కార్యదీక్షాపరుడు కామ్రేడ్‌ కాచం కృష్ణమూర్తి

నాడు తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతున్న రోజుల్లో, నల్లగొండ జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి జనగాం తాలూకాకార్యాచరణ, అంకితభావానికి ఆయన నిలువెత్తు నిదర్శనం..
ఆచరించడం, చైతన్యపరచడం ఆయన నేర్చుకున్న పాఠం…
ధిక్కరించడం, ఉద్యమించడం ఆయన ఎంచుకున్న మార్గం…
కష్టాల కొలిమిలో మండిన అగ్గిరవ్వలా…సాయుధ పోరాటానికి వేగుచుక్కలా.. విప్లవాల ఆశయ సాధనలో
అలుపెరుగని పోరు సల్పిన నేత..
ఉద్యమాల గడ్డ, ఉమ్మడి నల్లగొండ బిడ్డ..
ఆయనే కామ్రేడ్‌ కాచం కృష్ణమూర్తి.
నాడు తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతున్న రోజుల్లో, నల్లగొండ జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి జనగాం తాలూకా దేవరుప్పల మండలం నీర్మాల గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తే కాచం కృష్ణమూర్తి. బాల్యం నుంచే పోరుబాటను ఎంచుకున్న ఆయన ఎన్నడూ వెనుతిరిగి చూడలేదు. ఐలమ్మ భూపోరాటం, ఆ తదుపరి సాగిన ఊరేగింపుపై దేశముఖ్‌ గుండాలు సాగించిన కాల్పులకు నేలకొరిగిన దొడ్డి కొమురయ్య ఉదంతం ఆయన జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. పేదల పట్ల భూస్వాములు సాగిస్తున్న దౌర్జన్యకాండపై తిరగబడేలా చేసింది. అప్పటినుంచి అమరుడయ్యే వరకు నమ్ముకున్న సిద్ధాంతాన్ని వీడని నిఖార్సయిన కమ్యూనిస్టు. నిజాంకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజలను చైతన్యపర్చడం, అడవుల్లో దళాలు నడపడం, భూ పోరాటం నిర్వహించడం, సంఘాన్ని విస్తరించడం, మిలటరీ క్యాంపులపై దాడి, ఆయుధాల సేకరణ ఆయన రోజువారీ కార్యక్రమంలో ఓ భాగం. అజ్ఞాతంలో ఆయన ”రాగన్న”గా పిలువబడినా ఆయనొక పోరాట దిక్సూచిగా పేరుపొందిన నాయకుడు.
సుదీర్ఘకాలం పాటు విప్లవోద్యమంలో అలుపెరుగని పోరాట యోధుడిగా, ఆయన జీవితంలో ఎన్ని కష్టనష్టాలొచ్చినా ఫ్యూడల్‌ దురాగతాలకు ఎదురొడ్డి పోరాడిన ఉక్కుమనిషి కృష్ణమూర్తి. నాడు తెలంగాణ ప్రాంతంలో భూ సమస్య అత్యంత ప్రధానమైనది ముందుకొచ్చిన సమయంలో వ్యూహాత్మకంగా ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి. 1945లో కృష్ణమూర్తి విజయవాడలో పొందిన కర్రసాము శిక్షణను ఉపయోగించుకుని ఐలమ్మ భూపోరాటంలో కర్రసాము శిక్షణతో దానికి నాయకత్వం వహించాడు.ఈ పోరాటంలో కృష్ణమూర్తితో పాటు ముఖ్య నాయకత్వాన్ని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌లో నిర్భందించి చిత్రహింసలకు గురిచేసినా పోరాటంలో వెనుకడుగు వేయలేదు. దేశ్‌ముఖ్‌లు ఐలమ్మ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. చుట్టూ నలభై గ్రామాల్లో పేరుమోసిన విసునూరు రామచంద్రారెడ్డిపై సాధించిన విజయమిది.ఈ పోరాటం అప్పటి తెలంగాణ ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది, ఎంతో ధైర్యాన్ని అందించింది. దీనికి నాయకత్వం వహించిన నేతల్లో ఒకరిగా కృష్ణమూర్తి చరిత్రలో నిలిచాడు.
