– కొంత నగదుతో పాటు బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు అందజేత
– ఇంటి నిర్మాణానికి సహకరిస్తానని హామీ
నవతెలంగాణ-ఆమనగల్ : కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ తాండాకు చెందిన రాత్లావత్ కమ్లి సిత్యా నాయక్ కుటుంబం నివాసముంటున్న పూరి గుడిసె ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మెన్ ఉప్పల వెంకటేష్ కట్టుబట్టలతో పాటు నిత్యావసర సరుకులు, ఇతర ఇంటి సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతై నిరాశ్రయులైన కమ్లి సిత్యా నాయక్ కుటుంబానికి అండగా నిలిచారు. ఈమేరకు మంగళవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తక్షణ సహాయంగా కొంత నగదు, 50 కిలోల బియ్యం, నూనె, మిర్చి పౌడర్, పప్పు, పంచదార, గోధుమ పిండి తదితర 20 రకాల నిత్యావసర వస్తువులతో పాటు వారికి కావలసిన దుస్తులను స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. అదేవిధంగా సిత్యా నాయక్ ఇంటి నిర్మాణానికి సహకారం అందిస్తానని ఉప్పల హామీ ఇచ్చారు. అనుకోని సంఘటనతో నివాసముంటున్న గుడిసెతో పాటు నిత్యావసర వస్తువులు, బట్టలు అన్ని అగ్నికి ఆహుతై దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్న గిరిజన కుటుంబానికి నేనున్నానంటూ అన్నివిధాలా ఆదుకున్న ఉప్పల వెంకటేష్ ను బాధిత కుటుంబ సభ్యులతో పాటు, తాండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ అన్న సైన్యం, బీఆర్ఎస్వీ కల్వకుర్తి అధ్యక్షులు దారమోని గణేష్, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు రుక్ముద్దీన్, మాజీ సర్పంచ్ సోమ్లా నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్ళ సురేష్ గౌడ్, దేవయ్య, గుండ్యా నాయక్, లక్ష్మణ్, శ్రీను, పాండు, రాజు, బాబులాల్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.