ముగిసిన హాలీవుడ్‌ నటీనటుల చారిత్రాత్మక సమ్మె

The historic strike of Hollywood actors has ended– వేతన పెంపు, ఎఐ వినియోగంపై కుదిరిన ఒప్పందం
లాస్‌ఏంజెల్స్‌: వేతనాలను పెంచాలని, కృత్రిమ మేధ (ఎఐ)కి వ్యతిరేకంగా హాలీవుడ్‌ నటీ నటులు నాలుగు మాసాలుగా సాగిస్తున్న చారిత్రాత్మక సమ్మె విజయవంతమైంది. అలయెన్స్‌ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ టివి ప్రొడ్యూసర్స్‌ (ఎఎంపిటిపి)కి, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ – అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆప్‌ టివి అండ్‌ రేడియో ఆర్టిస్ట్సు (ఎస్‌ఎజి-ఎఎఫ్‌టిఆర్‌ఎ) మధ్య బుధవారం ఒప్పందం కుదరడంతో హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఊపిరిపీల్చుకుంది. మరి కొద్ది రోజుల్లో తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. నటీ నటుల సంఘం ఎస్‌ఎజి -ఎఎఫ్‌టిఆర్‌ఎ ప్రపంచవ్యాపితంగా 1,60,000 మంది వృత్తి నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, లాస్‌ ఏంజెల్స్‌ కేంద్రంగా ఏర్పడిన ఎఎంపిటిపి 350 మంది అమెరికన్‌ టెలివిజన్‌ అండ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఇంచుమించు ఇవే డిమాండ్లపై హాలీవుడ్‌ రచయితలు నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మె సెప్టెంబరు చివరి వారంలో ముగిసింది. 2023 జులై 14న ఈ సమ్మె మొదలైంది. నెలల తరబడి చర్చలు, రాజీలు, ఆఫర్లు, తిరస్కారాలతో అనేక మలుపులు తిరిగి చివరికి ఇరు పక్షాల మధ్య తాత్కాలికంగా ఒక ఒప్పందం కుదిరింది. స్టూడియోలతో కుదిరిన ఒప్పందం అసాధారణమైనదని, వంద కోట్ల డాలర్ల విలువైనదని ఎస్‌ఎజి-ఎఎఫ్‌టిఆర్‌ఎ ఒక ప్రకటనలో తెలిపింది. నటీ నట్టులకు మెరుగైన వేతనాలు చెల్లించేందుకు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని విచ్చల విడిగా వాడకుండా తగు చర్యలు తీసుకునేందుకు, ఆర్టిస్టులకు కొన్ని రక్షణలు కల్పించేందుకు ఫిలిం ప్రొడక్షన్‌ కంపెనీలు అంగీకరించాయి.