అక్రమాస్తులు రూ.100 కోట్లపైనే

The illegal assets are over Rs.100 crores– హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ బాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ మెరుపు దాడి
– తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న లక్షల రూపాయల నగదు, బంగారం, బినామీ ఆస్తులు
– నేడు కూడా కొనసాగనున్న దాడులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కింది. ఒకటి కాదు..రెండు కాదు..రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దాడుల్లో బట్టబయలయ్యాయి. తవ్వుతున్న కొద్దీ లక్షల రూపాయల నగదు, అత్యంత విలువైన బంగారు నగలు, భూముల రిజిస్ట్రేషన్ల పత్రాలు, బినామీ పేరిట ఉన్న ఆస్తులు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, రెరా ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న శివ బాలకృష్ణ అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ 14 ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించారు.
బుధవారం హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని శివ బాలకృష్ణ ఆస్తులు, కార్యాలయాలపై ప్రత్యేక బృందాలు మెరుపు దాడికి దిగాయి. ఉదయం 5 గంటలకే మణికొండలోని ఆదిత్య విల్లాలో గల బాలకృష్ణ నివాసంపై ప్రత్యేక టీమ్‌లు వెళ్లాయి. ఇంట్లో వారిని బయటకు వెళ్లనీయలేదు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంట్లో అణువణువూ సోదించాయి. శివబాలకృష్ణకు చెందిన బంధువుల నివాసాలపైనా అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బాలకృష్ణ నివాసంలో ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో దాదాపు రూ.40 లక్షల నగదుతో పాటు భారీగా ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.ఇంకోవైపు శివబాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు డిపాజిట్లు, లాకర్లను కూడా తెరవడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా వారికి ఏయే బ్యాంకుల్లో అకౌంట్లున్నాయనే అంశంపై శివ బాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులు అధికారులకు వివరాలు ఇవ్వకుండా భీష్మించినట్టు తెలిసింది. అయినప్పటికీ బాలకృష్ణకు చెందిన ఎస్‌బీఐ బ్యాంకు లాకర్ల తాళాలను అతిప్రయాసతో ఏసీబీ అధికారులు స్వాధీన పరుచుకున్నారు.
ఇప్పుడు లాకర్లను తెరిచే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మీద హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌గా, రెరా ప్రత్యేక కార్యదర్శిగా శివ బాలకృష్ణ ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులకు సంబంధించిన విలువను సమీక్షించిన అధికారులు వంద కోట్ల రూపాయలకుపైనే అక్రమాస్తుల విలువ ఉన్నట్టు తేల్చారు. అంతేగాక, ఇంకా బ్యాంకు లాకర్లలో ఏమున్నయాన్నది తేలాల్సి ఉంది. వీటితో పాటు మరికొందరు బంధువుల నివాసాల్లో కూడా అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. బాలకృష్ణ అక్రమ ఆదాయాలపై గురువారం కూడా దర్యాప్తు సాగుతుందనీ, వాటి మొత్తం వివరాలను దర్యాప్తు పూర్తి అయ్యాక ప్రకటిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.