసరం. పండుగలు కనుమరుగయి పోతే మనుషులుగా మనం మిగలమన్న విషయం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి.
– డా|| తండ హరీష్ గౌడ్
8978439551