అరెస్టులు, నిర్భంధం
ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో హైదరాబాద్‌ తన అత్తగారి ఇంటికి చేరుకొని ఉదయం టిఫిన్‌ చేస్తున్న కృష్ణమూర్తిని పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. కృష్ణమూర్తి కూడా పోలీసులతో ప్రతిఘటించడానికి తల్వార్‌ పట్టుకున్నాడు. ఎస్‌ఐ గన్‌ చూపిస్తూ కదిలితే చంపేస్తానని ఆయన చేతిలో ఉన్న తల్వార్‌ను లాక్కున్నాడు. నిరాయుధుడైన కృష్ణమూర్తి తప్పని పరిస్థితుల్లో అరెస్టు కావల్సి వచ్చింది.ముందుగా ముషిరాబాద్‌ ఠాణాకు, అక్కడినుంచి జనగాం స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత సింగరాజుపల్లి పోలీసు క్యాంప్‌లో చెట్టుకు కట్టేసి కాళ్లు, చేతులు బంధించి రాత్రిపూట భూస్వాములు,దేశ్‌ముఖ్‌లు మారువేశాల్లో పోలీసు దుస్తులతో వచ్చి కర్రలతో తీవ్రంగా దాడి చేయడంతో ఆయన స్పృహ కోల్పోయాడు.శరీరంలో తీవ్రగాయాలైన కృష్ణమూర్తిని తర్వాత లాకప్‌లో బంధించారు.అక్కడి నుండి ఒక లారీ నిండా పోలీసులతో చేతులకు బేడీలు వేసి తాళ్ళు కట్టి అచ్చం క్రూరమృగాన్ని బంధించినట్టుగా మోత్కూర్‌ క్యాంప్‌కు ఈడ్చుకెళ్లారు. ఇంత నిర్భాందానికి గురైన కృష్ణమూర్తిలో ధైర్యం సడలేదు కదా మరింత ఉద్యమించాడు. జైల్లో వేసినా అక్కడినుంచే రాజకీయ కార్యకలాపాలు సాగించాడు. జైల్లో ఉన్న ఖైదీలతో సమావేశమై అక్కడ సరైన వసతులు కల్పించాలని జైలు అధికారులపైనా తిరుగుబావుటా ఎగురవేశాడు. నిజాం సర్కార్‌ ఆగడాలను ఎదురించినందుకుగాను కృష్ణమూర్తిపై 30 కేసులు బనాయించారు. వీటిలో 15 కేసులను నిరూపించలేక వారే ఉపహసంరించుకున్నారు. కృష్ణమూర్తిపై మోపబడ్డ కేసలన్నీ గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ పాలనను సాగకుండా చేశాడనే నెపమే ఎక్కువ. అయన్ను ఎంత నిర్భందించినా, ఎన్ని కేసులు పెట్టినా తన జీవితంలో పోరాటాన్నే అంతర్భాగం చేసుకుని ముందుకు సాగిన వ్యక్తి కామ్రేడ్‌ కృష్ణమూర్తి.
గెరిల్లా పోరాటం
సాయుధ పోరాటం ఆరంభంలో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని తెలంగాణ పల్లెల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని పిలుపునివ్వడంతో కృష్ణమూర్తి అనేక గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరిచాడు. వారిని ఉద్యమాలకు సన్నద్ధం చేసి లెవీ ధాన్యాన్ని వసూలు చేయకుండా అడ్డుకోవడం, పటేల్‌, పట్వార్‌ల వద్ద గల రికార్డులను లాక్కోవడం, పన్ను వసూళ్లు నిరాకరించడం, పన్నులు చెల్లించకుండా ఉండటం పెద్ద ఎత్తున చేశాడు. ఒక వెల్లువలా ప్రజలు కదలడంతో నిజాం సర్కార్‌ గడగడలాడి పోయింది.ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు, రజాకారులను ఊర్ల మీదకు పంపింది.ఈ ముష్కరులు ఊర్ల మీద పడి దాడులకు ఉపక్రమించారు.ప్రభుత్వం సాయుధ దాడికి దిగేసరికి దానిని ప్రతిఘటించేందుకు తప్పనిపరిస్థితుల్లో సాయుధపోరును చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయుధాల సేకరణకు పార్టీ పిలుపునివ్వగా జాగీరుదార్లు, దేశ్‌ముఖ్‌ల గడీల మీద పడి ఆయుధాలు లాక్కోవడంతో సాయుధ గెరిల్లా పోరాటం ప్రారంభమైంది.ఇందులో కీలకపాత్ర పోషించింది కామ్రేడ్‌ కృష్ణమూర్తి. ఈ క్రమంలోనే మిలటరీ యాక్షన్‌ పూర్వం,గ్రామరాజ్యాలు వాటి పరిరక్షణకు గ్రామ దళాలు ఏర్పడ్డాయి.భూ పంపిణీ విస్తారంగా జరుగుతున్న కాలంలోనే ప్రతిఘటనా శక్తి అనేక రెట్లు పెరిగింది.నిజాం రజాకారుల క్యాంపులను తుడిచి పెట్టే ట్రెండ్‌ బయలుదేరింది.దళం వేసే ప్రతి అడుగు వెనుక జనం అండదండలు మెండుగా ఉన్నాయి.క్యాంపులనే లక్ష్యం చేసుకొని దాడులు మొదలయ్యాయి.మోత్కూరు, మొండ్రాయి, గుండ్రాంపల్లి,బైరాన్‌పల్లి రాజాకారుల,పోలీసుల క్యాంపులపై దళాలు చుట్టుముట్టి దాడి చేసి ఆయుధాలను సేకరించింది.దళాలన్ని ఒక పకడ్భంది వ్యూహంలో నడిచే విధంగా వ్యూహాలు రచించాడు కృష్ణమూర్తి.
