మెస్‌చార్జీల పెంపు హర్షనీయం

– ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలను ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెస్‌ చార్జీలను మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రూ.950 నుంచి రూ.1,330 వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.1,110 నుంచి రూ.1,540 వరకు, ఇంటర్‌ నుంచి పీజీ వరకు రూ.1,500 నుంచి రూ.2,100 వరకు పెంచిందని తెలిపారు.
కాస్మోటిక్‌ చార్జీలు మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థినులకు రూ.55 నుంచి రూ.175 వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థినులకు రూ.75 నుంచి రూ.275 వరకు, అబ్బాయిలకు మూడు నుంచి ఏడో తరగతి వరకు రూ.62 నుంచి రూ.150 వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి అబ్బాయిలకు రూ.62 నుంచి రూ.200 వరకు పెంచుతూ జీవో 9ని ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ చార్జీల పెరుగుదలతో విద్యార్థినీ, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. గురుకుల పాఠశాలల టైం టేబుల్‌ మార్పు, డిప్యూటీ వార్డెన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరారు.