గాజాలో పాలస్తీనియన్ల మారణకాండకు పాల్పడు తున్న ఇజ్రాయిల్‌కు జర్మనీ చేస్తున్న ఆయుధ ఎగుమతులు నిలిపివేయాలంటూ నికరాగువా చేసిన వినతిని ఏప్రిల్ 30న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తిరస్కరిం చింది. దక్షిణాఫ్రికా దాఖలు చేసిన మరొక వాజ్యంలో మారణకాండ నిలిపివేయాలంటూ అదే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయిల్ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అలాంటి నేరదేశానికి ఆయుధాలు సరఫరా చేయవచ్చం టూ జర్మనీకి అనుమతి ఇచ్చిన తీరు న్యాయవ్యవస్థల మీద జనానికి ఉన్న విశ్వాసాన్ని పొగొట్టేది తప్ప మరొకటి కాదు. ఇప్పటికే 35,568 మందిని చంపిన యూదు దురహం కారులు ఇంకెందరినీ బలితీసుకుంటారో ఎన్ని వేల మందిని గాయపరుస్తారో తెలియదు. ఇంకా మిగిలి ఉన్న భవనాలను కూల్చివేస్తూ గాజాను మరుభూమిగా మారుస్తున్నప్పటికీ అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనియన్ల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నదనే చెప్పాలి. మరణించిన వారిలో 70శాతంపైగా మహిళలు, పిల్లలే ఉన్నారన్న పచ్చి నిజాలను చూసేందుకు నిరాకరిస్తున్నది. కోర్టు తీరు అక్కడ జరుగుతున్నది మారణ కాండ అని ఇంతవరకు రుజువు కాలేదన్న జర్మనీ వాదనను బలపరచటం తప్ప మరొకటి కాదు. ఆ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా బల పరుస్తున్న పశ్చిమదేశాలు చేస్తున్న వాదనలు కూడా అవే. ఈ కేసులో న్యాయస్థానాన్ని, ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు జర్మనీ అడుగడుగునా ప్రయత్నించటమే కాదు వంచనకు పాల్పడింది.
గతేడాది అక్టోబరులో హమాస్ సాయుధులు ఇజ్రాయిల్‌పై దాడి జరిపినపుడు ఐరాస సహాయ సిబ్బందిలో కొందరు హమాస్‌కు సహకరించారని ఇజ్రాయిల్ ఆరోపించింది. నిజానిజాల నిర్ధారణ కాకుండానే ఇతర నాటో దేశాలతో పాటు పాలస్తీనీయన్లకు ఐరాస చేస్తున్న మానవతా పూర్వక సాయానికి నిధులు నిలిపివేసిన దేశాల్లో జర్మనీ ఒకటి. గాజాలో మారణకాండ జరుపుతున్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదు కనుక తాము చేస్తున్న సాయాన్ని, విక్రయిస్తున్న ఆయుధాలను మారణకాండకు వినియోగిస్తున్నారని చేసిన అభియోగం చెల్లదని అదే జర్మన్లు ఐసిజెలో వాదించారు. భద్రతా మండలి, ఐరాస సాధారణ అసెంబ్లీలో దారుణంపై ప్రవేశపెట్టిన తీర్మానాలు, పాలస్తీనాలో భాగాలైన గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలలో ఇజ్రాయెల్ జరుపుతున్న దారుణాలు జర్మనీకి కనిపిం చటం లేదా ? ఇజ్రా యల్ దిగుమతి చేసుకుం టున్న ఆయుధాలలో జర్మనీ నుంచే 30శాతం వస్తున్నాయి. అమెరికా ప్రధమ స్థానంలో ఉంది. ఆయుధ ఒప్పందాలు అక్టోబరు ముందు చేసుకున్నవని ఒక ముక్తాయింపు, తామిచ్చిన ఆయుధాలు గాజాలో ఉపయోగి స్తున్న రుజువుల్లేవని దబాయింపు, ఇస్తున్న ఆయుధాలు యుద్ధాలకు ఉపయోగించేవి కాదని, మిలిటరీయేతర పరికరాలని బుకాయింపులకు పాల్పడింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకు అవసరమైన గడ్డి ఎక్కడుం దో చూద్దామని చెప్పినట్లుగా తాము సరఫరా చేసిన ఐదులక్షల మెషిన్ గన్ తూటాలు ఇజ్రాయిల్ మిలిటరీ ”శిక్షణ” కోసమని కోర్టుకు తెలిపింది. ఇలాంటివే ఎన్నో వక్రీకరణలు జర్మనీ దాఖలు చేసిన పత్రాల్లో ఉన్నాయి.
ఐరాస శరణార్ధుల సాయ సంస్థకు నిలిపివేసిన నిధులను పునరుద్దరిస్తామని, నికరాగువా దాఖలు చేసిన కేసును కొట్టివేయాలన్న వినతిని న్యాయస్థానం తిరస్కరించుతూనే ఆయుధ సరఫరాకు అనుమతి ఇచ్చింది. తక్షణమే ఆయుధ సరపరాల నిలిపివేతకు, సరఫరా చేసిన వాటిని ఉపయోగించకుండా ఆంక్షలు, శరణార్ధులకు చేస్తున్న సాయాన్ని కొనసాగించేలా ఉత్తరువుల ఇవ్వాలని నికరాగువా కోరింది. అలా ఇచ్చేందుకు తగినన్ని రుజువులు లేవని కోర్టు పేర్కొన్నది. గాజాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ కడవల కొద్దీ సానుభూతి ప్రకటించిన న్యాయ మూర్తులు మారణకాండలను సమర్ధించ కూడదన్న ఐరాస ఒప్పందంలో భాగస్వామి అయిన జర్మనీ మరొకరు ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందేనంటూ సుభాషితాలు వల్లించారు.శరణార్ది శిబిరాలపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఐరాస సహాయ సిబ్బంది మరణించిన ఉదంతం తెలిసిందే. గాజాలో జరుగుతున్న దారుణాలను అనేక ఐరాస సంస్థలు నివేదిస్తున్నప్పటికీ న్యాయమూర్తులు పట్టించుకోలేదు. తాను ఇచ్చిన ఆదేశాలను అమలు జరప నిరాకరిస్తున్న ఇజ్రాయిల్‌ను కట్టడి చేయలేని అశక్తత అంతర్జాతీయ న్యాయస్థానానిది. అందువలన కోర్టులను నమ్ముకొని వేచి ఉండకుండా అమెరికాలో ఉద్యమిస్తున్న విద్యార్ధుల మాదిరి ప్రపంచం లోని శాంతి, అభ్యుదయ శక్తులు పెద్ద ఎత్తున కదిలి ఇజ్రాయిల్‌ను, దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్య వాదుల మీద ఒత్తిడి తేవాలి, మారణకాండ నివారణకు పూనుకోవాలి.