మోత్కూరు ప్రాంతంలో గడ్డం అమీన్‌ ఆగడాలు పెట్రేగిపోయాయి.గ్రామాల్లో రజాకారులతో కలిసి దాడి చేశారు.కృష్ణమూర్తి దళం అమ్మనబోలుకు చేరుకొని అక్కడ ధాన్యాన్ని బండ్లపై పోలీసులు తీసుకుని వెళ్తుంటే ప్రతిఘటించి ఆ ధాన్యాన్ని తిరిగి ప్రజలకు పంపిణీ చేసింది. దళాలన్ని చురుగ్గా కదిలి పనిచేస్తున్న సమయంలో మోత్కూరు సమీపంలో బొడ్డుగూడెం గ్రామంలోకి అర్మీ వచ్చింది.కృష్ణమూర్తిపై నిఘా పెట్టడంతో నిర్భందం పెరిగింది. రెండు,మూడు రోజులపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దళ సభ్యులకు ఆయన క్షుణ్ణంగా వివరించాడు. ఆయుధాలను జాగ్రత్తగా డంప్‌ చేసి ఆత్మరక్షణ కోసం కావల్సిన ఆయుధాలను దగ్గర ఉంచుకొని వ్యక్తులుగా తమను తాము ఎలా కాపాడుకోవాలో దళ సభ్యులకు చెప్పాడు. అక్కడ నుండి బయలుదేరి సెంటర్‌లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డితో చర్చల్లో పాల్గొన్నాడు. తూర్పు బోనగిరి,మోత్కూర్‌ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, మిలటరీ దాడులు ప్రత్యేకంగా తమ ప్రాంతం మీద కేంద్రీకృతమైన పద్ధతిని సవివరంగా సుందరయ్యకు కృష్ణమూర్తి వివరించగా దళాలను రక్షించుకోవడంపై సుందరయ్య కొన్ని సూచనలు చేశాడు. ఇలా అనేక వ్యూహాలతో గెరిల్లా ఉద్యమాన్ని నడిపాడు కృష్ణమూర్తి.
అజ్ఞాతం అనంతరం..ప్రజాఉద్యమాల్లో
కామ్రేడ్‌ కృష్ణమూర్తి 1955 ఆగష్టు 16న అజ్ఞాతం నుంచి బయటకొచ్చి ప్రజా సమస్యలపై నిరంతరం కార్యాచరణతో ముందుకు సాగాడు.1962లో ఆరుట్ల భూపోరాటం,పాలేర్ల వేతన పోరాటం చేశాడు. చిన్నతూళ్ల గ్రామంలో పాలేర్ల సమ్మె పెద్ద ఎత్తున జరిగింది.ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి భూస్వాములు తీవ్ర ప్రయత్నం చేసినా పాలేర్లు తమ డిమాండ్లను సాధించారు.ఆ గ్రామంలో 400 ఎకరాల భూమిని ఆక్రమణ చేసి ప్రజలకు పంచారు. ముఖ్యంగా ఆరుట్ల, చిన్నతూళ్ళ, లోయపల్లి పోరాటాలు చారిత్రాత్మకమైనవి. 1967-68 కాంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాయకునిగా ఆ తరువాత ఆయన నల్లగొండ జిల్లాలోని రామన్నపేట ప్రాంతంలో పనిచేశారు. నల్లగొండ జిల్లాలో మార్క్సిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అనేక పోరాటాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు.
సుదీర్ఘ కాలంపాటు వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ విప్లవోద్యమంలో ఆయన నిర్మాణ దక్షత, పట్టుదల, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ప్రజల వెన్నంటే ఉండి ప్రజా ఉద్యమాలను జీవితంలో అంతర్భాగం చేసుకున్న గొప్ప పోరాటయోధుడు కృష్ణమూర్తి.ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన ఉద్యమబాటలోనే తెలంగాణలో నేడు గుడిసెల పోరాటం జరుగుతున్నది. ఆయన పోరాట స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా సాగుభూమి, ఇండ్ల స్థలాల పోరాటాలకు నాంది పలికింది. ఈ ఉద్యమాల రూపకల్పనలో ప్రజలు అశేషంగా పాల్గొనడం ఆయన చూపిన మార్గంలో పయనించడమే. తెలంగాణలో పేదల మౌలిక సమస్యలైన భూమి కోసం, గూడు కోసం ఐక్య ఉద్యమాలు నిర్మించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు కామ్రేడ్‌ కాచం కృష్ణమూర్తి 18వ వర్థంతి)
ములకలపల్లి రాములు
9490098338