భార్య గొంతు కోసిన భర్త

భార్య గొంతు కోసిన భర్తనవతెలంగాణ-బేల
మండలంలోని సైద్‌పూర్‌ గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య ఇంటి దగ్గర గొడవ జరిగింది. అది కాస్త పెద్దది కావడంతో భర్త ఎల్చాల లక్ష్మణ్‌ కత్తితో భార్య సునీత గొంతు కోశాడు. అనంతరం అదే కత్తితో తానూ గొంతు కోసుకున్నాడు. భార్య అక్కడికక్కడే చనిపోగా భర్త ప్రాణాలతో కొట్టుమిట్టడుతున్నాడు. స్థానికులు అంబులెన్సుకు ఫోన్‌ చేసి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి, జైనథ్‌ సీఐ సాయినాథ్‌, బేల పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సునీత, లక్ష్మణ్‌ ఎనిమిదేండ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతోనే గొంతు కోసి ఉంటాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సునీత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.