పుణ్య ఫలం

The fruit of virtueచంద్రగిరి అనే ఊరిలో చంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి మోహన్‌ అనే కొడుకు ఉండేవాడు. అతడు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
చంద్రయ్య ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్ముకొని కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు చంద్రయ్య కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లగా కట్టెలు కొట్టే సమయంలో ఒక కొమ్మ విరిగి కాలుపై పడింది. దానితో అతని కాలు విరిగిపోయింది. చిన్న కర్రలను ఆధారంగా చేసుకుని కుంటుకుంటూ ఇంటికి వచ్చాడు. తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాడు. డాక్టర్‌ అన్ని పరీక్షలు చేసి ”ఎముక విరిగింది. దీనికి కట్టు వేస్తాను. కానీ మూడు నెలలు విశ్రాంతి అవసరం” అని చెప్పాడు.
ఇంటికి వెళ్లి బాగా ఆలోచించాడు చంద్రయ్య. మోహన్‌ను దగ్గరకు పిలిచి ”మోహన్‌… మూడు నెలలు నేను మంచంపై ఉంటే మన కుటుంబం గడవడం కష్టం. కాబట్టి అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకు వచ్చి వాటిని అమ్మి మన కుటుంబాన్ని నువ్వే సాకాలి రా. మీ అమ్మకు ఆరోగ్యం బాగా ఉండటం లేదు కదా? తను పనిచేయలేదు. కాబట్టి నువ్వే మన కుటుంబ బాధ్యత తీసుకోవాలి” అని చెప్పాడు చంద్రయ్య. మోహన్‌కి ఏమి అర్ధం కాలేదు.
తల్లి మోహన్‌ను పిలిచి ”అరేరు.. నాన్నా.. ఈ మూడు నెలలు నాన్న చెప్పినట్టు వినురా! మన కుటుంబ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి” అని బతిమాలుతుంది.
”సరే అమ్మా! అలాగే వెళ్తాను” అని మోహన్‌ తల్లికి మాట ఇస్తాడు.
మరుసటి రోజు గొడ్డలిని చేత పట్టుకొని సీసాలో నీళ్లు పోసుకుని అడవికి బయలుదేరాడు. అడవి గుండా లోపటికి ప్రయాణం చేసి అక్కడ ఎండిపోయిన చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. పక్కనే ఒక పెద్ద బావి ఉంది. ఆ బావిలో నుండి గద్ద అరుపులు వినబడ్డాయి. భయం భయంగా దగ్గరికి వెళ్లి బావిలోకి తొంగి చూసాడు మోహన్‌. ఆ గద్ద భయంకరంగా ఉంది. కొమ్మల్లో చిక్కుకొని అరవసాగింది. దానికి రక్తం కారుతోంది. దానిని చూడగానే మోహన్‌కు జాలి వేసింది. ఆ బావికి మెట్లు ఉండడంతో వెంటనే లోపలికి దిగాడు. కొమ్మల్లో చిక్కుకున్న గద్దను కాపాడాడు. రక్తం కారుతున్న ఆ కాలికి తన చేతి రుమాలు చింపి కాలికి కట్టు కట్టాడు. పైకి ఎగిరేసాడు. అంతలోనే ఆ గద్ద దేవకన్యగా మారింది. ఆశ్చర్యపోయిన మోహన్‌ భయంతో పరుగందుకున్నాడు.
”ఆగు మోహన్‌” అని దేవకన్య పిలవగానే ఆగిపోయాడు.
”నేను ఒక శాపం వల్ల ఇలా మారిపోయాను. ఇప్పుడు ఆ శాపం తొలగిపోయింది” అని తన గతం అంతా చెప్పింది దేవకన్య.
”నీ పరిస్థితి అంతా నాకు తెలుసు. నేను నీకు వజ్రాలను ఇస్తాను. వాటిని అమ్ముకొని అమ్మానాన్నలకు మెరుగైన వైద్యం చేయించు. మిగిలిన డబ్బుతో బాగా చదువుకో” అని చెప్పి వజ్రాలను ఇచ్చి మాయమైపోయింది.
వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు మోహన్‌. జరిగిన సంగతి అంతా అమ్మానాన్నలకు చెప్పాడు. వాళ్లు సంతోషించి ”నీవు చేసిన సాయమే మనల్ని ఇలా ఆదుకుంది” అని తల్లిదండ్రులు సంతోషించారు.
ఆ వజ్రాలను వ్యాపారి వద్ద అమ్మారు. వచ్చిన డబ్బులతో మెరుగైన వైద్యం చేయించుకున్నారు. తల్లికి ఆరోగ్యం కుదుటపడింది. తల్లి కుటుంబ బాధ్యతను చూసుకోసాగింది. మోహన్‌ ఆనందంగా ఎప్పటిలాగే బడికి వెళ్ళసాగాడు. తండ్రి సంతోషించాడు.
ఎస్‌.రమేష్‌
9 వ తరగతి
గూనూ కోదాడ, సూర్యాపేట జిల్లా