విప్లవాత్మకమైన మార్పులకు సాధనాలు లలిత కళలు

విప్లవాత్మకమైన మార్పులకు సాధనాలు లలిత కళలు– శ్రమలోనే కళల మూలాలు : సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ
నవ తెలంగాణ – ముషీరాబాద్‌
సామాజికంగా విప్లవాత్మకమైన మార్పులకు బలమైన సాధనాలుగా లలిత కళలు దోహదం చేస్తాయని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కళా నిలయంలో సొమవారం తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో 9 రకాల భారతీయ నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ.. భారతీయ నృత్యాలు ఆధ్యాత్మిక ఆవరణలోనే కాదు ప్రజల అరుగుల మీద కూడా ప్రదర్శించినప్పుడే పలువురి ప్రశంసలు పొందుతాయని, దిన దినం అభివృద్ధి చెందుతాయని అన్నారు. కళలు ఎప్పుడూ ప్రజల ఆలోచన యజ్ఞంలోనే పాలుపంచుకోవాలని చెప్పారు. భారతదేశం ఎప్పుడూ ఏకశిలాఖండం కాదని, అది వైవిధ్యమైనదని తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి మాత్రమే కాదు ఈ గడ్డ మీద తొమ్మిది రకాల భారతీయ నృత్యాలను తన సంస్కృతిలో ఇముడ్చుకుందని చెప్పారు. బహుళ సంస్కృతులు, బహుళ మతాలు సమిష్టి జీవనానికి ఘన చరిత్ర కలిగిన మన నృత్యాలు ప్రగతి పుష్పాలుగా పుయ్యాలన్నారు. కళల గురించి ఎవరికి ఏ అభిప్రాయాలున్నా కళలు ప్రజలకు చెందినవేనని, వాటి మూలాలు శ్రమలోనే ఉన్నాయని, అవి శ్రమజీవులకే చెందాలని అన్నారు. ఆ ప్రయత్నమే తెలంగాణ బాలోత్సవం అద్భుతంగా చేస్తున్నదని ప్రశంసించారు.
నటరాజ రామకృష్ణ శిష్యులు, అభినవ సత్యభామ నాట్య గురువు డా.కళా కృష్ణ మాట్లాడుతూ.. మన భారతీయ నృత్యాలన్నీ కాలానుగుణంగా పాటలకు శాస్త్రీయతను జోడించి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవాలని, ప్రపంచ స్థాయికి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలని చెప్పారు. పిల్లల ప్రతిభాపాటవాలను వెలికి తీసే వేదికలను అందిస్తున్న తెలంగాణ బాలోత్సవానికి పిల్లలు రుణ పడి ఉంటారన్నారు. ఏనాడూ ఆది శివుడు ఢమరుకం ఆడించాడో.. నాట్యపు అడుగులు వేశాడో మనకు తెలియదు కానీ.. ప్రజల ఆలోచనలకు కొత్త దృష్టి కోణాన్ని చూపిన సుద్దాల అశోక్‌ రాసిన పాటకు నృత్యరూపం ఇచ్చిన నృత్యగురువు ఇందిర భారతీయతకే ఒక కొత్త కానుక ఇచ్చారన్నారు.
కల్చరల్‌ అంబాసిడర్‌ నృత్య గురువులు దీపికా రెడ్డి మాట్లాడుతూ.. ఊపిరి సలపని పోటీ చదువుల ఫ్యాక్టరీలలో ఉక్కిరి బిక్కిరవుతున్న పిల్లలకు తెలంగాణ బాలోత్సవం కాస్త ఊరటలా చక్కటి వేదికలు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బాలోత్సవం ఉపాధ్యక్షులు కె.సుజావతి అధ్యక్షత వహించారు. బాలోత్సవం అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు వేదికపైకి ఆహ్వానించగా, బాలోత్సవం కార్యదర్శి ఎన్‌.సోమయ్య, నృత్య గురువులు రమణి సిద్ధి, ఇందిరా పరాశరం వీరభద్రం, జి.బుచ్చిరెడ్డి, ఉపాధ్యక్షులు మమత పాల్గొన్నారు.