ఉన్నత న్యాయ వ్యవస్థ-హిందూత్వ

Higher Judiciary – Hindutvaభారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డి.వై.చంద్రచూడ్‌ పదవీ విరమణ సందర్భంగా అనేక విమర్శనాత్మక అంచనాలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారిలో అత్యంత ప్రభావశీలమైన వారిలో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒకరుగా పరిగణించబడ్డారు గనక ఇది సహజమే. పైగా గత రెండు దశాబ్దాలలో మరే సిజెఐ చేయని విధంగా ఆయన రెండు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించారు. రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను కాపాడే బాధ్యత గల న్యాయ వ్యవస్థ అధిపతిగా ఆయన నిర్వహించిన పాత్రను సరిగ్గా అంచనా వేయాలంటే తను చేసిన మొత్తం కృషిని పరిశీలించవలసి వుంటుంది. ఈ పనిచేసే సందర్భంలో సిజెఐ చంద్రచూడ్‌ ఏ నేపథ్యంలో తన న్యాయ పాలనా బాధ్యతలు నిర్వహించారో కూడా గమనంలో పెట్టుకోవడం అవసరం.రెండవ దఫా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తన హిందూత్వ ఎజెండాను ముందుకు నెట్టేందుకై దూకుడుగా ప్రయత్నిస్తున్న కాలం. రాజ్యాంగాన్ని పౌరుల ప్రాథమిక హక్కులను వమ్ము చేసే ఎజెండా అది. ఈ సందర్భంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ రాజ్యాంగ సమస్యలపైన, మెజార్టీ మతతత్వ దాడిపైన ఇచ్చిన తీర్పులను చూడవలసి వుంటుంది.
రెండు తీర్పులు
ఈ కోణంలో రెండు తీర్పులు ఒకటి ఆయన న్యాయమూర్తిగా వుండగా ఇచ్చింది, మరోటి సిజెఐగా ఇచ్చింది కీలక పరీక్షకు వస్తాయి. అయోధ్య వివాదంపై తీర్పునిచ్చిన అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఒక సభ్యుడు. ఆయన రచించిన తీర్పు బాబ్రీ మసీదు వుండిన వివాద స్థలం మొత్తాన్ని రామమందిర నిర్మాణానికై హిందువులకు అప్పగించింది. సాక్ష్యాలు, క్షేత్ర స్థాయి వాస్తవాల కన్నా ఎక్కువగా మతభావనలు, విశ్వాసాలపై ఆధారపడి ఆ తీర్పు రూపొందింది. బాబ్రీ మసీదు విధ్వంసం రాజ్యాంగ విరుద్ధమైన దిగ్భ్రాంతికర చర్య అని ఒప్పుకుంటూనే ఆ తీర్పు అలా రూపొందింది. ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ-విశ్వహిందూ పరిషత్‌ల వాదనను చట్టబద్దం చేస్తూ ఆ విధంగా బీజేపీ మూల ఎజెండాలో ఒకదాన్ని నెరవేర్చిన న్యాయవ్యవస్థ తీర్పు అది. తర్వాతి కాలంలో సిజెఐ చంద్రచూడ్‌ వారణాసిలోని గ్యాన్‌వాపి మసీదు కేసును కూడా తిరగదోడడానికి అనుమతించ డాన్నిబట్టి ఈ తీర్పు ఏదో ఒకసారి వ్యవహారం కాదని తేలిపోయింది. 1991 ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం అలాంటి కేసులు పున:ప్రారంభించడాన్ని నిషేధి స్తున్నప్పటికీ హిందువులు గ్యాన్‌వాపి మసీదు స్వభావాన్ని మార్చాలని కోరడం లేదనీ కేవలం దాని మత మూలాలను తెలుసుకోవాలని మాత్రమే కోరుతు న్నారని ఒక సందేహాస్పద వాదనతో సిజెఐ చంద్రచూడ్‌ ఈ కేసులను అనుమతినిచ్చారు. దానివల్ల హిందూత్వ శక్తులు వారణాసి, మధుర వివాదాలను మళ్లీ రగిలించేందుకు లైసెన్సు లభించినట్టయింది.
