పరువు పోతోంది…

– ‘విశ్వగురు’గా గుర్తించడం లేదు
– ప్రపంచ దేశాల్లో దిగజారుతున్న ప్రతిష్ట
– ఆంక్షలు, అణచివేతను ఎండగడుతున్న అంతర్జాతీయ సమాజం
న్యూఢిల్లీ:
ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా మన దేశాన్ని ‘విశ్వగురు’ (ప్రపంచ నేత)గా అభివర్ణిస్తుంటారు. కానీ వాస్తవానికి ప్రపంచం మనల్ని అలా చూడడం లేదు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, హిందూత్వవాదం ప్రబలుతోందని ఐరాస నిపుణులు, పౌర సమాజ బృందాల నుండి అంతర్జాతీయ మీడియా, పలు దేశాల పార్లమెంటేరియన్ల వరకూ ముక్తకంఠంతో విమర్శిస్తున్నారు. భారతావనిలో ప్రజాస్వామ్య వ్యవస్థ దుస్థితిని ఏకరువు పెడుతున్నారు. ఫిబ్రవరి 15-29 తేదీల మధ్య ఆయా సంస్థలు అందించిన నివేదికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
అణచివేతే : అంతర్జాతీయ మీడియా
‘భారతదేశంలోని పౌర సమాజంపై దశాబ్ద కాలంగా అధికార బీజేపీ సాగిస్తున్నది. అణచివేతే. సైద్ధాంతిక ప్రత్యర్థులను మినహాయిస్తే తమ విదేశీ నిధుల లైసెన్సులు కోల్పోయిన వారిలో సగం మందికి పైగా క్రైస్తవులు లేదా ముస్లింలే. అధికార పార్టీ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాల్సిన సుప్రీంకోర్టు తన స్వతంత్రతను కోల్పోతోంది’ అని లండన్‌ నుండి వెలువడుతున్న ‘ది ఎకనమిస్ట్‌’ పత్రిక ఎండగట్టింది. ‘ప్రొఫెసర్‌ అశోక్‌ స్వెయిన్‌కు చెందిన ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఒసీఐ) హోదాను భారత ప్రభుత్వం రద్దు చేసింది. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో వందకు పైగా ఓసీఐ హోదాలు రద్దయ్యాయి. స్వీడన్‌కు చెందిన ప్రొఫెసర్‌ స్వెయిన్‌ శాంతి, ఘర్షణలపై అధ్యయనం చేస్తున్నారు. ఆయితే ఆయన భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం ఆరోపించింది’ అని సింగపూర్‌ నుండి ప్రచురితమయ్యే ‘ది స్ట్రెయిట్‌ టైమ్స్‌’ పత్రిక పేర్కొంది.
‘2018లో నిరసనలు జరిగినప్పుడు హర్యానా ముఖ్యమంత్రి ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఆందోళనలను అణచివేసేందుకు అక్కడి పోలీసులు, సైనికులు అనుసరించిన వ్యూహాలను గమనించారు. ఇటీవల భారత్‌లో రైతులు నిరసన ప్రదర్శనలు జరిపినప్పుడు వారిపై హర్యానా పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అందుకోసం డ్రోన్లను వాడారు. ఇజ్రాయిల్‌లో తాను గమనించిన వ్యూహాలనే ఇక్కడ పోలీసులతో అమలు చేయించారు’ అని లండన్‌కు చెందిన ‘మిడిల్‌ ఈస్ట్‌ ఐ’ పత్రిక ఎద్దేవా చేసింది. ‘ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు బ్రిటన్‌కు చెందిన విద్యావేత్త నిటాషా కౌల్‌కు కర్నాటకలో ప్రవేశం లభించలేదు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై తన అభిప్రాయాలు పాలకులకు నచ్చకపోవడమే దీనికి కారణమని ఆమె తెలిపారు. రాజ్యాంగం, దేశ ఐక్యతపై కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సుకు ఆమె హాజరు కావాల్సి ఉంది. ఆమెకు వీసా కూడా మంజూరైంది. కానీ చివరి నిమిషంలో దానిని రద్దు చేశారు’ అని లండన్‌కే చెందిన ‘ది ఇండిపెండెంట్‌’ పత్రిక తెలిపింది. ‘నరేంద్ర మోడీకి సన్నిహితులైన మీడియా దిగ్గజాలు భారత్‌లో పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. వారు దేశంలోని మీడియా సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొన్నారు’ అని న్యూయార్క్‌ నుండి వెలువడుతున్న ది బ్లూమ్‌బర్గ్‌ మండిపడింది.
