మాస్కో మారణకాండలో పశ్చిమ దేశాల హస్తం!

The hand of the West in the Moscow massacre!గత శుక్రవారం నాడు మాస్కో శివార్లలోని ఒక సంగీత కచేరీ హాలులో జరిపిన మారణకాండలో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 143కు చేరింది. మరో 360 మంది గాయపడినట్లు, 143 మంది జాడ తెలియటం లేదని ఫిర్యాదులు వచ్చినట్లు మాస్కో టైమ్స్‌ పత్రిక రాసింది. అమాయకులను బలిగొన్న ఈ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచమూ ఖండించింది. దీనికి పాల్పడింది నిర్దిష్టంగా ఎవరన్నది వారం కావస్తున్నా వెల్లడికాలేదు. వర్తమాన అంతర్జాతీయ రాజకీయాల పూర్వరంగంలో లోకజ్ఞానం ప్రకారం ఆలోచించినా, రష్యా అధికారులు చెబుతున్న దాని ప్రకారమూ కూడా పశ్చిమ దేశాల కుట్రలో భాగంగానే ఇది జరిగినట్లు కనిపిస్తోంది. రష్యా నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని అమెరికా కోయిల ముందుగానే కూసింది. ఆప్ఘనిస్తాన్‌ ఐసిస్‌-కె సంస్థ పేరుతో వెలువడినట్లు చెబుతున్న ప్రకటనను చూపి దాడి జరిపింది ఐఎస్‌ తీవ్రవాదులేనని పశ్చిమదేశాల వార్తా సంస్థలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. ఒకవేళ అదే నిజమనుకుంటే ఈ సంస్థ ఏర్పాటు వెనుక అమెరికా ఉందన్నది బహిరంగ రహస్యం. ఐఎస్‌ తీవ్రవాదులు దాడి చేయాల్సిన పరిస్థితులేమీ లేవని రష్యన్‌ అధికారులు దాన్ని కొట్టిపారవేశారు. సిరియాలో ఐఎస్‌ తీవ్రవాదులను రష్యా అణచివేస్తున్నదని, గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా అణచివేతకు ప్రతీకారంగా ఇది జరిగిందంటూ కథనాలను ప్రచారం చేశారు.
నాటో దేశాల తొత్తుగా మారిన ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి నుంచి రష్యా జరుపుతున్న సైనిక చర్య 763వ రోజుకు చేరింది. పశ్చిమ దేశాలు ఎన్ని విధాలుగా సాయం చేసినప్పటికీ ఉక్రెయిన్‌ చావుదెబ్బలు తింటున్నది.రష్యాను వెనక్కు కొట్టే స్థితి కనిపించటం లేదు. దీన్నుంచి దృష్టి మళ్లించేందుకు, పుతిన్‌ సర్కార్‌పై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు చేయని ప్రయత్నాలు లేవు. అనేక దేశాలలో కిరాయిమూకలను రంగంలోకి దించినట్లుగానే ఉక్రెయిన్‌లో కూడా పశ్చిమ దేశాల ఆర్థిక సాయంతో కిరాయి మూకలను రంగంలోకి దించారు. వారిలో కొందరినీ దీనికి వినియోగించి ఉండవచ్చు. గణనీయ సంఖ్యలో మధ్య ప్రాచ్యం, ఇస్లామిక్‌ దేశాల నంచి ఇలాంటి వారికి శిక్షణ ఇచ్చి తమ మీద దాడులకు వినియోగి స్తున్నట్లు రష్యా చెబుతోంది. మాస్కో ఉగ్రవాద మారణకాండ తరువాత అనేకమందిని టర్కీలో అనుమానంతో అదుపులో తీసుకున్నారు. నాటో కూటమి దేశమే అయినప్పటికీ రష్యాతో టర్కీ సత్సంబంధాలను కలిగి ఉంది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తొలి రోజుల్లో చొరవ చూపింది కూడా ఈ దేశమే.
సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా, పశ్చిమదేశాలు ఐఎస్‌ తీవ్రవాదులను సమీకరించి అన్ని రకాల సాయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సిరియాకు మద్దతుగా రష్యా ఉంది. ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, దీర్ఘకాలంగా జరుగుతున్న అక్కడి పరిణామాలకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారన్న కథ అతకటం లేదు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్‌ సంస్థ పేరుతో జరుపుతున్నది కూడా కట్టుకథే. ఐఎస్‌ తీవ్రవాదుల పేరుతో మరిన్ని దాడులు జరిపేందుకు వేసిన ఎత్తుగడ కూడా కావచ్చు. సంగీత కచేరీ హాలులో గుమికూడింది క్రైస్తవులని, వారి మీద ఇస్లామిక్‌ తీవ్రవాదులు దాడి చేశారంటూ అల్లిన కథ కూడా మత కోణంవైపు మళ్లించేందుకు ఉద్దేశించిందన్నది స్పష్టం. పూర్వపు సోవియట్‌లోని మధ్య ఆసియా రిపబ్లిక్‌లైన ఉజ్బెకిస్తాన్‌, కిర్ఘిజిస్తాన్‌, తజకిస్తాన్‌ల నుంచి వచ్చిన కోటి మంది వలస కార్మికులు రష్యాలో పని చేస్తున్నారు. మతకోణాన్ని జోడించి రెచ్చగొడితే ఈ కార్మికులపై స్థానికులు రెచ్చిపోతారన్న దుష్ట మంత్రాంగం కూడా ఉంది. అయితే ఇప్పటివరకు ఎక్కడా అలాంటి అవాంచనీయ పరిణామాలు చోటు చేసుకోకపోవటం గమనించాల్సిన అంశం. ఈ దేశాల వారు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా రష్యాలో ప్రవేశించవచ్చు. సోవియట్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన తరువాత రష్యాతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయనేందుకు ఇదొక నిదర్శనం. అలాంటి సామరస్యతను దెబ్బతీసేందుకు, రష్యా సరిహద్దుల్లో కుట్రలకు తెరలేపేందుకు కూడా కుట్ర చేసి ఉండవచ్చు. తమ దేశ భద్రతకు పశ్చిమదేశాలు ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకొని ముప్పుతెస్తున్నట్లు భావిస్తున్న రష్యన్లు ఈ కుట్రను అర్ధం చేసుకుంటారనే అనుకోవాలి.
దాడి వెనుక అమెరికా, బ్రిటన్‌, ఉక్రెయిన్‌ ఉన్నట్లు రష్యన్‌ భద్రతా విభాగ డైరెక్టర్‌ ప్రకటించాడు. దాడులు జరిపిన వారు ఎవరన్నది ఇప్పటికీ తేలనప్పటికీ, ఒక వేళ వారు ఇస్లామిక్‌ దేశాలకే చెందినప్పటికీ పశ్చిమదేశాల కుట్రలో భాగంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్నది నిస్సందేహం.