ఆలయ అధికారులుగా ఇన్‌చార్జీలే గతి

– ఇతర దేవాలయాలు ఉండటంతో వారానికి ఒకసారే రాక
– రెగ్యులర్‌ అధికారి లేకపోవడంతో పర్యవేక్షణలో లోపాలు
– నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న సిబ్బంది
– గత 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉద్యోగులు
– నూతన ప్రభుత్వమైన ఆలయంపై దృష్ట్టి సారించానే..?
నవతెలంగాణ-ఎర్రుపాలెం
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన మహా దివ్యక్షేత్రమైన స్వయంభు (వెలసిన ఆలయం) జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి గత సుమారు పది సంవత్సరాల నుండి ఇన్‌చార్జీ కార్యనిర్వహణాధికారులతో కాలం గడుపుతున్నారు. రెగ్యులర్‌ అధికారిని ప్రభుత్వాలు నియమించక పోవడంతో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టవచ్చునట్లు కనపడుతుందని భక్తులు విమర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సరిహద్దులో గల దేవాలయం కావడంతో ఆంధ్ర నుండి పెద్ద మొత్తంలో భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారు. విజయ వాడ, గుంటూరు తదితర జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. చాలా మంది భక్తులు జమలాపురం గ్రామంలో గల దేవాలయం కావడంతో జమలాపురి అని పేర్లు పెట్టుకుని చాలా మంది వాడుకలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం దేవాలయం తర్వాత రెండవ దేవాలయం గాను ప్రస్తుత ఖమ్మం జిల్లాలో ప్రథమ దేవాలయం తెలంగాణ తిరుపతిగా పిలవబడుతున్న ఎంతో ప్రాధాన్యత కలిగిన దేవాలయానికి ఇన్చార్జి అధికారులే తప్ప రెగ్యులర్‌ అధికారులను ని యమించక పోవడం శోచనీయం. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలపై బడి ఆదాయం కలిగిన దేవాలయం 6ఏ టెంపుల్‌గా అసి స్టెంట్‌ కమిషనర్‌ హౌదా కలిగిన దేవాలయానికి తక్కువ కేడర్‌ కలిగిన అధికారులను ఇన్చార్జీలుగా నియమించటంతో ఆలయ అభివృద్ధి కుంటుపడుతుంది. సిబ్బందిపైన పర్యవేక్షణ లేక పోవడంతో ఆలయంపైన దుష్ప్రచారాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. గత శని, ఆది, సోమవారం మూడు రోజుల లడ్డూ ప్రసాదం భక్తులకు విక్రయించిన నగదును సదరు ఉద్యోగి బెట్టింగులలో వాడుకున్నాడని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపైన ఇన్చార్జ్జీ కార్య నిర్వహణ అధికారి జగన్మోహన్రావు అది కేవలం దు ష్ప్రచారం మాత్రమేనని, మీడియా మిత్రులకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి అధికారుల పాలనలో నిర్వహించబడవలసిన దేవాలయం ఆ స్థాయి హౌదా కలిగిన అధికారి లేకపోవడం వల్ల పర్యవేక్షణ కరువైంది.
ఆలయానికి ప్రధాన సమస్య
గత 30 సంవత్సరాల నుండి ఈ దేవాలయంలోనే ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఎటువంటి ట్రాన్స్‌ ఫర్‌లు చేయకపోవడంలో వారి ఆడిదే ఆటగా సాగుతోంది. ఈ దేవాలయంలో పని చేస్తున్న 80 శాతం సిబ్బంది స్థానికులు కావడం, దీర్ఘ కాలంగా ఇక్కడే పని చేస్తున్నారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ హౌదా కలిగిన రెగ్యులర్‌ కార్యనిర్వహధికారిని నియమించితే నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టి సారించి రెగ్యులర్‌ కార్యనిర్వహణాధికారిని నియమించాలని భక్తులు గ్రామస్తులు కోరుతున్నారు.
ఆలయానికి ఆంధ్ర బస్సులే గతి
ఈ దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి ఒక్క బస్సు కూడా ఆలయానికి నడపటం లేదు. తెలంగాణ దేవాలయానికి ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చే బస్సులే గతి తప్ప, కూతవేటు దూరంలో గల మధిర డిపో నుండి తెలంగాణ డిపోల నుండి ఒక్క బస్సు కూడా తిప్పు తున్న పాపాన పోలేదు. భక్తులు రాక పోకలకు బస్సులు లేక పోవడంతో నానా ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహాన్ని వెల్ల బుచ్చుతున్నారు. ఎంత మంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు భక్తులు ఈ విషయం వారి దృష్టికి తీసుకు వచ్చిన పట్టించుకున్న నాధుడే లేడని భక్తులు విమర్శిస్తున్నారు. తెలంగాణ డిపో నుండి బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు.