కళలు – పోరాటాలు జీవితంలో అంతర్భాగాలే. ఈ రెండింటిని మినహాయించి జీవితాన్ని ఊహించడం అసాధ్యం. పశుపక్ష్యాదుల గుంపు జీవితం నుండి మనిషి సామూహిక ఉత్పత్తి దశ వైపు అడుగిడినప్పటి నుండి సచేతనంగా రూపొందాడు. ప్రకృతి పట్ల, తన పట్ల, తోటి ప్రాణుల పట్ల ఎరుకలోకి వచ్చాడు. అంతేకాదు, తన కృషి (శ్రమ), దాని ఫలితం పట్ల అవగాహన పెంచుకున్నాడు. జ్ఞానేంద్రియాలతో పొందే అనుభూతులను ఆస్వాదించడం, నిక్షిప్తం చేసుకోవడం, నెమరువేసుకోవడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఇతరుల కష్టసుఖాలను అర్థం చేసుకోవడం, బాధితుల పట్ల స్పందించడం జాలి, దయ మున్నగు మానవీయ లక్షణాలతో జీవితం వికసించడం ప్రారంభమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ రసమయ జీవితమే నేడు మానవ జీవితానికి పర్యాయపదమైంది. అందుకే మహాకవి శ్రీశ్రీ ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోరు’ అని లోకానికి చాటాడు.
ఈ నేపథ్యంలో చూసినప్పుడు భూమికోసం, భుక్తికోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన మహత్తర సాయుధ తెలంగాణ విప్లవ పోరాటం ప్రజాకళను ఉచ్ఛస్థితిలో నిలిపింది. అణచివేత ఉన్నప్పుడు ప్రతిఘటన తప్పదు. చర్యకు ప్రతిచర్య లాంటిది. సామాజిక చలన సూత్రం. ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా ప్రజలు తమ చరిత్రను తామే నిర్మించుకుంటారు.
రైతు ప్రకృతితో మమేకమై పంట పండిస్తాడు. ప్రకృతి అంత స్వచ్ఛంగా, నిష్కల్మషంగా వుంటాడు. హృదయపూర్వకంగా సాగు చేస్తాడు. సొంత భూమి లేకపోయినా, కౌలుకు తీసుకుని, అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ సేద్యం చేస్తాడు.
”కుప్పనూర్చినాడమ్మా చందమామ రైతు/ అప్పుతీర్చినాడమ్మా చందమామ/ లోకాన్ని బతికిస్తాడే చందమామ రైతు/ శోకాన్ని భరియిస్తాడే చందమామ/ వెన్నకన్నా మెత్తనోడే చందమామ రైతు/ నీకంటే చల్లనోడే చందమామ”
డా|| ఆరుద్ర సేకరించిన జనపద గీతం ఇది. రైతు స్వభావాన్ని, మనస్తత్వాన్ని, కష్టసుఖాలను గుణగణాలను అన్నీ ఈ ఒక్క గీతం తేటతెల్లం చేస్తుంది.
ఇలాంటి తెలంగాణ రైతు కష్టజీవి. ఫ్యూడల్ దోపిడీ చట్రంలో వెట్టికి బందీ అయ్యాడు. ఏ కులం వారైనా దొరలకు వెట్టి చేయాల్సిందే. దొరలతో పాటు ఊర్లోకొచ్చే అధికార్లకు అన్నీ తేరగా సమకూర్చాల్సిందే.
”మాదిగన్నా, మంగలన్న, మాలన్నా, చాకలన్నా/ వడ్రంగి వజ్జెరన్న వేసిమాలిని చేసిరన్నా/ కమ్మరన్నా కుమ్మరన్నా కూలన్నా రైతన్నా/ అన్నీ పనులు వాళ్లతో దొరలందరూ చేయించుకునెడి వెట్టి” అంటూ సుద్దాల హన్మంతు ఆక్రోశం వెళ్లగక్కుతాడు.
దొరల దోపిడీకి అంతేలేకుండా పోయింది. దోపిడీని ప్రతిఘటించే ప్రజల మానప్రాణాలను కాటువేయడం చాలా మామూలైపోయింది. అన్నదమ్ముల ఆస్తి తగాదాలతో అన్న పక్షాన బందగీ అనే ముస్లిం యువకుడు చేరాడు. దారికాచి మరీ దారుణంగా బందగీని హతమార్చారు దుండగులు.
”బందగీ రక్తంబు చింది జ్వాలై లేచి/ జాగీరు దారులను ఊగించి వేసింది”
బందగీ తర్వాత ఎందరెందరో జిందగీలను అర్పించారు. వీర, కరుణ రసాలతో వారి త్యాగమయ సాహస గాథలను కైతలుగా కట్టుకుని పాడుకున్నారు.
