”ఇప్పుడు సినీ ఇండిస్టీ అంతా వెళ్లి సీఎం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏమోచ్చింది’ అని అంటూ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా స్పందించారు.
సినిమా ఇండిస్టీ పెద్దలు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏర్పడిన పరిణామాలపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో తప్పయితే జరిగింది. ఈ తప్పు జరిగిన తర్వాత దానిని కవర్ చేయడానికి మళ్లీ కొన్ని అబద్దాలు ఆడటంతో గవర్నమెంట్ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అలాగే బన్నీ కూడా అదే రీతిలో తీసుకోవడంతో పెద్ద వివాదంగా మారిపోయింది.
ఫైనల్‌గా ఇండిస్టీ పెద్దలందరూ సీఎం దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. దీనిని కాంప్రమైజ్ అనాలో, లేక తలవంపులు అనాలో.. ఏమనాలో నాకు తెలియదు. ఒక్క మనిషి కోసం, ఒకే ఒక్కడి కోసం, ఒకడి ఇగో కోసం ఇంతమంది తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారు. దానికి అనుగుణంగా హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కారుల్లో వెళ్లాలి. రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. అలా కాకుండా సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే, సంథ్య థియేటర్‌లాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అభిమానులు, ప్రజా శ్రేయస్సు గురించి కూడా హీరోలు ఆలోచించాలి. హీరోలు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు పోటీపడుతున్నారు. టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద ఆ భారం వేస్తున్నారు. హీరోలందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. కలెక్షన్స్‌పరంగా కాదు పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగువారికి గర్వకారణంగా నిలవాలి’ అని తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా స్పందించారు.