– గురుకుల పాఠశాలలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి
– ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి కేవీపీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో చదువుతూ మరణించిన విద్యార్ధుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని,ఆయా ఘటనలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్‌్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ కులాల అభివృద్ది శాఖా ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్‌కు సంఘం అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్కైలాబ్ మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థుల మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదేనని తెలిపారు. వైష్ణవి, అస్మితల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనీ, రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు లేదా ఐదెకరాల భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల జీవితాలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెేవీపీఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కోట గోపి, రాష్ట్ర కమిటీ సభ్యులు బాలపీరు, వైష్ణవి తల్లిదండ్రులు దగ్గుపాటి వెంకన్న, భాగ్యమ్మ హస్మిత, తల్లి ఇరుగు జ్యోతి టీఎస్‌ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకులు పాలడుగు పరుశరాములు, నాయకులు సొమపంగు నర్సయ్య, క్రాంతి పాల్గొన్నారు.