బందగీ సమాధి వద్ద సాగే జనజాతరతోనే ‘మా భూమి’ నాటకం ప్రారంభమవుతుంది. అప్పటి నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా పోరాటాల్లో 240 గ్రామాలపై పోలీసు దాడులు జరిగాయి. 85 వేలమంది అరెస్టు అయ్యారు. 12 వేలమంది చిత్రహింసలకు గురయ్యారు. 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందించిన స్ఫూర్తి, సుంకర వాసిరెడ్డిల చేత ‘మాభూమి’ నాటక రచనకు పురికొల్పింది. అంగిరసం వీరం అయినప్పటికీ నవరసాల సమ్మేళనంగా నాటకం సాగుతుంది. ప్రతి పాత్రా ఆ పోరాటగడ్డపై జనించిన పాత్ర గనుక అవి జవ జీవాలతో తొణికిసలాడుతాయి. సాధారణ వాడుక భాష సంభాషణలతో పాటూ సాహితీ విలువల గేయ సాహిత్యం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. పోరాటం ఎంత తీవ్ర చలనంతో సాగుతుందో నాటకం కూడా అదే రీతిలో, అంతే ఉత్కంఠతో సాగుతుంది. కనుకనే చారిత్రక పోరాట సాంఘిక నాటకంగా ‘మాభూమి’ భాసిల్లింది. ఉభయ రాష్ట్రాల్లో (ఆనాటి ఉమ్మడి రాష్ట్రం) దాదాపు 200 దళాలు ఈ నాటకాన్ని ఎక్కడికక్కడ ప్రదర్శించారు. తద్వారా తెలంగాణా పోరాటానికి తెలంగాణేతర ప్రాంతం నుండి అద్భుతమైన సంఘీభావం సమకూరింది. డా||రాజారావు నేతృత్వంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర దళం, కోడూరు అచ్చయ్య దర్శకత్వంలో ప్రజానాట్యమండలి కృష్ణాజిల్లా దళం పోటాపోటీగా ప్రదర్శనలిస్తూ అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేవి. ఆనాటి మద్రాసు ప్రభుత్వం ఈ స్పందనకు తాళలేక మా భూమి నాటకాన్ని 1948లో నిషేధించింది.
డా||రాజారావు దళం అహ్మదాబాద్, బొంబాయి, పూనా, షోలాపూర్, మద్రాస్ వంటి రాష్ట్రేతర ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి మేధావుల ప్రశంసలు సైతం చూరగొన్నది. ప్రజానాట్యమండలి కళాకారులు ‘మా భూమి’ నాటక ప్రదర్శనలో బ్రహ్మాండమైన విప్లవం తీసుకువచ్చారు. నాటక కళాకారుల క్రమశిక్షణా ప్రాముఖ్యాన్ని కళ్లకు కట్టారు. ‘కళాదృష్టిలో ఒక పాత్రకు మరో పాత్రకు హెచ్చుతగ్గులు లేవని నిరూపించారు’ అని కితాబు ఇచ్చాడు శ్రీశ్రీ. షోలాపూర్‌లో పృథ్వీరాజ్ కపూర్ గదర్, దీవార్ వంటి మహానాటకాలకు ధీటుగా మా భూమి నాటకం సాగింది. విప్లవ పోరాటం నుండి విప్లవ నాటకం, విప్లవ నాటకం ద్వారా విప్లవ పోరాటానికి సంఘీభావం. ఇదంతా కళాజీవన పోరాట వలయం. అందుకే అతి తక్కువ సమయంలో వేయికి పైగా ప్రదర్శనలను 20 లక్షల మంది మా భూమి నాటకాన్ని తిలకించి స్ఫూర్తి పొందడం, ప్రపంచ రికార్డుగా కె.ఎ.అబ్బాస్ అభివర్ణించాడు.
కాగా, తెలంగాణా పోరాటంలో ఎక్కడికక్కడ ప్రతిఘటనా రూపాలు అన్నీ కళాత్మకంగానే కన్పించేవి. త్యాగాలు, సాహసాలు, బలిదానాలు కథలు కథలుగా చెప్పుకునేవారు. కైతలుగా అల్లుకుని పాడుకునేవారు.
కడివెండి గ్రామంలో వున్న ప్రజా సంఘ నాయకుల్ని హత్య గావించేందుకు దేశ్‌ముఖ్ పథకం వేశాడు. ప్రజలు మానేసిన వెట్టిని తిరిగి పునరుద్దరించాలని పన్నాగం పన్నాడు. గుండాలచే స్వైరవిహారం చేయించి భయానక వాతావరణం సృష్టించాడు. అయినా ప్రజలు వెరువలేదు. గూండాల తుపాకీ గుళ్లకు కొమరయ్య నేకొరిగాడు.
