తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే

 Adilabad– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వార్షికోత్సవాల ముగింపు సభ
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్బంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనంలో సెమినార్‌ నిర్వహించారు. దీనికి పార్టీ కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. విమోచన పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఉత్సవాలు జరపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీల చరిత్రను వక్రీకరించకుండా ప్రజలకు పోరాట వాస్తవాలు వివరించాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిందని తెలిపారు. ఇంకా నేటికీ అమరుల ఆశయాలు మిగిలే ఉన్నాయని అన్నారు. భూమిలేని, వెట్టిచాకిరి లేని తెలంగాణ అయినప్పుడు మాత్రమే వారి ఆశయాలు నెరవేరినట్టు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నించాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, ఆర్‌.మంజుల, ఆర్‌.సురేందర్‌, నాయకులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, పండుగ పొచ్చన్న, ప్రభు, అరిఫా పాల్గొన్నారు.