వందేండ్ల ప్రాజెక్టు మూడేండ్లలోనే కుంగింది

Hundred year project Within three years it collapsed– డిజైన్‌, నాణ్యతా లోపం, అవినీతి వల్లే దెబ్బతిన్న మేడిగడ్డ
– ఇంతటి అవినీతి ఎక్కడా జరగలేదు
– అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరం వందేండ్ల ప్రాజెక్టు కాగా మూడేండ్లలోనే కుంగిపోయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. డిజైన్‌, నాణ్యత లోపం,  అవినీతివల్లే మేడిగడ్డ దెబ్బతిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా ఇంత అవినీతి జరగలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర నీటిపారుదల రంగంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సర్కారు శాసనసభలో శ్వేతపత్రాన్ని శనివారం ప్రవేశపెట్టింది. ఉదయం సభ ప్రారంభమైన కాగానే నీటిపారుదల శాఖ మంత్రి ప్రసంగిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. మేడిగడ్డ బ్యారెజ్‌ కుంగిన అంశంలో నిమిషం నీడివి గల వీడియోను అసెంబ్లీలో విడుదల చేయడంతోపాటూ పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన ప్రారంభమైన సభలో మంత్రి ఉత్తమ్‌ దాదాపు గంటా 45 నిమిషాలపాటు పీపీటీ చూపిస్తూనే శ్వేతపత్రంపై మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసింది. కుంగిన బ్యారేజీ పిల్లర్‌ 20 కింద నుంచి పైవరకు పగుళ్లను వీడియో ద్వారా శాసనసభ్యులు, రాష్ట్ర ప్రజలకు చూపించారు. మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిపై మంత్రి నిప్పులుచెరిగారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఇంతటి అవినీతి ఎక్కడా లేదు
మేడిగడ్డ కీలక బ్యారేజీ అని మంత్రి చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ)తో మాట్లాడుతున్నాం. స్వతంత్ర భారతంలో సాగునీటి రంగంలో ఇంత పెద్ద అవినీతి ఎక్కడా జరగలేదు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌నే సభ ముందు పెట్టాం. ”మీరు తప్పుకుంటే బాగు చేస్తాం. కట్టింది మీరే, ఈ పరిస్థితి కారణమే మీరు.. ఇంకా మీకు అర్హత ఉందా?” అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో నాణ్యతా లోపం ఉందని ఎన్‌డీఎస్‌ఏ కూడా రిపోర్ట్‌ ఇచ్చింది. ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత ఎక్కడా పరిశీలన జరగలేదు. కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని’ మంత్రి స్పష్టం చేశారు.గత ప్రభుత్వ నిర్వాహకం, అవినీతి కారణంగా మేడిగడ్డ ఈస్థితిలో ఉంది..రూ.1800 కోట్లతో టెండర్లు పిలిచారు.ఆ తర్వాత అంచనా వ్యయం రూ.4500 కోట్లకు తీసుకెళ్లారు..అంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతున్నది. స్వతంత్ర భారతదేశంలో ఈ తరహా అవినీతి జరగలేదు. ఇకపై జరగబోయేది లేదు..గత ఏడాది అక్టోబరు 21న మేడిగడ్డ కుంగితే..మేం అధికారంలోకి వచ్చేవరకు ఏ ఒక్కరోజు కూడా మాజీ సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై స్పందించలేదు..ప్రాజెక్టులపై సలహాలు, సూచనలు ఇచ్చే అధికారం నేషనల్‌ డ్యామ సేఫ్టీ అథారిటీకి ఉంది. ప్రణాళిక, పర్యవేక్షణ లోపం, కారణంగానే మేడిగడ్డ దెబ్బతిందని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో స్పష్టంగా చెప్పిందని వ్యాఖ్యానించారు.
అన్నారం బ్యారేజ్‌లోనూ లీకేజీ..
అన్నారం బ్యారేజ్‌లో శుక్రవారం (16.2.) నుంచి లీక్‌ మొదలైంది. ఈ బ్యారేజ్‌ కూడా కుంగేలా ఉంది. ఎన్‌డీఎస్‌ఏ అధికారులను కూడా పిలిపించాం. బ్యారేజ్‌లో నీటిని కొంతమేర ఖాళీ చేయాలని ఎన్‌డీఎస్‌ఏ అధికారులు సూచించినట్టు తెలిపారు. అన్నారం బ్యారేజీకి కూడా ప్రమాదం ఉందని ఎన్‌డీఎస్‌ఏ అధికారులు చెప్పారన్నారు.
కాళేశ్వరం ఆర్థికంగా నిరుపయోగం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఆర్థికంగా పూర్తిగా నిరుపయోగమని మంత్రి చెప్పారు. 2019 జూన్‌ 19న కేసీఆర్‌ బ్యారేజ్‌ను ప్రారంభించారనీ, ప్రారంభించినప్పటి నుంచి నిర్వాహణ పట్టించుకోలేదు. రాష్ట్ర అవసరాలకు మొత్తం 160 మిలియన్‌ యూనిట్లు కరెంటు అవసరమైతే, ఒక్క కాళేశ్వరానికికే 203 మిలియన్‌ యూనిట్లు కావాలి. కరెంట్‌ ఖర్చే ఏడాదికి రూ.10,374 కోట్లు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.81వేల కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదం ఇచ్చిందనీ, కానీ రూ.1.47 లక్షల కోట్లకు వ్యయం పెరిగింది. ఇవాల్టి లెక్కల ప్రకారం ప్రాజెక్ట్‌ పూర్తికి రూ.2 లక్షల కోట్లు అవసరం. ప్రతీ రూపాయికి వచ్చే ప్రయోజనం 52 పైసలే అని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు లబ్ధి చేశారని కాగ్‌ నివేదిక తప్పుబట్టిందని చెప్పారు.
మల్లన్న సాగర్‌పై
ఎలాంటి సర్వే చేయకుండానే మల్లన్నసాగర్‌ నిర్మించారు. చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా మల్లన్నసాగర్‌కు ప్రమాదమే. ఆ పరిధిలోని ప్రజలకు ప్రమాదం ఉందని కాగ్‌ హెచ్చరించింది. నిజాంసాగర్‌ నిర్మించి వందేండ్లయినా పటిష్టంగానే ఉంది. మన సాగునీటి అవసరాలు సాగర్‌, శ్రీరాంసాగర్‌తో తీరుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ మన విద్యుత్‌ అవసరాలను తీరుస్తుందని మంత్రి వివరించారు.
బాధ్యులను వదలం
మీరు తప్పుకుంటే బాగు చేస్తామంటున్నారు..కట్టింది మీరే..ఈ పరిస్థితికి కారణమే మీరు..ఇంకా మీకు అర్హత ఉందా ? అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో నాణ్యతా లోపం ఉందని ఎన్డీఎస్‌ఏ కూడా చెప్పింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎక్కడా పరిశీలన జరగలేదు..కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి చెప్పారు.
కృష్ణాజలాల్లోనూ అన్యాయం
తెలంగాణకు న్యాయపరంగా కృష్ణానదీ జలాల్లో 68 శాతం వాటా రావాల్సి ఉందనీ, కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పుకున్నది కేవలం 38 శాతం నీటికేనని మంత్రి చెప్పారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్‌ఎస్‌ సర్కారు ఒప్పుకుంది. తెలంగాణకు 290 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్ర ప్రభుత్వానిఇ బీఆర్‌ఎస్‌ లిఖిత పూర్వకంగా అంగీకరించింది గత ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి సంతకాలు చేసిందనీ, కృష్ణా జలాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదని వ్యాఖ్యానించారు