ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు మానుకోవాలి

– గుండెబోయిన రామకృష్ణ 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
మండలంలోని ప్రజలు ముఖ్యంగా యువత, చిన్నారులు ఆయా హోటళ్ళు, సెంటర్ లలో లభించే ఫాస్ట్ ఫుడ్ పదార్థాలు తినే అలవాటును మానుకోవాలని మండల కేంద్రానికి చెందిన సంఘసంస్కర్త గుండెబోయిన రామకృష్ణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో నవతెలంగాణ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. గతంలో నేనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే వాడినని, సమాజ హితం కోసం దానిని మానేశాని చెప్పారు. ఒకరికి మంచి మాటలు చెప్పే ముందు మనం ఆ చెడు అలవాటును ముందుగా మానుకోవాలనే గాంధీజీ మాటలను గుర్తు చేశారు. మనిషి మనుగడకు గాలి, నీరుతో పాటు కలుషితం కాని ఆహారం ప్రధానమైనదని, అది నేటి సమాజంలో కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ఉదాహరణగా ప్రస్తుత రోజుల్లో ప్రజలు వివిధ కారణాలు చెప్తు త్వరగా తయారయ్యే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పిజ్జాలు, బర్గలు, తదితర ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలవాటు పడి, ఏరికోరి రోగాల బారినపడి, ఆరోగ్య పరంగా, ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతున్న సంఘటనలు దేశంలో కోకొల్లలుగా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇటువంటి అనారోగ్యాలకు గురి చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ ను డబ్బులతో స్వయంగా కొని, తెచ్చుకుంటున్నామని, వీటిని మండల ప్రజలు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. మన ఏజెన్సీ ప్రాంతంలో అడవుల నుంచి, పంట పొలాల్లో వేసుకున్న చిరుధాన్యాలు, పప్పు దినుసులు, మన ఇండ్లలో పెంచుకునే పండ్ల చెట్ల నుంచి లభించే స్వచ్చమైన ఆరోగ్యాన్ని ఇచ్చే సీజనల్ ఫలహారం తీసుకుని, అందరూ ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నిద్దామని విజ్ఞప్తి చేశారు.