అస్మదీయుల చేతివాటం!

అస్మదీయుల చేతివాటం!ముచ్చటగా మూడవసారి మోడీ ప్రమాణ స్వీకారానికి ముందే, అసలు ఫలితాలు పూర్తిగా రాకముందే, ఇంకా చెప్పాలంటే ఎన్నికల ప్రక్రియ పూర్తికాకముందే రూపుదిద్దుకున్న అతి పెద్ద కుంభకోణం ఇది. దేశంలో షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే మధ్యతరగతి ‘నిర్భాగ్య’ జీవులు ఐదు కోట్ల మందే ఉండి ఉండచ్చు. వాళ్లు జూదం ఆడే ‘సెన్సెక్స్‌’ షేర్లు యాభై పేరు మోసిన కంపెనీలవే అయి ఉండచ్చు.
కాని జూన్‌ 4 డి-డే నాడు (ఇంగ్లీషులో డూమ్స్‌ డే అంటే ఉపద్రవం ముంచుకొచ్చిననాడు) 31 లక్షల కోట్ల రూపాయల మదుపుదార్ల సంపద ఆవిరై పోయింది. దాన్నే జూన్‌ 5న బ్లడ్‌ బాత్‌ (రక్తపు స్నానం) అని, మార్కెట్ల అల్లకల్లోలమని (మేహెమ్‌) పత్రికలు ప్రచురించాయి. దీనికి కారణాలు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రజావ్యతిరేక సంస్కరణలకు బ్రేక్‌ పడ్తుందనే భయం పట్టుకున్నప్పుడల్లా మార్కెట్లో అమ్మకాలు జరుగుతాయి. మార్కెట్లు కుప్పకూలు తాయి. దీన్నే మరోలా చెప్పుకోవాలంటే, పెట్టుబడికి చెలికాడుగా ఉన్న మోడీ సర్కార్‌ పడిపోతుందనే భయం మార్కెట్ల బ్లడ్‌ బాత్‌కి కారణం. ఏడాదికిపైగా రైతాంగం ఢిల్లీ చుట్టూ గేరి వేసి పోరాడినా నిర్దాక్షిణ్యంగా ఆ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన మోడీ (చివరికి రైతుల పట్టుదలముందు తలదించినా) సర్కారు పడిపోవడం అంటే పెట్టుబడిదార్లకు ఎంత నష్టం? ప్రతిపక్షాన్ని బయటికి నెట్టేసి నాలుగు కార్మిక కోడ్‌లు ఆమోదించిన ప్రభుత్వాన్ని పెట్టుబడి చేజార్చుకుంటుందా?
ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ దీని వెనకున్న కారణాలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేయడం సకారణంగానే. తమ ఆధ్వర్యంలో, స్థిరమైన ప్రభుత్వం మరింత పెద్ద మెజారిటీతో వస్తోంది కాబట్టి షేర్‌ మార్కెట్‌లో, కొంత రిస్క్‌ అయినా, పెట్టుబడిపెడితే బాగా లాభపడతారని సాక్షాత్తూ మోడీయే చెప్పారు. షేర్‌ మార్కెట్‌ పెరుగుదల గురించి ఒక అస్మదీయునితో ప్రశ్న వేయించుకున్న అమిత్‌షా తానేమీ జ్యోతిష్కుణ్ణి కాదని, స్థిరమైన ప్రభుత్వాలుంటే షేర్‌ మార్కెట్‌ ఉరుకులు పెడ్తుం దని, తమ పార్టీ మరింత పెద్ద మెజారిటీతో అధికారం లోకొస్తామని నర్మగర్భంగా పెట్టుబడులు పెట్టమనే చెప్పాడు. ఇవన్నీ ఓ రెండు వారాలముందు ఘటనలు.
