ఇంటికొచ్చిన కోడలిని చితకబాదిన అత్తామాములు

– ఆరేళ్లుగా భర్త కోసం పోరాటం చేస్తున్న భార్య
– జడ్జి ముందే కోడలి తండ్రి పై మామ దాడి
– ఆరేళ్లుగా కనిపించని భర్త భాస్కరాచారి
– కోడలను వేధింపులకు గురి చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబం
– గుండె కుడివైపు ఉండడమే వివాదానికి కారణం
నవతెలంగాణ-బోనకల్‌
కోర్టు ఆదేశాలతో భర్త కోసం అత్తామామల ఇంటికి వచ్చిన కోడలను అత్తామామలు చితకబాదిన ఘటన బోనకల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆరేళ్లుగా భర్త కోసం భార్య పోరాటం చేస్తూనే ఉంది. బాధితురాలు తవుడోజు భవాని తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం పట్టణానికి చెందిన అబ్బనపురి వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె భవానితో బోనకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న తౌడోజు వెంకటేశ్వర్లు కుమారుడు భాస్కరాచారితో 2018లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద 13 లక్షల నగదు చెల్లించినట్లు భవాని తెలిపింది. వివాహ సమయంలో భాస్కరాచారి ఐఎల్స్‌ (విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ) శిక్షణ ఇస్తారని తమకు తెలిపినట్లు భవాని తెలిపారు. శిక్షణ నిమిత్తం విజయవాడ, హైదరాబాద్‌, వరంగల్‌ వెళుతుంటారని చెప్పారు. వివాహం జరిగిన 18 రోజులకే మామ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు భర్త భాస్కరాచారి భవానీతో గొడవలకు దిగారు. భవానీకి కుడి చేయి వైపు భాగంలో గుండె ఉందని మీ బంధువులే చెప్పారని అందువలన భవాని మాకు వద్దని భర్త భాస్కరాచారి, మామ వెంకటేశ్వర్లు గొడవలకు నాంది పలికారు. ఆ రోజు నుంచి భవానితో భర్త భాస్కరాచారి కుటుంబం వివిధ రూపాలలో వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో భవాని తనను అత్తామామలు, భర్త వేధింపులకు గురి చేస్తున్నారని ఖమ్మం మహిళా పోలీస్‌ స్టేషన్‌ లో 2019లో ఫిర్యాదు చేసింది. దీంతో భర్త అత్తామామలపై వేధింపులు కేసు నమోదు చేశారు. ఆ రోజు నుంచి భర్త అత్తమామలు ఖమ్మం కోర్టు చుట్టూ వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు. కోర్టు కేసు నిమిత్తం భవాని ఆమె తండ్రి వెంకటేశ్వర్లు ఖమ్మం కోర్టులో హాజరయ్యారు. అయితే అదే సమయంలో మామ వెంకటేశ్వర్లు జడ్జి ముందే భవాని తండ్రి వెంకటేశ్వర్లపై దాడి చేశాడు. దీంతో జడ్జి తీవ్రంగా స్పందించి వెంటనే హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ను సస్పెండ్‌ చేయాలని పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అదేరోజు వెంకటేశ్వర్లను సస్పెండ్‌ చేస్తూ పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత భవాని మెయింటినెన్స్‌ కోసం కోర్టులో కేసు వేసింది. దీంతో ఖమ్మం కోర్టు భవానీకి ప్రతినెల 15,000 రూపాయలు ఇవ్వాలని 2019లో భర్త భాస్కరాచారికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో మరల భవాని హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కూడా నెలకు పది వేల రూపాయలు మనోవర్తి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయడం లేదు. 2022లో ఖమ్మం కోర్టులో విచారణ సందర్భంగా పంచాయతీ రాజీమార్గం ద్వారా పెద్దమనుషుల ద్వారా తనకు 13 లక్షల రూపాయలు ఇస్తానని అంగీకరించి కూడా దానిని కూడా అమలు చేయలేదని భవాని తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు బోనకల్లు మండల కేంద్రంలో నివాసము ఉంటున్న అత్తామాములు ఇంటి వద్దకు భవాని తన తల్లి విజయలక్ష్మితో కలిసి వచ్చింది. ఆ సమయంలో అత్తామామలు వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ ఇంట్లోనే ఉన్నారు. భవాని పిలవటంతో మామ తలుపు తీశాడు. తల్లి విజయలక్ష్మి బయట నిలబడి ఉంది. భవాని ఇంట్లోకి వెళ్ళగానే తలుపులు వేసి అత్తమామలు రక్తం వచ్చేవరకు భవానిని చితకబాదారు. తన భర్త తనకు దక్కే వరకు, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. అనంతరం మామ వెంకటేశ్వర్లు కోడలు, ఆమె తల్లిదండ్రులపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా భవాని కూడా తనను కొట్టారని అత్తమామలపై స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ కడగండ్ల మధుబాబు రంగ ప్రవేశం చేశారు. గాయాల పాలైన భవానీని ఎస్సై మండల కేంద్రంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు.
ఈ సంఘటనపై సీఐ మధు ఆరా
ఈ సంఘటనపై మధిర సీఐ దొంగరి మధు బోనకల్‌ పోలీస్‌ స్టేషన్కు వచ్చి ఆరా తీశారు. ఎస్సై మధుబాబును అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని సీఐ మధు తెలిపారు.