రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతు న్నదని మంత్రి కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. 2014 నుండి ఇప్పటివరకు 19,454 కొత్త పరిశ్రమలు వచ్చాయని, 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని అంటున్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 11.6శాతం వాటా ఉత్పత్తి రంగం, 3శాతం వాటా మైనింగ్ రంగానిదని లెక్కలు చెబుతున్నాయి. వాస్తవం ఉండవచ్చును. ఈ అభివృద్ధిలో ప్రభుత్వం యజమానులకే పెద్ద పీట వేస్తున్నది. కార్మికుల శ్రమకు విలువ ఇవ్వడం లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా రూ.4,000 కోట్లు పారిశ్రామికవేత్తల రాయితీల కోసమే కేటాయించారు. వందల ఎకరాల భూములు, మౌలిక సదుపాయాలు, వందల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇచ్చినా యాజమాన్య సంఘాలైన సిఐఐ, ఎఫ్‌టిసిసిఐలు కార్మికుల వేతనాలు పెంచకుండా అడ్డుకుంటున్నాయి.
ప్రతి ఐదేండ్లకొకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వేతనాలు సవరించాలి. కానీ 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేతనాలు సవరించలేదు. రాష్ట్రంలో 75షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లోని కార్మికులకు కనీస వేతనాలు సవరించబడలేదు. ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న సుమారు కోటి మందికి పైగా ఉన్న కార్మికుల శ్రమను యజమానులు పిండుకుంటున్నారు. పెరిగిన శాస్త్ర సాంకేతికత దృష్ట్యా కేంద్ర దోపిడీ యంత్రాల మీద తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా పని గంటలు తగ్గించాలని కార్మికవర్గం కోరుకుంటున్నది. మన దేశంలో కూడా రోజుకు 7గంటల పని, వారానికి 5రోజుల పని దినం ఉండాలని కోరుతున్నాం. కోట్లాది కార్మికులు ప్రతిఘటించినా కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోని మంద బలంతో నాలుగు లేబర్ కోడ్‌లను తీసు కొచ్చింది. సంఘాలు పెట్టుకోడానికి ఆంక్షలు పెట్టింది. స్వాతంత్య్రానికి పూర్వం, ఆ తర్వాత కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నది. మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్ పేరిట రోజుకు రూ.178గా నిర్ణయించింది. ఈ వేతనంతో కార్మికులు ఎలా బతకగలుగుతారు? ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకొని రాష్ట్రంలో వేతనాలు పెంచడం లేదు. తెలంగాణలోని స్థానికులకు పరిశ్రమల యజమానులు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది స్థానికులకు పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు చెప్పాలి. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో కాంట్రాక్ట్ కార్మికులు నూటికి 90శాతంపైగా ఉంటున్నారు. హమాలీలు మొదలుకొని భారీ పరిశ్రమలోని స్కిల్డ్ వర్కర్స్ వరకు వలస కార్మికులే అత్యధికంగా ఉంటున్నారు. ఇందులో 80శాతం బీహార్, ఒరిస్సా, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర వలస కార్మికులే ఉన్నారు. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ గానీ, 1979 అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారం పీఎఫ్, ఈఎస్‌ఐ సెలవులు, బోనస్, గ్రాట్యుటీ ఇతర సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు అమలు చేయడం లేదు. చట్టబద్ధంగా రోజుకు 8గంటల పని దినం బదులు 12 గంటలు పని చేయించుకుంటున్నారు. ఓవర్ టైం వేతనాలు ఎక్కడా చెల్లించడం లేదు. అనేక భారీ పరిశ్రమంలో కాంట్రాక్టు, క్యాజువల్, ట్రైనీలు, లాంగ్‌టర్మ్ ట్రైనీలు, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ నీమ్, న్యాప్స్, న్యాట్స్ లాంటి అప్రెంటీస్ స్కీమ్‌ల ద్వారా నియమింపబడిన వారిని ఉత్పత్తిలో శాశ్వత కార్మికులతో సమానంగా పని చేయిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. వలస కార్మికులనైతే కంపెనీల ఆవరణలో చిన్న చిన్న గదులలో 10 నుంచి 15 మందిని పెట్టి కనీస సౌకర్యాలు లేకుండా బానిసల మాదిరి గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం లేదా కార్మికశాఖ పర్యవేక్షణ లేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం కార్మికశాఖ అధికారుల కోరలు పీకింది. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో 2021 జూన్‌లో 5 రంగాలకు జీఓ లిచ్చింది. కనీస వేతనం రూ.18,019గా నిర్ణయించింది. విడిఏ రూ.12గా నిర్ణయించారు. కానీ యజమానుల ఒత్తిడికి లొంగి గెజిట్ చేయలేదు. 2012లో నిర్ణయించబడిన కాంటాక్ట్ లేబర్ కనీస వేతనం రూ.5,579లే నేటికి అమలవుతున్నది. వీడీఏతో కలిపినా రూ.12,000లకు మించడం లేదు. మిగిలిన రంగాల్లో కూడా ఇంతకన్నా తక్కువ బేసిక్‌లతో కార్మికులు వేతనాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే ఎక్కువ వేతనాలున్నాయని బుకాయిస్తున్నది. కనీస వేతనాల విషయంలో కార్మికులను మభ్యపెట్టి యజమానులకు లాభం చేకూర్చుతున్నది. కనీస వేతనం రూ.26,000లు ఉండాలని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ ధర రూ.1,350లు, లీటర్ పెట్రోల్ రూ.120లు, డీజిల్ రూ.110, నిత్యావసర సరకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలను పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, చివరికి సర్పంచుల వరకు కూడా వేతనాలు పెంచుకున్నది. పారిశ్రామిక కార్మికుల పట్ల మాత్రం వివక్ష చూపిస్తూ పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తున్నది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. 1957 సంవత్సరం 15 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం, 1991 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికుల కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. 2014 తర్వాత రెండుసార్లు కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేసింది. కనీస వేతన సలహా మండలి ప్రతిపాదనల మేరకు కార్మికశాఖ ద్వారా కాలపరిమితి ముగిసిన అన్ని జీఓలను సవరిస్తూ ప్రతిపాదనలు తెప్పించుకున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల కోసం 2015 సంవత్సరం నుండి వేతనాల ఫైళ్ళు సచివాలయంలో మూలుగుతున్నాయి. ఈ స్థితి మారాలని కార్మికులు కోరుతున్నారు.
– భూపాల్