– సమీక్షకు పిలిచేవరకు మాకు తెలియదు
– ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాలతోనే డీపీఆర్ మార్పులు
– క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై కమిషన్ ఆగ్రహం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన అప్పటి సీఎందేనని, ఉన్నతస్థాయి సమీక్షకు పిలిచేవరకు మాకూ ఎలాంటి సమాచారం తెలియదని మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. 2016లో సీఎం ఆదేశాలతో నిర్ణయం జరిగిందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు రిటైరైన ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరై విచారణ కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కమిషన్ చైర్మెన్ జస్టీస్ పీసీ ఘోష్ వారిని విచారించారు. ఆనకట్టల నిర్మాణం, నాణ్యత, నిబంధనలు, నిర్వహణకు సంబంధించి రెండో రోజూ సాగిన క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చైర్మెన్ అడిగిన పలు ప్రశ్నలకు మాజీ ఈఎన్సీ సమాధానమిచ్చారు. గతంలోనూ వెంకటేశ్వర్లును జస్టిస్ ఘోష్ విచారించిన సంగతి తెలిసిందే. గురువారం మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కాగా ఆయనపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాలు, ఫైళ్ల ఆధారంగా సమాధానాలు చెప్పాలంటూ వ్యాఖ్యానించింది. కమిషన్ ముందు నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాళేశ్వరం డీపీఆర్‌పై నిర్ణయం ఎప్పుడు, ఎవరు తీసుకున్నారనీ, సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాతే డీపీఆర్ మార్పులు జరిగాయా? అని కమిషన్ అడిగింది. దానికి వెంకటేశ్వర్లు అవునని సమాధానమివ్వగా, మార్పులు ఎవరు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాలతో మార్పులు జరిగినట్టు వివరించారు. మూడు ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని వ్యాప్కోస్ సూచించిందని చెప్పారు. ప్రభుత్వం, అధికారుల ప్రమేయం లేకుండానే వ్యాప్కోస్ ఎలా సూచిస్తుందని కమిషన్ ప్రశ్నించడం గమనార్హం.
ఇందుకు ఈఎన్సీ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పొంతనలేని సమాధానాల నేపథ్యంలో వెంకటేశ్వర్లుపై విచారణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలావుండగా తొలిరోజు నీటిపారుదల శాఖ ఆపరేషన్, మెయింటెనెన్స్ ఈఎన్సీ బి నాగేంద్రరావును కమిషన్ విచారించింది. ఏడో బ్లాక్‌లో లీకేజీలను నిర్మాణ సంస్థ గుర్తించింది కదా, కాంట్రాక్టర్లు, రామగుండం ఈఎన్సీ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగాయనీ, ఆ సమాచారం ఓఅండ్‌ఎంకు చెప్పల ేదని వ్యాఖ్యానించారు. బ్యారేజీల లోపలిభాగంలో నీటిని తొలగిస్తేనే నిర్వహణ పనులు చేయడానికి వీలుంటుందనే విషయాన్ని బ్యారేజీల బాధ్యులకు ఎందుకు చెప్పలేదనీ కమిషన్ నాగేంద్రరావును ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో నోటిమాటగా చెప్పానని ఈఎన్సీ బదులివ్వగా, లిఖితపూర్వకంగా సమాచారం పంపాలి కదా అని కమిషన్ పేర్కొంది. నాగేంద్రరావును దాదాపు మూడు గంటలపాటు వందకుపైగా ప్రశ్నలను సంధించింది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తికా కుండానే ధృవీకరణ పత్రం ఇచ్చేశారని కమిషన్‌కు ఈఎన్సీ వివరించారు. బ్యారేజీ దెబ్బతినడానికి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ర్యాఫ్ట్ కింద ఇసుక కదలడం కారణం కావొచ్చా అని కమిషన్ ప్రశ్నించగా, ఈఎన్సీ అవునంటూ సమాధానం చెప్పారు.