అట్ట‌డుగు ప్ర‌జ‌ల ఆశాజ్యో‌తి

The hope of the marginalized peopleడాక్టర్‌ మంజు కుమారి… ఓ విద్యా శాఖ అధికారి. అందరు ప్రభుత్వ ఉద్యోగుల్లా ఎలాంటి కష్టం లేకుడా హాయిగా జీవితాన్ని గడపొచ్చు. కానీ ఆమె ఆలోచనలు వేరే ఉన్నాయి. సమాజానికి తన వంతుగా ఏదో చేయాలని తపించారు. తన తండ్రి నుండే ప్రేరణ పొంది ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు విద్యా అవకాశాలు అందించాలని అడుగులు ముందుకేశారు. వారి జీవితాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. తన అధికారిక విధులకు మించి వారికి సేవ చేస్తున్నారు. సామాజిక సేవ పట్ల ఆమెకున్న అంకితభావమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం ఎంతో శ్రమిస్తున్న ఆమె పరిచయం…
తన పరిసర ప్రాంతాలను సాధ్యమైంత వరకు మెరుగుపరచడమే మంజు కుమారి లక్ష్యం. ఆ సామాజిక బాధ్యతతోనే బీహార్‌ విద్యా శాఖ అధికారిగా ఉన్న ఆమె రోహ్తాస్‌ జిల్లాలో, ముఖ్యంగా నక్సల్‌ ప్రభావిత తిలౌతు బ్లాక్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు. బ్లాక్‌ రిసోర్స్‌ సెంటర్‌ (BRC) ఇన్‌చార్జ్‌గా ఆమె తన అధికారిక విధులకు మించి, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన పిల్లలను ప్రేరేపించడానికి, వారిని విద్యావంతులను చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నారు.
సొంత నిధులతోనే…
సాధారణంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పని తాము చేసుకొని సమయానికి ఇంటికి వెళ్లిపోతారు. కానీ మంజు కుమారి అలా కాదు. ఆఫీసు పనివేళల తర్వాత ఇంటికి వెళ్లరు. ఆఫీస్‌ పని ముగించుకున్న తర్వాత సాయంత్రాలు గ్రామాలను సందర్శించడానికి వెళతారు. పుస్తకాలు, స్కూల్‌ బ్యాగులు, యూనిఫాంలతో పాటు ఇతర స్టడీ మెటీరియల్‌ లేని పిల్లలను గుర్తించి వారికి పంపిణీ చేస్తారు. దీని కోసం ఆమె తన జీతం నుండే నిధులు సమకూర్చు కుంటారు. ఇలా ఆమె కనీసం ప్రాథమిక విద్య కూడా అభ్యసించలేని నిరుపేద విద్యార్థుల కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. అయితే తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు అవసరమ్యే నిధుల కోసం ఎన్‌జీవోలపై ఆధారపడరు.
తండ్రి నుండి ప్రేరణ
సామాజిక సేవ పట్ల నిబద్ధత ఆమెకు చిన్ననాటి నుండే ఉంది. ఆమె తండ్రి శివ శంకర్‌ షా జీవించి ఉన్నప్పుడు రోహ్తాస్‌లోని చందన్‌పురా మాజీ ముఖియా (పంచాయత్‌ హెడ్‌)గా చేసేవారు. ఆయన నుండే ఈమె ప్రేరణ పొందారు. ‘మా నాన్న సమాజానికి సేవ చేయడం, కొత్త పాఠశాలను స్థాపించడానికి భూమి, వనరులను అందించడం వంటివి బాగా చేసేవారు. నాలో సామాజిక బాధ్యతను నింపింది ఆయన ఆలోచనలు, పనులే. మా నాన్న స్థాపించిన పాఠశాల ఇప్పటికీ పనిచేస్తోంది’ అని మంజు గుర్తుచేసుకున్నారు. తన తండ్రి నుండి పొందిన స్ఫూర్తితో ఆమె సమాజం కోసం, పేదల కోసం అంకిత భావంతో పని చేస్తున్నారు.
