శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడు విభాగాలనీ, వీటి మధ్య స్పష్టమైన పని విభజన ఉంటుందని మనం నిరంతరం వింటాం. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు పాలన చేస్తాయి. వారు నియమించిన అధికారులు యంత్రాంగాన్ని నడిపిస్తారు. వీటి పనితీరును, చేసే శాసనాలనూ, నిర్ణయాలను అవసరమైనప్పుడు, సమస్య వచ్చినపుడు కోర్టులు సమీక్షిస్తాయి. ప్రయివేటురంగంలోని మీడియాను ఫోర్త్ ఎస్టేట్(నాలుగో స్తంభం) అని అందుకే అంటుంటారు గాని అది వ్యవహారంలోనే. ఎందుకంటే మిగిలిన మూడు వ్యవస్థలూ రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే పనిచేయవలసి ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఏది సరైంది, ఏది కాదు అని భాష్యం చెప్పేది మాత్రం అంతిమంగా న్యాయస్థానాలే. అంటే హైకోర్టు, సుప్రీం కోర్టులే. వీటినే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానా లంటారందుకే. మిగిలిన విభాగాలు రాజకీయాలతో నడుస్తుంటాయనీ, న్యాయవ్యవస్థ అందుకు అతీతంగా ఉంటుందని ఒక భావన నిరంతరం ప్రచారం చేస్తుంటారు. నిజానికి న్యాయవ్యవస్థ కూడా అప్పుడున్న రాజకీయార్థిక వ్యవస్థపరిధిలోనే నడుస్తుందనేది వాస్తవం. చట్టం వ్యవస్థపై ఆధారపడివుంటుంది గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదనేది కారల్ మార్క్స్ స్పష్టీకరించిన సత్యం. అందుకే మన కోర్టులలో ప్రయివేటీకరణనూ, కార్మికుల హక్కులనూ గాక యజమానుల పెట్టుబడిదారుల ప్రయోజనాలకే ఎక్కువ రక్షణ లభిస్తుంటుంది. ప్రాథమిక హక్కులపై పాలకుల దాడి జరిగితే భిన్నమైన తీర్పులు వస్తుంటాయి. ఇదేగాక కీలక సమస్యలపై వాటి నిర్ణయాలు, నిర్దేశాలు, పరిణామాలను ప్రభావితం చేస్తుంటాయి. ఈ సమయంలోనే మన దేశంలో చూస్తే కాశ్మీర్370 రద్దు, మణిపూర్ మంటలు., మందిరాల సమస్యలు, పౌరసత్వ సవరణ చట్టం, ఫిరాయింపు నిరోధ చట్టం, సనాతన వివాదం నుంచి కొందరు నాయకులపైన కేసుల దాకా సుప్రీం కోర్టు ముందే ఉన్నాయి. వివిధ హైకోర్టుల ముందు కూడా చాలా కేసులు నడుస్తున్నాయి. తెలంగాణలో ముగ్గురు శాసనసభ్యుల సభ్యత్వం చెల్లదని దిగువ కోర్టులు తీర్పులు ఇస్తే సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అవినీతి ఆరోపణల కేసు కూడా అక్కడే ఉంది. రాజధాని విషయం కూడా తేలాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎంఎల్‌సి కవితపై ఈడి విచారణ కేసు వంటివి కూడా సుప్రీం ముందే ఉన్నాయి. ఈ కేసుల్లో తీర్పులు, ఆదేశాలు దేశ పరిణామాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కనుక కోర్టుల నిర్ణయాలు దేశాన్ని ఇంతగా ప్రభావితం చేస్తుంటే న్యాయవ్యవస్థకూ, రాజకీయాలను సంబంధం లేదని చెప్పడం సరైందేనా?
