– నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా విక్రయాలు
– పచ్చని సంసారాల్లో గుడుంబా చిచ్చు
– ఇమ్మడిగూడెంలో యూత్ ఆధ్వర్యంలో గుడుంబా ధ్వంసం
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా సమ్మక్క- సారక్క తాడ్వాయి మండలంలో నల్లబెల్లం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సారాకు బానిసై జనం అటు జేబులను, ఇటు ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. అధికారుల అమ్యామ్యాలతో సారా తయారీ మళ్లీ ఊపందుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సారాను సంపూర్ణంగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించింది. కొన్ని ప్రాంతాల్లో నల్లబెల్లం దొరక్కపోవడంతో చక్కెర వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మొలాసిస్తో నాటు సారా కాస్తున్నారు. కల్తీ సారాతో కొందరు ఆస్పత్రుల పాలవుతుంటే ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు గుడంబ తయారీదారుల పై దాడులు జరుపుతున్న గ్రామాలలో గుడుంబా(కాయడం)తీయడం ఆపడం లేదు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా గుడుంబా స్థావరాలపై నిఘా కొరవడటంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పొలాలు, చేన్లు, ఇండ్ల మధ్యనే కాపు సారాయిని కాస్తున్నారు. గుడుంబా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు చేపట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ అధికారులు జారీ చేసిన హెచ్చరికలను గుడుంబా తయారీదారులు, అమ్మకందారులు పెడచెవిన పెడుతున్నారు. దానికి తోడు అత్యాశతో గుడుంబా తయారీలో స్పిరిట్, ద్రావణం, జీడిగింజల మిశ్రమం, యూరియా, నల్లచెక్క లాంటి ప్రమాదకర ఘాటు పదార్థాలను కలపడంతో ప్రజల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ప్రాణప్రాయ స్థితిలోకి నెట్టి వేస్తున్నారు. గుడుంబా తో ప్రజల ప్రాణాలు గాల్లో కలిస పోతున్నాయి. చిన్న వయస్సులోనే నాటుసారాకు బానిసై అనేక మంది మృత్యువాత పడగా, చాలా మంది మహిళలు వితంతువులుగా మారిన తీరు కలిచివేస్తోంది. మస్తు డిమాండ్‌తో ప్రస్తుతం గుడుంబా వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలు అన్న చందంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం మూలంగా గుడుంబా ఏరులై పారుతుంది. గుడుంబా నిర్మూలల్లో భాగంగా గంగారం యూత్ ముందుకు వచ్చింది. అందులో భాగంగా మంగళవారం గంగారం గ్రామపంచాయతీ యూత్ సభ్యులు ఇమ్మడిగూడెం లంబాడి తండాలో ఇల్లు ఇల్లు చెక్ చేసి, లీటర్లకు లీటర్ల గుడుంబా డ్రమ్ములకు డ్రమ్ములు పానకం పట్టుకొని విధ్వంసం చేశారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా గుడుంబా స్థావరాలు పై దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే, కేసులు పెట్టకుండానే వదిలేస్తున్నారని వారు మండిపడ్డారు. సంబంధిత శాఖ ఉన్నత అధికారులు ఇప్పటికైనా మండలంలో ఏరులైపాడుతున్న గుడుంబాను అరికట్టాలని కోరుకుంటున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల కంటే గుడుంబాకీ గిరాకీ బాగా పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుడుంబా ను త్వరగా అరికట్టల నీ మహిళలు కూడా కోరుకుంటున్నారు.