వ్యక్తిగత జీవితంలో…
ఎంతో మంది పేద పిల్లలకు మంచి భవిష్యత్‌ చూపుతున్న మంజు కుమారికి చిన్నతనంలోనే వివాహం జరిగింది. అయితే ఆ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. వ్యక్తిగత జీవితంలో అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటల నుండే ఆమె తన లక్ష్యంపై దృష్టి పెట్టారు. హింసాయుతమైనా బంధం నుండి విడిపోయి తిరిగి వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తన భర్త నుండి ఆమె పూర్తి మద్దతు పొందుతున్నారు. తన ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచేశారు. వారిద్దరూ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు.
విధులకు మించి
డిగ్రీ, పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన తర్వాత ఆమె రాంచీ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత తన వృత్తిపరమైన ప్రయాణం మొదలుపెట్టారు. డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (+2)లో ఒక దశాబ్దానికి పైగా హిందీ పాఠాలు బోధించారు. 2023లో BRC ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఈ కొత్త బాధ్యత సేవ చేయాలని నిత్యం తపించే మంజు కుమారికి మరింత స్వేచ్ఛను ఇచ్చింది. అడ్మినిస్ట్రేటివ్‌ విధులకు మించి ఆమె స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తారు. పాఠశాలల్లో సరైన పారిశుధ్యం కల్పించడంలో తన వంతు సహకరిస్తున్నారు. చదువు విషయంలో విద్యార్థులను ప్రేరేపిస్తున్నారు. తన పరిమిత వనరులలోనే పిల్లలకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ‘ఇప్పుడు నిజమైన వైవిధ్యం తీసుకువచ్చేందుకు నాకు సమయంతో పాటు ఓ వేదిక కూడా ఉంది’ అంటూ ఆమె పంచుకున్నారు.
మంచి ఫలితాలిచ్చాయి
మంజు కుమారికి చదువు పట్ల ఉన్న మక్కువ కేవలం బీహార్‌కే పరిమితం కాలేదు. రాంచీలో నివసిస్తున్నప్పుడు ఆమె కొంతకాలం పాటు ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. అక్కడ ఆమె గిరిజన కాలనీలను సంద ర్శించారు. ఆ పిల్లలు ఎప్పుడూ పాఠశాలకు వచ్చే వారు కాదు. అలాంటి పిల్లలను గుర్తించి వారంద రినీ ఓ దగ్గరకు చేర్చి పాఠాలు చెప్పేవారు. ఆమె ప్రయత్నాలు ఆ సంఘాల్లో మంచి ఫలితాలను ఇచ్చాయి. ‘వారి వద్దకే వెళ్లి నేను పాఠాలు చెప్ప డం మొదలుపెట్టిన తర్వాత తల్లిదండ్రులు చివరి కి తమ పిల్లలను పాఠశాలకు పంపడం ప్రారంభిం చారు, ఇది నేను సాధించిన గొప్ప విజయంగా నేను భావించాను’ అని ఆమె అన్నారు.
అడ్డంకులు తప్పలేదు
సేవా దృక్పథంతో ఆమె ప్రారంభించిన ఈ ప్రయాణానికి అడ్డంకులు తప్పలేదు. ప్రారంభంలో ఆమె ప్రయత్నాలకు అత్తమామలు, మొదటి భర్త నుండి ప్రతిఘటన ఎదురైంది. ఆమె తన సామాజిక సేవను కొనసాగించకుండా నిరుత్సాహ పరిచారు. అయితే వారి నుండి ఎంత వ్యతిరేకత వచ్చినా ఆమె పట్టుదలతో ఉన్నారు. ‘సేవా కార్యక్రమాల్లో నా ప్రయాణం అంత సులభం కాదు. కానీ నేను ఆగిపోవడానికి ఒప్పుకోలేదు. కచ్చితంగా నా ప్రయత్నం కొనసాగించాలని బలంగా నిర్ణయించుకున్నాను’ అని ఆమె పంచుకున్నారు. ప్రజల్లో తగ్గిపోతున్న సామాజిక బాధ్యత, నైతిక విలువల క్షీణతపై ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మారుతున్న పరిస్థితుల వల్ల ప్రజలు వ్యక్తిగత లాభాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సమాజానికి తమ వంతు సాయం చేయాలనే ఆలోచన పెద్దగా ఉండడం లేదు. అందుకే మా కమ్యూనిటీలలో సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని నేను భావిస్తున్నాను’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.