”అమరజీవి నీవు కొమరయ్యా/ అందుకో జోహార్లు కొమరయ్యా/ న్యాయమన్నది లేని నైజాము రాజ్యాన/ విశ్వరాక్షసుడైన విసునూరు దేశముఖు/ పాలించుచున్న ఈ పల్లె కడివెండిలో/ ప్రజల హక్కుల కొరకు కొమరయ్యా/ ప్రాణమిచ్చినావు కొమరయ్యా ||అమర||”
ఘటన అనంతరం పాటపుట్టినంత వేగంగా నాటకం పుట్టడం కష్టసాధ్యం. అయినా అంతకుముందే తిరునగరి రామాంజనేయులు తెలంగాణ పోరాటంలో ‘వెట్టిచాకిరి’ వీధి నాటిక రాసి ప్రదర్శింపజేశాడు. ఆనాటి ఆంధ్ర మహాసభ దళ కార్యకర్తలందరూ వైజ్ఞానిక దళ సభ్యులే. అంటే కవులు, రచయితలు, గాయకులు, నటులే. హుజూర్‌నగర్ దళ బాధ్యుడైన రామాంజనేయులు ‘వెట్టిచాకిరి’ని ఇతివృత్తంగా తీసుకుని ఎనిమిది మందితో నాటిక కట్టారు. పాత్ర విభజన తర్వాత ఆసువుగా డైలాగ్‌లు చెప్పడం ప్రయత్నించి చివరకు అలా అలా… వీధి నాటికగా రూపాంతరం చెందింది. అప్పట్లోనే అది వీధుల్లో ప్రదర్శితమై ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇతివృత్తం తమ సమకాలీన పోరాట జీవితలకు ప్రతిబింబమైనప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంలో వింతేముంటుంది.
వీరతెలంగాణ విప్లవ పోరాటం స్వర్ణోత్వవాల్లో భాగంగా 1996లో ‘వీర తెలంగాణా’ వీధినాటికను ప్రజానాట్యమండలి నల్గొండ జిల్లా దళం రూపొందించుకుంది. అంతకుముందు చైనా ప్రతినిథి బృందం మన తెలంగాణా పోరాటం గురించి తెలుసుకోవాలని కోరినప్పుడు సుందరయ్య గారి పుస్తకం (వీర తెలంగాణ పోరాటం – గుణపాఠాలు) లోని కొన్ని పుటలు దృశ్యంగా రూపొందించి ప్రదర్శించారు. గెరిల్లా దళ సభ్యులు ప్రతిజ్ఞ ఆ పుస్తకం లోనిదే. అలాగే అంతకుముందే అక్షరాస్యత ఉద్యమంలోనూ, వీధినాటక ఉద్యమంలోనూ గడించిన అపార విశేషానుభవం వీరతెలంగాణ నాటికలో మిళితమై కొత్తపుంతలు తొక్కింది. చూసిన ప్రజానీకం అంతా మేమే కదా నిజమైన తెలంగాణ పోరు బిడ్డలం, వారసులం, అని ఉప్పొంగిపోయారు. ఆ విధంగా ఆ నాటిక చరిత్ర సృష్టించింది. అలాగే వీర తెలంగాణ సాయుధ పోరాటంలో రవ్వంత పాత్రలేని కాషాయి మూకలు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంటే దానికి సమాధానంగా వీర తెలంగాణ నాటిక-2 ను రూపొందించి వరంగల్ జిల్లా కళాకారులు ప్రదర్శించారు.
తెలంగాణ సాయుధ పోరాటాలు, తిరుగుబాట్లు దేశంలో పెల్లుబికితే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టు పార్టీ ప్రత్యామ్నాయమైంది. భారత ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. జోక్యం అనివార్యమైంది. ఆ పథకంలో భాగమే ఆపరేషన్ పోలో.
భారతసైన్యం లక్షల సంఖ్యలో హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టింది. మూడే మూడు దినాల్లో నిజాం చేతులెత్తేశాడు. భారత ప్రభుత్వానికి లొంగిపోయినట్టు ప్రకటించాడు. కానీ కథ సుఖాంతం కాలేదు.
1948, సెప్టెంబర్ 17న లొంగిపోయిన నిజాం, 1950 జనవరి 26 వరకు రాజ ప్రముఖ్‌గా కొనసాగాడు.
మొదటిసారి – దొరలు గూండాలు
రెండవసారి – రజాకార్లు
మూడవసారి – నెహ్రూ పటేల్ సైన్యం
ఇలా ప్రతిసారీ ప్రజలు, ప్రజానాయకులు అణచివేతకు గురయ్యారు. మిలట్రీ సైన్యం గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తూ, ప్రజల మానప్రాణాలను హరిస్తూ వుంటే ఇది విమోచన ఎట్లవుది బిడ్డా! అని వీర తెలంగాణ నాటిక – 2 ఆక్రోశిస్తుంది.
కొండ అద్దమందు చూపిన మాదిరిగా ఈ కళారూపాలు నాటికలు ఆ తెలంగాణా పోరాటాన్ని రేణువు ప్రాయంగానే చూపగలవు. వాస్తవాలు వెలికిరావాలంటే మరెన్నో కళారూపాలు దీక్షగా తవ్వి తీయాల్సిందే. ఆ విధంగా ప్రజలకు సత్యాలు చెబుతూ, చూపుతూ ప్రజాకళాకారులుగా మనకు మనం పునరుత్తేజితులం కావాల్సిందే.
– కె.శాంతారావు, 9959745723