లీగల్ ముసుగులో రాజకీయాలు
న్యాయమూర్తులు రాజకీయాలకూ, ప్రజా జీవితానికి దూరంగా ఉంటారు. మీడియాతో మాట్లాడరు. కోర్టులో తప్ప మరెక్కడా వ్యాఖ్యానాలు చేయరు. న్యాయస్థానంలో వారు చేసే వ్యాఖ్యలకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఇక అప్పుడప్పుడూ కొందరు నోరు జారి లేదా భావాలు దాచుకోలేక చేసే తిరోగామి వ్యాఖ్యలు వ్యక్తిగత పొగడ్తలు వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. అన్నిటినీ మించి కాని వారి తీర్పులు మాత్రం ఈ విషయాలపై దిశా నిర్దేశం చేస్తాయి. మంచి చెడ్డలు నిర్దేశిస్తాయి. అలాంటి కీలకపాత్ర వహించే వ్యవస్థ సారథులైన న్యాయమూర్తులు రాజకీయ అవగాహన లేదా అంచనా లేకుండా పని చేయగలరా? కేవలం నిర్జీవమైన నిబంధనలే వారిని నడిపిస్తాయా? ఈ ప్రశ్న సామాన్యులను వేధిస్తూనే ఉంటుంది.
దేశ వ్యాపితంగానే కొందరు న్యాయమూర్తుల గురించి బహిరంగ విమర్శలు వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. స్వయంగా అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన వారే పదవీ విరమణ వెంటనే రాజకీయ పదవులు తీసుకోవడం కూడా విమర్శలకు కారణమవుతుంటుంది. వ్యక్తిగతంగా మరికొందరు ఆరోపణలు మూటగట్టుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే అసలు వృత్తిగతంగానే న్యాయమూర్తులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారా? పరిగణనలోకి తీసుకోరా? ఈ ప్రశ్నలపై ఈ మద్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రఖ్యాత లీగల్ పాత్రికేయుడైన గౌతం భాటియా రాసిన ‘అన్‌సీల్డ్ కవర్స్’ (అతికించని వర్తమానాలు) పుస్తకం విడుదల అందుకు వేదికైంది. తర్వాత వచ్చినసమీక్షలూ అదే అంశాన్ని సృశించాయి. ఒరిస్సా హైకోర్టు మాజీ సిజె జస్టిస్ మురళీధర్ ఈ సభలో కీలకోపన్యాసం చేస్తూ న్యాయమూర్తుల నిర్ణయాలను రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తుంటాయని స్పష్టం చేశారు. ”రాజకీయాలు న్యాయవ్యవస్థ పనితీరు ఒకదానితో ఒకటి అంత కంతకూ కలగాపులగమవుతోందని వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో రాజకీయ సమస్యలే న్యాయ సమస్యలుగా కోర్టుల ముందుకు వస్తున్నాయి. జడ్జిలు రాజకీయ ఎంపికలు చేసుకోవలసి వస్తుంది. వారు తాము తటస్తులమని అనుకోవచ్చు. కాని ఈ రెండు వ్యవస్థల పని కోరుకున్నంత విడివిడిగా ఉండదు. మనం, ఏ బట్టలు ధరించాలి, ఏ ఆహారం తినాలి, ఏం మాట్లాడాలి? ఇవన్నీ ఇప్పుడు రాజ్యాంగ సమస్యలైపోతున్నాయి. దాంతో జడ్జిలు కూడా ఏదో ఒక దాన్ని ఎంచుకోవలసి వస్తుంది. ఆ ఎంపిక బహిరంగంగానే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. జడ్జిలు ఎక్కడి ఎక్కడ నుంచి వస్తారు? వారు కచ్చితమైన అభిప్రాయాలతోనే ఉంటారని గౌతం భాటియా పుస్తకం మనకు చెబుతుంది. చాలా రాజకీయ సమస్యలు లీగల్ ముసుగువేసుకుని కోర్టుల ముందుకొస్తాయి. ఉదాహరణకు హిజాబ్ సమస్య ఉంది. ఈ రోజు (సెప్టెంబర్14) రెండు వార్తా కథనాలున్నాయి. ఒకటి లక్ష ద్వీప్‌లో ఆహారస్వేచ్చకు సంబంధించింది, మరొకటి కేరళలోని ఒక దేవాలయంలో పతంగులు ఎగరేయడానికి సంబంధించింది” అని ఆయన అన్నారు.
