– భారీ వర్షంతో పంటలకు తీవ్ర నష్టం
– నేలవాలిన వరి పైరు.. రాలిన ధ్యానం
– మామిడికి తీవ్ర నష్టం
– పంట చేతికొస్తున్న వేళ రైతన్న ఆక్రందన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అకాల వర్షం రైతన్నలను అతలాకుతలం చేసింది. వడగండ్లు కురిసి వరికి కడగండ్లు మిగిల్చింది. తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి వేళ కురిసిన భారీ వడగండ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఈదురుగాలుల ధాటికి వరి పైరు నేలకొరగగా, వడ్లు రాలిపోయాయి. పంట చేతికి వస్తున్న దశలో కురిసిన అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందని రైతులు వాపోతున్నారు. కాగా నష్టం వాటిల్లిన పంటలను పలువురు నేతలు,నాయకులు,ప్రజా ప్రతినిధుల పరిశీలించారు. అకాల వర్షం ఈదురు గాలుల వల్ల మామిడికాయలన్నీ నేలరాలడంతో రైతులు ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచక ఆందోళన చెందారు. కస్బే కట్కుర్, మండేపల్లి, వేణుగోపాల్ పూర్, రాల్లపేట, గండిలచ్చ పేట గ్రామాల్లో నష్టం వాటిలిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్ తో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించారు. అకాల వర్షానికి తంగళ్ళపల్లి మండలంలో దాదాపు 280 ఎకరాల వరి పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.