ఆంక్షలు..వేధింపులు…వివక్ష
భారతదేశంలో సంస్థాగత స్వయంప్రతిపత్తిపై ఆంక్షలు విధించారని, రాజకీయ నియామకాలు జరుగుతున్నాయని, అసమ్మతివాదులను వేధిస్తున్నారని, స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారని ‘ఆక్స్‌ఫర్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ హబ్‌’ తెలిపింది. ఇటీవల రైతుల ఆందోళనను అణచివేసిన తీరును అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఎండగట్టింది. పరిస్థితిని చక్కదిద్దాలని, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుకు గ్యారంటీ ఇవ్వాలని, శాంతియుత సమావేశాలకు అవకాశం ఇవ్వాలని కోరింది. భారత్‌లో దీర్ఘకాలం విధులు నిర్వర్తించిన ఫ్రాన్స్‌ పాత్రికేయుడు వనెస్సా డగక్‌ను దేశం నుండి బహిష్కరించడాన్ని ‘రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌’ తీవ్రంగా నిరసించింది. నరేంద్ర మోడీ హయాంలో పత్రికా స్వేచ్ఛ ప్రతిష్ట ఎంతగా దిగజారిందో ఈ ఉదంతం నిరూపించిందని వ్యాఖ్యానించింది.
భారత్‌లో కులం, మతం, వర్గం ఆధారంగా పెద్ద ఎత్తున విభజన జరుగుతోందని ప్రొఫెసర్‌ క్రిస్టొఫీ జాఫ్రెలాట్‌ విమర్శించారు. యూరోపియన్‌ యూనియన్‌, భారత్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) భారతదేశంలో మానవ, కార్మిక హక్కులపై ప్రభావం చూపవచ్చునని యూరోపియన్‌ కమిషన్‌ హెచ్చరించింది. కుల, మత, లింగ వివక్షల కారణంగా ప్రతికూల ప్రభావం పడుతుందని, బలహీన వర్గాల హక్కులకు విఘాతం కలుగుతుందని తెలిపింది. భారత్‌ నుండి వెళ్లి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న సమూహాలు, వ్యక్తులు నిరసనలు తెలుపుతుంటే వాటి సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా కేంద్ర ప్రభుత్వం సెన్సార్‌షిప్‌ విధిస్తోందంటూ అమరికాలోని ఈక్విటీ ల్యాబ్‌, హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌, ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌, సిక్‌ అమెరికన్‌ లీగల్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌ సంస్థలు ఓ నివేదికను ప్రచురించాయి. ఇన్సాఫ్‌ ఇండియా అనే సంస్థ జనవరి 31న ముంబయి ఐఐటీలో ఓ ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఒక రోజు ముందు దానిని అధికారులు రద్దు చేశారు. పాలకుల అణచివేతపై గళం విప్పడానికి ఏర్పాటు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను రద్దు చేయడం పరిపాటిగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాయకులు చేసే ప్రసంగాల్లో 75శాతం వరకూ ముస్లింలపై విద్వేషాలతో కూడినవేనని వాషింగ్టన్‌కు చెందిన ‘ఇండియా హేట్‌ ల్యాబ్‌’ సంస్థ తెలిపింది. ఇలాంటి ఉదంతాలలో ఐదో వంతు ఇజ్రాయిల్‌పై హమాస్‌ దాడి తర్వాత చోటుచేసుకున్నవేనని చెప్పింది.

బ్రిటన్‌ పార్లమెంటులోనూ ప్రస్తావన
భారత్‌లో నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్న దాతల భద్రతపై బ్రిటన్‌ ఎంపీ తన్‌మన్‌జీత్‌ సింగ్‌ దేశీ పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు, రైతుల నిరసనలకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సెన్సార్‌షిప్‌ విధించారని తెలిపారు. దీనిపై డిప్యూటీ స్పీకర్‌ జోక్యం చేసు కుంటూ ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అని, దీనిపై ప్రధాని తగిన చర్యలు చేపడతారని హమీ ఇచ్చారు.