న్యాయస్థానాల వార్తలకు కత్తెర
నిజానికి జస్టిస్ మురళీధర్ సీనియారిటీ చాలా ఎక్కువైనప్పటికీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించబడకుండా నరేంద్రమోడీ ప్రభుత్వమే అడ్డుపడిందని దేశమంతటికీ తెలుసు. పరస్పరామోదంతో స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూడరాదని ఆయన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు సజ్జన్‌కుమార్‌ను 1984 సిక్కు హత్యాకాండలో కేసులో శిక్ష విధించడం, యూపీలోని హష్మీపూర్‌లో 38మంది ముస్లిముల హత్యకు కారణమైన 16మంది పోలీసులకు శిక్షవిధింపు, ఎల్గార్ పరిషత్ కేసులో గౌతంనౌలఖాకు బెయిలు మంజూరు వంటి తీర్పులు ఆయన సంచలనాల్లో కొన్ని, ఆయన ఆగస్టు 7న పదవీ విరమణ చేసినప్పుడు మాజీ సీనియర్ న్యాయమూర్తులు చాలామంది సంయుక్త ప్రకటనలో ఆవేదన వెలిబుచ్చారు కూడా. ఈ విధమైన నేపథ్యం ఉన్న న్యాయమూర్తి గనకనే ఇంత నిష్కర్షగా మాట్లాడగలిగారు. ఇప్పుడు మీడియా న్యాయవార్తల రిపోర్టింగు సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడింది చూస్తే మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా వార్తలు మీడియా యాజమాన్యాలు ముందే ఆపేస్తుంటాయి. మరోవైవు ఎంపిక చేసిన వారికే అనుకున్నవి లీక్ చేస్తుంటారు. ఆపేసిన వార్తలతో ఒక సంపుటం గనక ప్రచురిస్తే ఎంత సమాచారం నిలిపివేయబడుతుందో అర్థమవుతుంది. ఇన్ని మల్లగుల్లాల మధ్యమన పత్రికలు లేదా ఛానళ్ల వార్తలలో వాస్తవికత ఎంత మిగులుతుందనేది ఆలోచించుకోవలసిందే! నిజానికి కోర్టు గదులలో జరిగే తతంగంపై గౌతం భాటియా చాలా సమాచారం ఇచ్చారు.
2013-2022 మధ్య కాలంలో న్యాయవ్యవస్థ తీరుపైన ఈ పుస్తకంలో వ్యాసాలుంటాయి. ఈ కాలంలో ఎన్ని కేసులు ఏ స్థితిని ఎదుర్కొన్నాయో ఆయన రాశారు. వ్యక్తిగతగోప్యత(ప్రైవసీ) స్వలింగవివాహాలు, జాతీయ బయో మెట్రిక్ గుర్తింపు వ్యవస్థ, హిజాబ్ నిషేదం, రిజర్వేషన్లతో సహా ఎన్నో సమస్యలు పతాకశీర్షికలకు వచ్చాయి. తీవ్ర ప్రభావం చూపే కేసులను సకాలంలో విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి అధికారాలు, కీలకమైన ప్రాథమిక హక్కుల రక్షణలో అధికార వర్గానికి నిర్దేశం చేసేందుకు సిద్ధపడకపోవడం వంటివన్నీ న్యాయవ్యవస్థ స్వాతంత్రం గురించి క్లిష్టమైన ప్రశ్నలు లేవనెత్తాయి. వేళ్లూనుకుపోతున్న పాలక వర్గం, న్యాయవ్యవస్థ మధ్య సంబంధాల గురించి తీవ్ర సందేహాలు కలిగించాయి అని ఆయనంటారు. హక్కులకు సంబంధించిన మొదటి భాగంలోనే భాటియా సామాజిక న్యాయం రిజర్వేషన్లు శరణార్థులు, కాశ్మీర్ 370 అధికరణం వంటి అంశాలు చర్చించారు. రెండోభాగంలో ఫెడరలిజం, ఫిరాయింపుల నిరోధ చట్టం అన్వయం వంటివి తీసుకున్నారు.
