– ఇండ్ల నిర్మాణాలకు సహకారమందించాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాతఎర్ర చెరువులో పేదలు వేసుకున్న గుడిసెల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుచ్చలపల్లి సుందరయ్యనగర్‌లో గురువారం జరిగిన ఆటల పోటీల విజేతలకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి బహుమతులు అందజేశారు. అనంతరం మల్లు స్వరాజ్యం స్వారక భవనం ముందు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షత జరిగిన సభలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పాత ఎర్ర చెరువులో గుడిసెలు వేసుకున్న పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారందరికీ వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని కోరారు. నిలువ నీడ లేని నిరుపేదలు ఇంటి స్థలాల కోసం గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఇండ్ల నిర్మాణాలకు సహకారం అందించాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జె.వెంకటేష్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ప్రజలు, కార్మికులు, కర్షకులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడుదారులకు అనుకూలంగా మార్చారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరగనున్న సమ్మె, గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.రాజయ్య, పోలేం రాజేందర్, నాయకులు వీరాజయ్య, రజనీకాంత్, గుర్రం దేవేందర్, శ్రీకాంత్, ప్రీతి, లక్ష్మి, రవి, రమేష్ రాజేందర్, మహేందర్, శేఖర్, రజిని, పోలెం చిన్న రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.