సిజెఐ చంద్రచూడ్‌ ఇచ్చిన మరో ప్రధానమైన తీర్పు జమ్ముకాశ్మీర్‌ 370 అధికరణాన్ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం సంబంధించి. జమ్ము కాశ్మీర్‌ రాజ్యాంగ పరిషత్తు ఇంకేమాత్రం ఉనికిలో లేదు గనక కార్యనిర్వాహక వర్గం 370 అధికరణాన్ని ఏకపక్షంగా సవరించే అధికారం కలిగివుంటుందని ఆ తీర్పు ఆమోదం తెలిపింది. రాజ్యాంగం మూడవ అధికరణంలోని ప్రక్రియను ఉల్లంఘించి జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించివేయడంపై తీర్పు నిస్తూ భవిష్యత్తులో ఒకనాటికి మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామనే హామీని ఆమోదిస్తున్నట్టు చెప్పింది. 370వ అధికరణాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యను ఏదో విధంగా ఆమోదించాలని మాత్రమే ఆ తీర్పు ఉద్దేశమని తప్ప మరో విధంగా అర్థం చేసుకోవడం కుదరదు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మూల ఎజెండాలో మరోటని గుర్తించడం ఇక్కడ చాలా ముఖ్యం.
కొలీజియం, ధర్మాసనాల తీరు
సిజెఐ చంద్రచూడ్‌ హయాంలో ధర్మాసనాలకు జడ్జిల నియామకం చేసే బాధ్యత (మాష్టర్‌ ఆఫ్‌ ద రోస్టర్‌) నిర్వహణలోనూ, కొలీజియం వ్యవస్థ పనితీరులోనూ ఇంకా ఇతర అంశాలున్నాయి. ఈ విషయంలోనూ ఒక స్పష్టమైన పద్ధతి పాటించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. పౌరుల వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన కేసులు అంటే దీర్ఘకాలం నిర్బంధం సాగిన భీమా కోరెగావ్‌, ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసుల వంటివి ఒక పథకం ప్రకారం నిర్దిష్ట ధర్మాసనానికే పంపినట్టు కనిపిస్తుంది. ఆ పౌర హక్కులు బెయిల్‌ మంజూరు వంటి విషయాల్లో మితవాద దృక్పథంతో గల న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికే వాటిని పంపించారు. ఇక కొలీజియం పని విషయానికి వస్తే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియా మకం నియంత్రణ ప్రభుత్వానికే వదలి వేయడం ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.
అయితే ఇవన్నీగాక మరో విషయం కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ జ్ఞానవంతుడైన జడ్జి వ్యక్తిగత స్వేచ్ఛలను రాజ్యాంగ సూత్రాలను దృఢంగా సమర్థిస్తారనే భావన వుండగా ఆయన చివరకు రాజ్యాంగం, దాని విలువల పట్ల విధేయత కన్నా తన వ్యక్తిగత నమ్మ కాన్నే అధికంగా చూడటమే. తన పదవీ విరమణకు ముందు ఆఖరి ఘట్టంలో చంద్రచూడ్‌ అయోధ్య కేసు పరిష్కారం కోసం తాను దైవాన్ని ప్రార్థించానని చెప్పడం అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజ్యాంగ చట్టం ప్రకారం గాక దైవ ప్రేరణతో ఆ తీర్పు రాశానని ఒప్పుకున్న దాన్ని రాసిన వ్యక్తి చెబుతున్నాడన్న మాట. మరో సందర్భంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ గుజరాత్‌లోని ద్వారక ఆలయ సందర్శన తర్వాత అక్కడ వున్న లాయర్ల బృందంతో మాట్లాడుతూ ఆ ఆలయ శిఖరంపై వున్న కాషాయ ధ్వజం న్యాయ పతాకగా వెలుగొందుతుందని ప్రవచించారు.
