– దాతలకు కృతజ్ఞతలు తెలిపిన సేకరణకర్తలు
నవతెలంగాణ – బెజ్జంకి
మానవత్వంతో అందించిన కొద్దిపాటి ఆర్థిక సాయం ఓ నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. అక్షరాల సత్యమని నిరుపించారు మండలంలోని పలువురు దాతలు. ఎల్లంపల్లికి చెందిన బోనగిరి మహేందర్ ఈ నెల 14న మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్ర రక్తస్రావమై విషమ పరిస్థితుల్లోకి వెళ్లాడు. స్థానిక యువత చాకచక్యంగా వ్యవహరించి మెరుగైన వైద్య చికిత్సకు కరీంనగర్ పట్టంలోని ఆస్పత్రికి తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న కుటుంబం వైద్య చికిత్స ఖర్చులు భరించే స్థోమత లేదు. స్థానిక యువత, యువజన సంఘాల నాయకులు దాతలు స్పందించి ఆర్థికంగా అదూకోవాలనీ సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తి చేశారు. మానవత్వంతో పలువురు దాతలు స్పందించి సుమారు రూ.6 లక్షల ఆర్థిక సాయమందజేశారు. గాయపడిన బాధితుడు మహేందర్ ఆరోగ్యం కుదుటపడుతోందని సమాచారం. మానవత్వంతో తోచిన విదంగా అందజేసిన పలువురి ఆర్థిక సాయం ఒక ప్రాణానికి మళ్లీ ఊపిరి పోసింది. ఆర్థిక సాయం అందజేసిన దాతలకు యువత, యువజన సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
రూ.1.50 లక్షల ఆర్థిక సాయం..
మహేందర్ వైద్య చికిత్సకు ముంజ శ్రీనివాస్, శ్రీకాంత్, తూటీ మహిపాల్ రెడ్డి, ముంజ సదానందం పలువురి దాతల వద్ద సుమారు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం సేకరించారు. సేకరించిన ఆర్థిక సాయాన్ని కరీంనగర్ పట్టణంలోని ఆస్పత్రి అవరణం వద్ద గాయపడిన మహేందర్ కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయమందజేసిన దాతలకు మహిపాల్ రెడ్డి, బొల్లి సంతోష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.