– ఏప్రిల్ 30న తుది వాదనలు వింటామన్న ధర్మాసనం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కృష్ణా నదీ పరీవాహ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. 2021 ఏడాది మొదట్లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వం, అదే ఏడాది జులైలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. తెలంగాణ నిర్ణయం వల్ల ప్రాజక్టుల్లో నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నాయని తెలిపింది. ఈ పిటిషన్ పై గతంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి, కేఆర్‌ఎంబీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్‌కో సీఎండిలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ పిటిషన్ మంగళవారం మరోసారి జస్టిస్ అభరు ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉందని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ధర్మాసనానికి విన్నవించారు. అయితే, తొలుత సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా మరో కోర్టులో ఉన్నందున పాస్ ఓవర్ అడిగినప్పటికీ విచారణ వాయిదా వేసే ఉద్దేశం ఉంటే తాము వాదనలకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఉమాపతి కోరారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం… ఏప్రిల్ 30న తుది వాదనలు వింటామని స్పష్టం చేసింది.