‘ఓటుకు నోటు’ కేసు విచారణ జులై చివరికి వాయిదా

– ఇరు పక్షాల న్యాయవాదుల తీరుపై సుప్రీం అసహనం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జులైౖ చివరి వారానికి వాయిదా వేసింది. తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్‌ నేతలు జగదీష్‌ రెడ్డి, కల్వకుంట్ల సంజరు, సత్యవతి రాథోడ్‌, మహ్ముద్‌ అలీ సుప్రీంకోర్టులో ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సందీప్‌ మెహతలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ దవే, దామ శేషాధ్రినాయుడు, మోహిత్‌ రావు హాజరయ్యారు. ప్రతి వాదులైన తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి, ఇతరుల పక్షాన సీనియర్‌ న్యాయ వాదులు ముకుల్‌ రోహత్గి, సిద్దార్థ లూత్రా, మేనకా గురుస్వామి, తెలంగాణ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. వాస్తవానికి ఇదే రోజు(శుక్రవారం) రిజిస్ట్రార్‌ కోర్టులో ఈ పిటిషన్‌ పై విచారణ జరగాల్సి ఉండగా… పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా రెగ్యులర్‌ బెంచ్‌ ముందుకు మెన్షన్‌ చేసి తీసుకువచ్చారని తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహత్గి, మేనకా గురుస్వామి తొలుత వాదనలు వినిపించారు. మధ్యలో జోక్యం చేసుకున్న ధర్మాసనం, దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకు న్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. మరోసారి రోహత్గి వాదనలు కొనసాగిస్తూ రాజకీయ ప్రమేయం ఉన్న ఈ కేసును ఉద్దేశపూర్వకంగానే కోర్టు ముందుకు తెచ్చారని వాదించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేశారని ధర్మాసనానికి నివేదించారు. ఇందుకు న్యాయవాది సిద్ధార్థ దవే అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా రోహత్గి, దవే ఒకరినొకరు తమ వాదనలను అడ్డుకున్నారు. చివరిగా తాము పిటిషనర్‌ అని, తమకు వాదించే అవకాశం ఇవ్వాలని దవే వాదనలను కొనసాగించారు. ప్రతివాదులు సమయం కోరడం లేదని అన్నారు. కేసు విచారణ త్వరితగతిన జరగాలన్న ఉద్దేశంతోనే తాము ఉన్నామన్నారు. మరోవైపు సిద్దార్థ లూత్ర సైతం ఆన్‌లైన్‌లో వాదనలు కొనసాగించడంతో జస్టిస్‌ బీ.ఆర్‌ గవారు అసహనం వ్యక్తం చేశారు. ‘న్యాయవాదుల ప్రవర్తన ముగ్గురితో కూడిన మా ధర్మాసనానికి కొత్తగా ఉంది. మీ వాదనలను కంట్రోల్‌ చేయడం కష్టంగా ఉంది. హైకోర్టు చాలా ఉత్తమం. క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం మరోసారి న్యాయవాదులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని వాదనలు కొనసాగించడంతో జస్టిస్‌ గవాయి జోక్యం చేసుకొని… ‘నేను ముంబాయి, ఔరంగబాద్‌, నాగ్‌పూర్‌, పంజీ హైకోర్టులో పని చేశాను. కానీ ఎప్పుడూ ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని చూడలేదు’ అని అన్నారు. దీంతో న్యాయవాదులు ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు. అయితే ఇరుపక్షాల న్యాయవాదులను విన్న ధర్మాసనం, తదుపరి విచారణ జులైౖ చివరి వారంలో చేపడతామని స్పష్టం చేసింది.