ప్రధాన న్యాయమూర్తుల తీరు
మూడో భాగంలో న్యాయవవస్థ, ప్రత్యేకించి తను చూసిన కొందరు ప్రధానన్యామూర్తుల తీరు తెన్నులను విశ్లేషించారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జెఎస్. ఖెహర్, దీపక్ మిశ్రా, రంజన్ గోగోరు, శరద్‌బాబ్డే, ఎన్‌వి రమణ, యుయు లలిత్, ఖాన్ విల్కర్‌ల కాలాన్ని పరిశీలించారు. జస్టిస్ ఖాన్‌విల్కర్ మానవహక్కుల విషయంలో వ్యవహరించిన తీరును విమర్శనా పాత్రంగా తెలిపారు. ‘ఉపా’ చట్టం కింద ఎవరినైనా చట్ట వ్యతిరేకిగా ముద్రవేసి ప్రాసిక్యూషన్ మోపిన కేసులో నిర్దోషిత్వం నిరూపించుకునే బాధ్యత వారిపైనే మోపడం దారుణమైన విషయం. జరూర్ వతలి కేసులో ఢిల్లీ హైకోర్టు అందుకే కేసు మూలాల్లోకి వెళ్లి అది లోపభూయిష్టంగా ఉందని తేల్చింది. కాని జస్టిస్ ఖాన్‌విల్కర్ దీన్ని తప్పుపట్టారు. అంత లోతుల్లోకి వెళ్లాల్సింది కాదని తీర్పునిచ్చారు. మనీ లాండరింగ్ కేసులో తప్పుగా ఉన్న ప్రతి అంశాన్ని ఆయన సమర్థించారు. పోలీసుల హత్యాకాండపై నిరసన తెలిపినందుకు ఆదివాసులకు శిక్ష వేశారు. గుజరాత్ మతమారణకాండపై సిట్ నివేదికను సవాలు చేసినందుకు గాను తీస్తా సెతల్వాడ్‌పైకి పోలీసులు విరుచుకుపడటానికి కారకులైనారు. ఇన్ని కారణాల వల్ల ఖాన్ విల్కర్‌ను భాటియా అతి తీవ్రంగా విమర్శించారు. మీరు కోర్టుకు రావడానికి స్వాతంత్రం ఇవ్వగలను గాని వచ్చిన తర్వాత స్వతంత్రం ఉంటుందా లేదా గ్యారంటీ ఇవ్వలేను అన్న ఆయన వాక్యాన్ని 32వ అధికారణానికి ఎసరు పెట్టడం వంటిదిగానే పరిగణించారు. జస్టిస్‌లలిత్ హయాంలో జిఎన్ సాయిబాబాకు ముంబాయి హైకోర్టు ఉపశమనం కలిగిస్తే జస్టిస్ లలిత్ రాత్రికి రాత్రే దాన్ని తిరగదోడారు. ఇక జస్టిస్ జిఎంషా విషయానికొస్తే ఆయన సాయిబాబాను మళ్లీ జైలుకే పంపేందుకు హడావుడిగా ఆదేశాలిచ్చారు. మొత్తం మీద ఈ పుస్తకం చదివితే న్యాయవ్యవస్థ వాస్తవ రూపం, దాని అంతర్గత రాజకీయాలు, అధినేతల ఒత్తిళ్లు అనేకం ప్రజల దృష్టికి రాకుండా పోతున్నాయనే పరమ సత్యం అవగతమవుతుంది.
తెలకపల్లి రవి