కాపలాదారే చోర్‌ సూత్రధారి

– చోరీ కేసును ఛేదించిన పోలీసులు
– ఇండో నేపాల్‌ బార్డర్‌లో నిఘా
– 10మంది నిందితుల అరెస్ట్‌
– డైమండ్స్‌, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్‌లోని సింది కాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటికి కాపలాదారుగా చేసిన వ్యక్తే దొంగతనంలో కీలక వ్యక్తిగా తేల్చారు. పక్కా ప్లాన్‌తో నేపాలీ గ్యాంగ్‌ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. 13 మంది నిందితుల్లో 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.41,60,410, 2.8కిలోల బంగారు, డైమండ్‌ ఆభరణాలు, 9.56 కిలోల వెండితోపాటు 18 ఖరీదైన వాచ్‌లు, సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనం, కారును స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీఎస్‌ఐసీసీసీ పోలీస్‌ కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో డీసీపీలు చందనాదీప్తీ, రాధాకిషన్‌రావుతో కలిసి సీపీ సీవీ ఆనంద్‌ వివరాలు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన శంకర్‌ మాన్‌సింగ్‌ సౌద్‌ అలియాస్‌ కమల్‌ తన భార్య పార్వతితో కలిసి రాణిగంజికి చెందిన వ్యాపారి రాహుల్‌ గోయేల్‌ ఇంట్లో ఐదేండ్లుగా వాచ్‌మెన్‌గా పనిచేశారు. ఎంతో నమ్మకంగా మెలిగారు. అదేవిధంగా, అదే దేశానికి చెందిన లాల్‌ సింగ్‌ తప్పా బేగంపేట్‌లో వాచ్‌మెన్‌గా, మోహన్‌ సౌద్‌ కేపీహెచ్‌బీలోని డీ-మార్టులో పనిచేస్తున్నారు. మిగిలిన వారు పూణే, బెంగళూర్‌, ముంబరు తదితర ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వీరంతా నేపాల్‌లోని కైలాలీ జిల్లా, తిక్కపూర్‌ గ్రామానికి చెందినవారు. అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. రాహుల్‌ గోయేల్‌ ఇంట్లో కాపలాదారునిగా పని చేసిన కమల్‌ చోరీకి పథకం వేశాడు. ఈ నెల 9న యజమాని రాహుల్‌ కుటుంబ సమేతంగా వేరే ప్రాంతానికి వెళ్తున్నాడని, రెండు మూడ్రోజులపాటు రావడం లేదని తెలుసుకున్నాడు. ఈ మేరకు కమల్‌ పూణే, బెంగళూర్‌, ముంబైలోని వారి వారిని అలర్ట్‌ చేశాడు. ఈ నెల 9న 11మంది నిందితులు సికింద్రాబాద్‌కు వచ్చారు. అదే రోజు రాత్రి వ్యాపారి ఇంట్లో చొరబడి అల్మారా, లాకర్‌ తాళాలు తొలిగించి డైమండ్‌, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు రూ.45లక్షలు ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.5.5 కోట్ల వస్తువులను చోరీ చేశారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులకు చిక్కకుండా మూడు గ్రూపులుగా..
నిందితులు పోలీసులకు చిక్కకుండా మూడు గ్రూపులుగా విడిపోయి వేర్వేరు మార్గాల్లో నేపాల్‌కు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ గ్రూపు బెంగళూర్‌కు, మరో గ్రూపు లక్నో, మరికొందరు ముంబరుకి బస్సుల్లో వెళ్లారు. చోరీ కేసు సంచలనం రేపడంతో సివిల్‌, టాస్క్‌ఫోర్సు పోలీసులు బృందాలుగా ఏర్పడి విమానాలు, రైలు మార్గాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ముందుగా ‘ఇండో నేపాల్‌’ బార్డర్‌ వద్దకు ఓ బృందాన్ని పంపించి అక్కడి వారిని అలర్ట్‌ చేశారు. పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. పోలీసులు వెంటాడుతున్నారని గ్రహించిన నిందితులు వివిధ మార్గాల్లో నేపాల్‌కు పారిపోయేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశారు. సీసీ పుటేజీలు, టవర్‌ లోకేషన్‌, ఇతర టెక్నికల్‌ ఆధారాలతో చివరకు ఇండో నేపాల్‌ బార్డర్‌లో ఓ గ్రూపు పోలీసులకు చిక్కింది. 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఇండియా, నేపాల్‌కు మంచి సంబంధాలున్నాయని, కొందరు నేపాల్‌కు చెందిన వారు నేరాలకు పాల్పడటంతో సంబంధాలకు ముప్పురావడంతోపాటు, నేపాలియన్స్‌పై అనుమానాలు మొదలవుతాయని సీపీ అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ సయ్యద్‌ రఫీక్యూ, ఏసీపీ బీ.రమేష్‌, ఇన్‌స్పెక్టర్లు లింగేశ్వర్‌రావు, టి.శ్రీనాథ్‌రెడ్డి, కె.శ్రీకాంత్‌, ఎం.అంజయ్య, ఎస్‌ఐ బి.అశోక్‌ రెడ్డి, ఘనదీప్‌, అవినాష్‌ బాబు, కె.లక్ష్యినారాయణ తదితరులు ఉన్నారు.