ప్రతిపక్షాల ఆరోపణేమంటే ఎన్‌డీయేకు అంత భారీ మెజారిటీ వచ్చే అవకాశమే లేదని వేగుల నివేదికలు అప్పటికే వచ్చాయి. అయినా ఎన్నికల్లో ఓట్లడుక్కోకుండా షేర్‌ మార్కెట్లలో జూదానికి జనాన్ని పురికొల్పుడేంటని? అసలు ఇలాంటి ఘటనలు దేశంలో అంటే పాలకులే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలను ఈ షేర్ల జూదానికి ప్రోత్సహించిన ఘటనలు ఇప్పటిదాకా లేవు. పెట్టుబడిదారుల మరో ఇష్ట సఖుడు పియూష్‌ గోయల్‌ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంటే రాహుల్‌గాంధీ దాన్ని వెనక్కి లాగుతున్నాడని చెప్పడం విస్తుగొలిపే అంశం.
”తమకు 220 సీట్లు దాటవన్న అంశం తెలిసినా జరిగిన ప్రచారంతో స్టాక్‌ మార్కెట్లు ఎగిసిపడ్డాయి. చివరికి 31 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సొమ్ము ఆవిరైంది. మార్కెట్లు రక్తమోడాయి” అని రాహుల్‌గాంధీ అన్న మాటలను కొట్టేయలేము. షేర్‌ మార్కెట్లు పెరగడానికి దోహదపడ్డ ఎగ్జిట్‌పోల్స్‌, 4వ తేదీతో అద:పాతాళానికి దొర్లిపోవడం కీలకాంశం. దేశంలో స్టాక్‌ మార్కెట్లు పడ్డ సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. వామపక్షాలకు అరవై ఒక్క సీట్లు వచ్చి, లెఫ్ట్‌పై ఆధారపడ్డ యూపీఏ ప్రభుత్వం వస్తున్న సందర్భంలో సంస్కరణలు ఆగిపోతాయన్న భయానికి ఒకసారి ‘బ్లడ్‌ బాత్‌’ జరిగింది. 1996లో వాజ్‌పారు 13 రోజుల సర్కార్‌ పడిపోయిన తర్వాత కూడా మార్కెట్లు రక్తమోడాయి. గతంలో హర్షద్‌ మెహతా, కేరత్‌పరేఖ్‌ల షేర్‌ మార్కెట్‌ స్కాంలను చూశాం. వీళ్ళు షేర్‌ బ్రోకర్లు. అది కాంగ్రెస్‌ పాలనలో, మోడీ హయంలో పెట్టుబడికి కాళ్ళు రావడమేకాదు. కోరలూ మరింత పదును తేలాయి. చట్టాలన్నీ వారికి చుట్టాలైనాయి. అన్నింటినీ దేశ, విదేశీ పెట్టుబడిదార్లకే సమర్పిస్తున్నారు.
స్థూలంగా, కోట్లాది కష్టజీవులకు నష్టం కలిగించే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లే ‘మొనగాండ్ల’కు నష్టం జరిగితే షేర్‌ మార్కెట్లు కూలతాయి. దీన్ని బట్టే ”మోడీ 3.0”ను అంచనా కట్టాలి. జరిగిన నష్టంపై విచారణ జరగాల్సిందే! ఒకటవ తేదీ ఎగ్జిట్‌ పోల్స్‌కు 4వ తేదీ ఫలితాలొచ్చే నాటి ”బ్లడ్‌ బాత్‌”కు మధ్యనున్న లింకే కీలకం. దానిపైనే విచారణ జరపాలని డిమాండ్‌ చేయడం. అసలు కీలక విషయమేమంటే ప్రజలు తమకు ఎవరు బాగా మంచి చేస్తారనుకుంటారో ఆ పార్టీకే ఓట్లు వేస్తారు. మార్కెట్లు పడిపోవడం కోసం కాదన్న విషయం ఈ మార్కెట్‌ విశ్లేషకులుగా చెప్పుకునేవారు అర్థం చేసుకోవటం అవసరం.