జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కు కాంగ్రెస్ యువ నేతల సన్మానం

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిని చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు అనుమాల రామ్ కుమార్ శనివారం చంద్రకాంత్ రెడ్డి నివాసంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనుమాల రామ్ కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన మద్ది చంద్రకాంత్ రెడ్డి విద్యా రంగంలో చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన నేతృత్వంలో జిల్లా గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు విద్య పరంగా మరింత సహాయం అందించాలని కోరుకుంటున్నాం అన్నారు. అనంతరం మద్ది చంద్రకాంత్ రెడ్డి  మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రజలకు విద్యాబోధనలో ముఖ్యమైన వనరుగా మారాయన్నారు. ప్రస్తుతం కొత్త తరానికి పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ, ఆ ఉత్సాహాన్ని మళ్లీ కలిగించడం, గ్రంథాలయాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం నా ప్రధాన లక్ష్యం అన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పుస్తకాల వనరులను ఉపయోగించుకోవడానికి గ్రామస్థాయిలో సదుపాయాలను విస్తృతం చేయాలనుకుంటున్నానన్నారు. ముఖ్యంగా చిన్న గ్రామాల్లో గ్రామస్థాయి గ్రంథాలయాలు అందరికీ అందుబాటులో ఉండేలా నిరంతరం కృషి చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.
గ్రంథాలయాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. గ్రంథాలయాలు వ్యక్తి అభివృద్ధిలో ఎంత ముఖ్యమో, సమాజంలోనూ అవి అదే విధంగా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పుస్తకాలు మనకు తెలియని ఎన్నో విషయాలను నేర్పిస్తాయనీ, గ్రంథాలయాలు పుస్తక సాంప్రదాయాన్ని ప్రోత్సహించే కేంద్రాలుగా కొనసాగాలన్నారు. ప్రజల్లో పుస్తక పఠనానికి మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలి. సమాజాన్ని జ్ఞానసంపన్నం చేయడంలో పుస్తకాలు, గ్రంథాలయాలు ఎనలేని పాత్ర పోషిస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు మాట్లాడుతూ  గ్రంథాలయాలు మన పిల్లలకు మంచి పుస్తక పఠనానికి మార్గదర్శకాలు. పుస్తక పఠనం ద్వారా వారు తమ ఆలోచనలను, జ్ఞానాన్ని విస్తృతం చేసుకోవచ్చు అన్నారు. ఈ బాధ్యతను చేపట్టిన మద్ది చంద్రకాంత్ రెడ్డి  తన కృషి ద్వారా గ్రామస్థాయి విద్యా విప్లవానికి మార్గదర్శకంగా నిలుస్తారని మేము ఆశిస్తున్నాం అని నేతలు అన్నారు.