ఆరెస్సెస్‌ భావనల చొరబాటు
వీటన్నిటినీ బట్టి వెల్లడయ్యేది ఒకటే. కేవలం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే గాక మొత్తం ఉన్నత న్యాయ వ్యవస్థలో మత భావనలు పెరుగుతున్నాయనే వాస్తవం. మోడీ దశాబ్ది పాలన ప్రభావంతో ఇటీవలి కాలంలో బహిరంగంగానే హిందూత్వ భావనలు ఉన్నత న్యాయ వ్యవస్థ దొంతరలో, న్యాయ వర్గాల్లో విస్తరించాయి. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తన పదవీ విరమణ సమయంలో ఆరెస్సెస్‌తో తన యావజ్జీవిత బంధాన్ని, ఆ సంస్థకు తన రుణపడి వుండటాన్ని గురించి ప్రకటించారు. మరో హైకోర్టు జడ్జి అభిజిత్‌ గంగో పాధ్యాయ ఎన్నికలకు కొన్ని వారాల ముందు రాజీనామా చేసి కొద్ది రోజుల్లోనే బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. కొంతమంది న్యాయమూర్తుల ప్రాపంచిక దృక్పథం హిందూత్వతో రూపుదిద్దుకుంటున్నదని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వెల్లడించాయి. రక్షణోద్యోగులు ఆరెస్సెస్‌లో చేరడంపై పదవీ విరమణ చేసిన ఒక ప్రభుత్వోద్యోగి వేసిన పిటిషన్‌ను ఆ హైకోర్టు పరిష్కరిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆరెస్సెస్‌పై నిషేధాన్ని కేంద్రం ఉపసంహరించిన తర్వాత వెలువడిన ఆ ఉత్తర్వులో హైకోర్టు ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి ఒక గౌరవనీయ సంస్థను దేశంలోని నిషిద్ధ సంస్థల జాబితాలో తప్పుగా చేర్చినట్టు పేర్కొంది. ”కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ తప్పు వల్ల అయిదు దశాబ్దాల పాటు దేశానికి సేవ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు అనేక విధాల క్షీణించిపోయాయి”అని పేర్కొంది. అంటే విజ్ఞానవంతులైన ఈ జడ్జిలు చెప్పే ప్రకారం దేశానికి సేవ చేయాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలన్నమాట.
కారవాన్‌ పత్రిక 2024 అక్టోబర్‌ సంచికలో ఆరెస్సెస్‌ లీగల్‌ విభాగం ఉన్నత న్యాయ వ్యవస్థలో తన పట్టు ఏ విధంగా పెంచు కుంటున్నదీ కళ్లు తెరిపించేలా వ్యాసం ప్రచురించింది. అఖిల భార తీయ అధివక్త పరిషత్‌ ఆరెస్సెస్‌ న్యాయవాదుల వేదికగా పని చేస్తున్నది. దాని శ్రేణుల నుంచే అంత కంతకూ ఎక్కువగా లీగల్‌ అధికారులు, అడ్వకేట్‌ జనరల్స్‌ వంటి వారు, జడ్జిలు నియమితులవుతు న్నారు. 33 మంది ప్రస్తుత న్యాయ మూర్తులలో కనీసం తొమ్మిది మంది బహుళ సంఖ్యలో ఆ పరిషత్‌ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారని కారవాన్‌లో వెలువడిన ఆ వ్యాసం చెబుతున్నది. అత్యున్నత స్థాయిలో వెలువడే న్యాయ నిర్ణయాల్లో మెజారిటీ మతతత్వ మనోభావాలు ప్రతిబింబించు తున్నాయనడానికి సిజెఐ చంద్రచూడ్‌ పదవీ కాలపు అనుభవం ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది. మొత్తంపైన ఉన్నత న్యాయ వ్యవస్థలో ఆరెస్సెస్‌ చొరబాటుకు మోడీ ప్రభుత్వం ఎలా సహాయ పడిందో చెప్పే హెచ్చరిక ఇది.
(నవంబరు 13 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)